మాటలు–మంటలు
వ్యంగ్యం, వెటకారం, పరిహాసం వగైరాలు అన్నివేళలా నవ్వు పుట్టించవు. వాటిని ఎడాపెడా ఉపయోగించేవారు కూడా కేవలం ఆ ఉద్దేశంతో మాత్రమే మాట్లాడరు. అవతలివారిని కించపరచడానికి కావొచ్చు... ఆగ్రహం తెప్పించడానికి కావొచ్చు... ఎత్తిపొడుపు కోసం కావొచ్చు... ఇష్టానుసారం మాట్లాడతారు. రాష్ట్రపతి ప్రసం గంపై జరిగిన చర్చకు జవాబిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో బుధవారం చేసిన ఒక వ్యాఖ్య కాంగ్రెస్‌కు ఆగ్రహం కలిగించింది. ‘రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేసే కళ ఆయనకే తెలుసు’ అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. ఎన్ని స్కాంలు బయటపడినా మన్మోహన్‌పై నిందపడలేదని చెప్పడం ఆయన ఉద్దేశం కావొచ్చు.
కాంగ్రెస్ ఇందుకు ఆగ్రహించి సభ నుంచి వాకౌట్ చేసింది. అది మన్మోహన్‌ను వ్యక్తిగతంగా అన్న మాట కాదని, యూపీఏ పాలన తీరుపై చేసిన వ్యాఖ్యానమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ సర్దిచెప్పినా కాంగ్రెస్ మాత్రం గురువారం కూడా వాకౌట్ చేయడంతోపాటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పుడల్లా సభను బహిష్కరిస్తామని ప్రకటిం చింది. తమకు మద్దతుగా ఇతర పక్షాలు కూడా పాల్గొంటాయని చెబుతోంది. బడ్జెట్ సమావేశాల సమయంలో విపక్షాలు ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తే ప్రభుత్వా నికి ఇబ్బందికరమే.
ఇతర నేతల కంటే నరేంద్ర మోదీ భిన్నమైనవారు. ఆయనను బలంగా అభి మానించేవారున్నట్టే... బలంగా వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. అయితే సమ యస్ఫూర్తిగా మాట్లాడటంలో, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించి గుక్కతిప్పు కోకుండా చేయడంలో ఆయన్ను మించినవారు ఉండరని ఈ రెండు వర్గాలూ ఒప్పు కుంటాయి. గుజరాత్ నుంచి ఢిల్లీకి రావడంలో ఈ కళ మోదీకి ఎంతవరకూ తోడ్ప డిందో బీజేపీ దిగ్గజాలకు తెలిసి ఉంటుంది. మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆయన బీజేపీ పక్షాన ఎలా ప్రచారం చేశారో అందరూ గమనించారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించడంలో మోదీకెవరూ సాటిరారు. ఒక మాటంటే పది మాటలనే రకం ఆయన. అయితే అప్పట్లో అందుకు కలిసొచ్చిన అంశాలున్నాయి.
కేంద్రంలో బీజేపీ దీర్ఘకాలం అధికారంలో లేకపోవడం... ప్రత్యేకించి మోదీ తొలిసారి కేంద్రంలో అడుగుపెట్టడం ఆయనకు అనుకూలాంశాలు. యాదృచ్ఛికమే అయినా మన్మోహన్‌పై మోదీ వ్యంగ్య బాణం సంధించడానికి ముందురోజే సుప్రీంకోర్టులో వ్యంగ్యంపై దాఖలైన వ్యాజ్యం విచారణకొచ్చింది. ‘మా సిక్కుల్ని అందరూ హేళన చేస్తున్నారు. పరమ మూర్ఖులుగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి జోకుల్ని తక్షణమే నిషేధించండి’ అంటూ పంజాబ్‌కు చెందిన న్యాయవాది ఒకరు ఆ కేసు దాఖలు చేశారు. ‘పౌరులకు నైతిక నియమావళిని ఎలా జారీ చేస్తామ’ని ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రశ్నిం చారు. అలాంటివి అరికట్టడమన్నది చట్టసభల పరిధిలోకి వస్తుందని అభిప్రాయ పడ్డారు. కానీ చట్టసభలే అలాంటి వ్యంగ్యాస్త్రాలకు వేదికలవుతున్నాయని ఆ మర్నాడే రుజువైంది.
ఇలా మంచీ మర్యాదా లేకుండా మాట్లాడటమేనా అని నిలదీసిన కాంగ్రెస్‌కు... మీరు మర్యాద తప్పి మాట్లాడలేదా అని ఎదురు ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లూటీ, దోపిడీ అంటూ అదే సభలో మన్మోహన్ మాట్లాడటాన్ని గుర్తు చేశారు. అలాంటి పదాలు వాడే ముందు 50 సార్లు ఆలోచించి ఉండాల్సిందని కూడా కాంగ్రెస్‌కు హితవు చెప్పారు. తనది భిన్నమైన మార్గమని, మాటంటే పడి ఊరుకోబోనని ఈ జవాబు ద్వారా మోదీ తెలియజెప్పారు. ఇంతకూ ఈ సమా వేశాల పరమార్ధం బడ్జెట్‌ను ఆమోదించడం, అలా ఆమోదించే ముందు కూలం కషంగా చర్చించడం.
జనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొ నడం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రకటన చేయాలంటూ విపక్షాలు చేసిన అలజడితో శీతాకాల సమావేశాలు నిష్ఫలమ య్యాయి. ఆ సమావేశాల కాలంలో అదే సమస్యపై వెలుపల అనేక సభల్లో మాట్లా డిన ప్రధాని విపక్షాలు డిమాండ్ చేసినందుకు కాబోలు... పార్లమెంటులో మాత్రం పెదవి విప్పలేదు. నోట్ల రద్దు ప్రకటన చేశాక మొదలైన కష్టాలు జనవరి నెల మధ్యవరకూ జనాన్ని వెంటాడాయి. సంపన్నుల ముంగిట్లోకి సరికొత్త నోట్లు వచ్చి వాలితే సామాన్యులు మాత్రం గంటల తరబడి క్యూలు కట్టాల్సివచ్చింది. వంద మంది మరణించారు. చిన్న తరహా పరిశ్రమలపై, చిరు వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు.
కనీసం ఇప్పుడైనా పెద్ద నోట్ల రద్దుపైనా, దానివల్ల బయటపడిన నల్ల డబ్బుపైనా సవివరమైన ప్రకటన చేయలేదు. సరిగదా నోట్లు రద్దుచేశాక ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా కరెన్సీ లోటు రాలేదని రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవా బుగా కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ‘గజం మిథ్య... పలాయనం మిథ్య...’ అన్నట్టు అంతా సవ్యంగా గడిచిందని పార్లమెంటు సాక్షిగా ఆయన చెప్పిన మాటలు విస్మయాన్ని కలిగిస్తాయి. నన్నూ, ప్రభుత్వాన్నీ విమర్శించండి. ఆర్‌బీఐని, దాని గవర్నర్‌నూ ఎందుకు ఇందులోకి లాగుతారని మోదీ ప్రశ్నించారు. అయితే పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో ఉర్జిత్ పటేల్‌ను తోటి సభ్యు లంతా నిలదీస్తుంటే ఆయనకు అండగా నిలబడింది మన్మోహనేనని మోదీ మరిచి నట్టున్నారు.
మన్మోహన్‌పై మోదీ చేసిన వ్యాఖ్యను ఎవరూ సమర్ధించలేరు. అది యూపీఏ పాలనను ఉద్దేశించి అన్న మాట మాత్రమేనని అనంతకుమార్ చెప్పడం ఇందువల్లే కావొచ్చు. ఏ నిర్ణయమైనా అందరికీ నచ్చాలని లేదు. అందునా తీవ్ర ప్రభావం కలిగించే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలనూ, దాని పర్యవసానాలనూ అందరూ మౌనంగా భరించాల్సిందేనని ఆశించడం న్యాయమేనా? ఇంతకూ నేతలు తమకు దక్కాల్సిన మర్యాద గురించి, తమ మనోభావాలు దెబ్బతినడం గురించి ఇంత పట్టుదలగా ఉంటున్నారు. మంచిదే. మరి సాధారణ పౌరులకు దక్కాల్సిన గౌరవమర్యాదల మాటేమిటి? వారి హక్కుల ఉల్లంఘన మాటేమిటి? చేసిన వాగ్దా నాల సంగతేమిటి? వారి ప్రయోజనాలను రక్షించేదెవరు?