కరుణ లేని పాలకుడు..! | No kind of humanity rulling of state with out Primary treatment | Sakshi
Sakshi News home page

కరుణ లేని పాలకుడు..!

Published Tue, Oct 4 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

కరుణ లేని పాలకుడు..!

కరుణ లేని పాలకుడు..!

రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యానికి, శోకానికి పాలకుడు కారణం కారాదు.  ఆంధ్రప్రదేశ్‌లో అనారో గ్యం తాండవిస్తోంది. ప్రభుత్వానికి ప్రజల ఆరో గ్యంపై శ్రద్ధ లేదనే విషయం అడుగడుగునా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదా సీనతే దీనికి కారణం. రాష్ట్రంలోని ప్రాథమిక వైద్యశాలలన్నీ నరకకూపాలుగా మారాయి. విష జ్వరాలకు మందుల్లేక పీహెచ్‌సీలు వట్టి పోయాయి. నిరంతర వర్షాల వల్ల  ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా వంటి జ్వరాల పాలబడు తున్నారు. లక్ష కోట్లకు పైగా వార్షిక బడ్జెట్ ఉన్న ప్రభుత్వం పీహెచ్‌సీలను పనిగట్టుకుని నిర్భాగ్యంగా ఉంచటం దారుణం. ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతూ ప్రజలు విలవిలలాడుతుంటే మరోవైపు  వెంటిలేటర్స్, బ్లడ్‌టెస్ట్ ల్యాబ్‌లు, మందులు, సరైన గదులు, శుభ్రత, సిబ్బంది లేక పీహెచ్‌సీలు తేలిపోతున్నాయి. ప్రజలు తమ ఇళ్ళ కంటే పీహెచ్ సీలే అధ్వాన్న స్థితిలో ఉన్నా యని వెనక్కి వస్తున్నారు.
 
 ‘పరిపాలనాదక్షుణ్ణి, నన్ను మిం చినవారు’ లేరనే చంద్రబాబు పాలనలో ఇలాంటి పరిస్థితి ఎందుకుంది? ఆయనకు కరుణ లేదా? ప్రజల మీద ప్రేమ లేదా? ప్రజలు అనా రోగ్యాన్ని ముఖ్యమంత్రి ఇష్టపడుతున్నారా?  సాక్షాత్తు సాంఘిక  సంక్షేమ శాఖ మంత్రి నియోజకవర్గంలోని ప్రత్తిపాడులో ప్రాథమిక వైద్య శాల పిచ్చిమొక్కలు పెరిగి ప్రజలు లోనికి వెళ్ళడా నికి వీల్లేకుండా ఉంది. సభాపతి కోడెల శివప్రసాద్ రావు ప్రాంతమైన నరసరావుపేట, సత్తెనపల్లి పీహెచ్‌సీలన్నీ నరక కూపాలుగా ఉన్నాయి. ఆయ నేమో బాత్‌రూమ్‌లు కట్టించడంలో జాతీయ అవా ర్డులు పొందాలని చూస్తున్నారు. వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గం చిల కలూరిపేటలో పీహెచ్‌సీలు  అధ్వానంగా ఉన్నాయి. యడ్లపాడు, నాదెండ్ల, గణపవరం పీహెచ్‌సీలలో వైద్యులే వైద్యశాలలకు రావటం లేదు.
 
 రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రాథమిక వైద్యం ఎందుకు చేయించలేకపోతోంది? వైద్యులు సకా లంలో వైద్యశాలకు వచ్చేటట్లు ఎందుకు చూడలేక పోతుంది? ఎంతోమంది జ్వరాలతో మరణిస్తు న్నారు. వృద్ధులైతే కుక్కి మంచం మీద పడుకుని కనీసం కషాయం ఇచ్చేవాళ్ళు అల్లాడుతున్నారు. మరణిస్తే తీసుకెళ్లేవాళ్లు లేక, చనిపోయినవారిని పూడ్చిపెట్టేవారు లేక, పూడ్చిపెట్టడానికి శ్మశానాల్లో స్థలాలు లేక, జీవించే హక్కు లేక, అకాలంగా మరణించినవారిని ఖననం చేసే స్థితి లేక ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ రెన్స్‌లు జరుపుతూ కాలక్షేపం చేయడం ధర్మమా!
 
 ప్రజలు కడుతున్న  పన్ను ప్రజలకు ఖర్చుపెట్ట కుండా మిగిలిపోతున్న నేపథ్యంలో ప్రజల దుర్భ రమైన పరిస్థితి కళ్లనీళ్లు తెప్పించడం లేదా! 2015- 16 బడ్జెట్‌ని చూస్తే ఒక లక్షా పదమూడు వేల కోట్ల బడ్జెట్‌లో 64 శాతం ప్రణాళికేతర వ్యయం చూపిం చారు. మిగిలిన 36 శాతం నిధులను రెవెన్యూ ఖాతా కింద చూపించారు. ఒకసారి ఆ ప్రణాళికేతర వ్యయాన్ని పరిశీలిస్తే జీతాలు రూ.30,403 కోట్లు, పింఛన్లు రూ.11,828 కోట్లు, వేతనేతర వ్యయం రూ.2,839 కోట్లు, నిర్వహణ రూ. 939 కోట్లు, సబ్సిడీలు, ఇతర గ్రాంట్లు రూ14,816 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ11,189 కోట్లు, రుణాల చెల్లింపులు రూ.5,087 కోట్లు, ఇతర ఖర్చులు రూ.1,536 కోట్లు ఈ మొత్తం ప్రణాళికేతర వ్యయం 78,637 కోట్లు ఉంది. ఇక ప్రణాళిక వ్యయం విష యానికొస్తే వ్యవసాయం, గ్రామీ ణాభివృద్ధికి రూ.10,424 కోట్లు, జలవనరులు రూ. 4,678 కోట్లు, విద్యుత్తు రూ. 96 కోట్లు, సామా జిక సేవలు రూ.14,904 కోట్లు, రవాణా రూ. 2,155 కోట్లు, ఇత రత్రా 2,150 కోట్లు ఈ మొత్తం రూ. 34,307 కోట్లవరకు ఉంది.

ఇందులో ఉద్యోగులకు ఇస్తున్న 30,403 కోట్ల రూపాయలకు రూ. 10,200 కోట్ల రూపాయలు మాత్రమే పని రాబటు ్టకుంటారని విశ్లేషకుల అంచనా. కార్పొరేట్ వైద్య వ్యవస్థకు ఆరోగ్యశ్రీ పేరుతో వేలాది కోట్ల రూపా యలు తగలెట్టడానికి బదులు ప్రభుత్వ వైద్యాన్నే ఎందుకు అభివృద్ధి చేయట్లేదు! చంద్రబాబు రాష్ట్రంలో ప్రాథమిక వైద్యాన్ని పునాదులతోసహా పెకిలించివేసి, తన సామాజిక వర్గం బలంగా ఆశ్ర యించి వున్న కార్పొరేట్ వైద్యాన్ని విస్తృతం చేయ డానికి రాష్ట్రంలో పెద్దఎత్తున కార్యక్రమం సాగిస్తు న్నారు ఇది తెలుగు జాతికి వెన్నుపోటు పొడవటమే.
 
నాయకత్వం అంటే ప్రజలను నడిపించటం అని అర్థం.  కానీ, ప్రజల దౌర్భాగ్యానికి, అభాగ్యా నికి, శోకానికి పాలకుడు కారణం కాకూడదు. ఆరో గ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అనేక కోణాల్లో నిలదీసే చైతన్యం కావాలి. ‘రాజ్యం అనేది మానవుల కోర్కెలను, ఆశలనూ సఫలీకృతం చేసే ఒక సాధనం మాత్రమే. రాజ్యానికీ, వ్యక్తికీ మధ్య అంతస్సంబంధాలు సమతుల్యంగా ఉండాలని’ అంభేడ్కర్ భావించారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజ్యావిష్కరణ కోసం, ప్రత్యామ్నాయ చైతన్యంతో ముందుకెళ్లాల్సిన చారిత్రక సందర్భం ఇది.
 - డాక్టర్ కత్తి పద్మారావు
 వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, అధ్యక్షులు,
 నవ్యాంధ్రపార్టీ. మొబైల్: 9849741695

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement