
పోరాటాల ప్రపంచీకరణ
అమెరికా పెట్టుబడులు భారత్‌లోకి రావచ్చు. కానీ భారతదేశ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అమెరికా ఉద్యోగాల కోసం మాత్రం వెళ్ళరాదు. నేడు శ్రామికుల వలసల ద్వారా శ్రమ శక్తి ప్రపంచీకరణ చెందుతున్నది. దీని నియంత్రణకై కొత్తగా దేశాల మధ్య సరిహద్దు గోడల నిర్మాణ ప్రక్రియ ఉనికిలోకి వస్తున్నది. దీనికి నేడు ట్రంప్ సర్కారు సార«థ్యం వహిస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో దేశాల మధ్య సరిహద్దులను చెరుపుకుని నాలుగు ఖండాలలోని సుమారు 20 దేశాల భూగర్భ గని కార్మికవర్గం, తెలంగాణ లోని గోదావరిఖనిలో ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రెండవ ప్రపంచ గని కార్మిక సభలను జరుపుకుంటున్న ఘటనకు చాలా ప్రాధాన్యత వుంది.
పాతికేళ్ల ప్రపంచీకరణ ప్రక్రియ గని కార్మికుల సంఖ్యను కుదించింది. ఉదా:– సింగరేణిలో కార్మికుల సంఖ్య ఈ పాతికే ళ్లలో లక్షా పదహారు వేల నుంచి 56 వేలకు తగ్గిపోయింది. ఉత్పత్తి పెరిగింది. పని భారాలు పెరి గాయి. శాశ్వత కార్మికుల స్థానంలో, ఒప్పంద (కాంట్రాక్టు), పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) కార్మికులు ఉనికిలోకి వచ్చారు. వీరి జీతాలు బెత్తెడు. పనిభారాలు బారెడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆదాయం పన్ను (ఐ.టి.) కోత మరో ఎత్తు. ఏటా రెండున్నర నెలల జీతాలను ఐటీ పేరిట ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నాయి. ఈ ప్రపంచీకరణ దుష్ఫలితాలు భార త్‌కే పరిమితం కాదు. ప్రపంచ గని కార్మిక వర్గానికి వర్తించే సార్వత్రిక కష్టనష్టాలివి. ఈ నేపథ్యం నుంచే ప్రపంచ గని కార్మిక వర్గం మధ్య పరస్పర సమన్వయ కృషి ప్రారంభమైంది.
సుమారు ఐదారేళ్ల సమన్వయ కృషి ఫలితంగా 2013 మార్చిలో పెరూ దేశంలో మెుదటి ప్రపంచ దేశాల గని కార్మిక మహాసభలు జరిగాయి. భారతదేశంలో రెండో సభలు జరపాలన్న సూచన ఆనాటికే వచ్చింది. అయితే 2016 ఫిబ్రవరిలో ఐసీజీ సమావేశం చర్చించి, గోదావరిఖనిలో జర పాలని నిర్దిష్టంగా తీర్మానించింది. జర్మనీ, భారత్, రష్యా, కజకిస్తాన్, పోలండ్, బెలారస్, ఉక్రెయిన్, కొలంబియా, పెరూ, కాంగో, కెన్యా, టోగో, మెురాకో, ట్యునీషియా, తదితర దేశాల ప్రతినిధులు దాదాపు 75 మంది జనవరి 31వ తేదీకే గోదావరిఖని చేరుకున్నారు. మెుత్తం 105 మంది విదే శీయులు రావచ్చు. దేశ వ్యాపితంగా 300 మంది భారతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. మెుత్తం 450 మంది ప్రతినిధులతో జరగనున్నది.
పాతికేళ్ల పెట్టుబడుల ప్రపంచీకరణ ప్రక్రియ వెర్రితలలు వేసే స్థాయిుకి చేరింది. శ్రామికుల వలసలను అడ్డుకోవటానికి మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం తన లక్ష్యమని ట్రంప్ ప్రకటించాడు. ఇరాక్, అప్ఘానిస్తాన్ వంటి దేశాల సరిహద్దుల కూల్చివేతకు పూనుకున్న గత అమెరికా దేశాధ్యక్షులకు భిన్నంగా నేడు ట్రంప్ గోడల నిర్మాణం చేపడతానంటున్నాడు. గత పాతి కేళ్ల ప్రపంచీకరణ ప్రక్రియ నిర్జీవ పెట్టుబడులకూ, సరుకులకూ దేశాల సరి హద్దులకి అతీతంగా యధేచ్చగా తరలిపోయే స్వేచ్చను కల్పించింది. కానీ సజీవ శ్రమశక్తికి అలాంటి స్వేచ్చను ఇప్పుడు హరించి వేస్తున్నారు. అమె రికా పెట్టుబడులు భారత్‌లోకి ‘మేకిన్ ఇండియా’ కోసం రావచ్చు. కానీ భారతదేశ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అమెరికా ఉద్యోగాల కోసం వెళ్ళరాదు. పెట్టుబడుల ప్రపంచీకరణ ప్రక్రియకి ప్రతిస్పందనగా శ్రమశక్తి కూడా ప్రపంచీకరణకు గురవుతున్న వేళ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడయ్యాడు. సరిగ్గా ఇప్పుడే అంతర్జాతీయ గని కార్మిక సభలు జరగడం విశేషం.
‘ప్రపంచ పెట్టుబడి’ అన్ని దేశాల భూగర్భ ఖనిజ సంపదలను తన వశం చేసుకోవడం ద్వారా ప్రపంచీకరణ చెందింది. ఎల్లలు లేని ఈ తరహా ప్రపంచ పెట్టుబడి నుంచి ఏ ఒక్క దేశం విడిగా తన ఆత్మరక్షణ చేసుకోవడం సాధ్యం కాదు. ప్రపంచీకరణ చెందిన పెట్టుబడిని ప్రపంచీకరణ చెందు తున్న శ్రమశక్తే నిర్ణయాత్మకంగా ప్రతిఘటించగలదు. ఈ రోజు గని కార్మిక రంగంలో పురుడు పోసుకుంటున్న ఈ ప్రక్రియ మున్ముందు అన్ని రంగాల కార్మిక వర్గానికీ, ఇతర పీడిత వర్గాలకూ స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.
(గోదావరిఖనిలో ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు రెండవ అంతర్జాతీయ గని కార్మిక సభలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం సా’’ 3 గం’’లకు విఠల్‌నగర్ పార్కు నుంచి ప్రదర్శన, అనంతరం 5 గం’’లకు జి.యం. కాలనీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరుగుతున్న సందర్భంగా..) పి. ప్రసాద్, ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కార్యదర్శి