యాభయ్యేళ్లుగా వంగపండు పాటా హుషార్!
సందర్భం
శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం దగ్గర్లో బొండపల్లి, పెద బొండపల్లి అనే గ్రామాలు వస్తాయి. ఆ పెద బొండపల్లి వంగపండు ప్రసాదరావు స్వగ్రామం. చదివిన చదువులా.. కూలీ నాలీ చేసు కునేందుకు పనికి వచ్చే సామాన్యమై నవి. పాడిన పాటలా.. ఇరవయ్యో శతా బ్దపు ప్రజా ప్రతిఘటన వారసత్వంలో వెలు వడ్డ జంఝావతి పొంగులు, వంశధార నిరసనలు, మహేంద్ర తనయ గర్జనలు. భిలాయి స్టీల్ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు, పొట్ట చేత పట్టుకు అక్కడికి పనికి పోయే శ్రీకాకుళం జిల్లా పేదలు పాడు కునేవారట ‘‘ఏం పిల్లడో భిలాయి వత్తవా?’’ అది విని పాట కట్టాడు వంగపండు ‘‘ఏం పిల్లడో ఎల్దుమొత్తవా, ఏం పిల్లో ఎల్దామొత్తవా’’ అంటూ.
వంగపండు పాట 1970ల్లో తెలుగునాట చెలరేగిన తీవ్రతర సామాజికోద్యమంలో ప్రజలకు గల తిరగబడే హక్కును సమ ర్ధిస్తూ నిలబడ్డ ప్రజల పక్షమై నిలబడటమేకాకుండా, ప్రముఖ విప్లవ కవులతో సాటిగా, వారి మన్ననలందుకుంటూ వేదిక లెక్కింది.
శ్రీశ్రీ వంటి ప్రఖ్యాత కవులు, ఈ ఉద్యమ సమయాల్లో, లిఖిత కవిత్వం చదివే మధ్యతరగతి వారి కన్నా, విప్లవ చైతన్యం పొందాల్సిన పేదలకు, వంగపండు, గద్దర్ వంటి వారి పాటలే శ్రేష్టమైనవని వారికే ముఖ్య పాత్ర ఇచ్చిన కాలం ఉన్నది. ఇది వంగపండు మాటల్లోనే వేల ప్రదర్శనలు పడిన ‘భూమి భాగోతం’ విషయమై స్పష్టం. ‘‘సిక్కోలు యుద్ధం’’ కూడా ఏదో ప్రాంతీయ దృష్టి కోణం నుంచి కాక, యావత్ తాడిత, పీడిత, బడుగు ప్రజల తరఫున, వాక్కు గేయంగా మలచ గల పోరాట శీల కళాకారునిగా వంగపండు సమాజానికి అందచేసిన ఒక సమర స్మృతి.
వ్యవసాయ జీవనుల దుస్థితి, నగర పెట్టుబడిదారీ పారిశ్రా మికత కార్మికులకు కలిగిస్తున్న కడగండ్లు, వంగపండు రచ నల్లో, సమాన ప్రాముఖ్యత కలిగి ఉండడం విశేషం. ‘‘మడిలో బెడ్డ లన్నీ మన నెత్తురు గడ్డలు, పండిన పంటలన్నీ మన సెమట సుక్కలు, పట్టా పట్టుకొని మన పొట్టలు కొట్టాలని లారీ తెచ్చిన బాబుకు తూరుపు సూపించ రండి’’ అని రాసినా, ‘‘యంత్రమెట్ట నడుస్తూ ఉందంటూ’’ అని యంత్ర భూతముల కోరలు తోమే వారి విలా పాగ్నులు, విషాదాశ్రులు గురించి రాసినా, వంగపండు శ్రామిక వామపక్ష ప్రయోజన కవిగానే, తన అర్ధ శతాబ్దపు రచన కొనసాగించడం విశేషం.
వెన్నెల చూపెట్టి సింహాలను చేయవచ్చునా పిల్లలను? వంగ పండు రాసిన మరొక గిరిజన బాణీ గీతం ‘‘రావనా సెందనాలో’’ – ఎవరికైనా వెన్నెల ఒక భావ కవితాసమయం కావచ్చు, కానీ, ఈ పాటలో అంటుంది ఓ అభాగ్యురాలు అమేయమైన ఆత్మ విశ్వాసంతో, ‘‘పేరులేని దానినీ, పేద దానినీ, పంట లేని దానినీ, ఇంటి దానినీ, అన్నమంటే నాకొడుకూ నిన్నూ జూపించుతాను, సిన్నారి నా కొడుకును ఎన్నెలా, సింహప్పిల్లనే చేత్తాను ఎన్నెలా!’’
వంగపండు పాటలో పేదల విధ్వంసకరమైన హాస్యం తొణి కిసలాడుతుంది. ఈ వ్యంగ్యం, ఎన్నో బాధలు ఎరిగిన ప్రజల మనోస్థితికి అద్దం పడుతుంది. పైసా పాటలో, ఇవాల్టి నోట్ల రద్దు విడ్డూరాలన్నీ ఆనాడే కళ్ళకు కట్టినట్టు చెప్పాడు, ఈ జన ఫిరంగి గుండు వంగపండు–‘‘చిన్నది కాదయ్యో పైసా, చిత్రాల మొగు డయ్యో పైసా, అది నీ కాడుంటది, నీ కాడుంటడది, మూడవ వాడిని మురిపిస్తంటది, రాత రాయదయ్యో పైసా, రాజ్యం ఎల్త దిరో పైసా, –అది సదువులిత్తది , సరుకులిత్తది, ఎదవలకేమో పద వులిత్తది, చేతులుండవయ్యో పైసా, చేతుల్నీ తిరుగుద్దీ పైసా అని’’ ధనస్వామ్యపు వికృతాలపై ఒక బీభత్స గీతం కట్టగలడు.
చెరిగి పోతున్న వేల గ్రామాల తరపున ఒక బృహత్ కైఫీయత్ గా తన పాటల్లో నిక్షేపించిన వాడు వంగపండు. ‘‘ఊరు బంధం’’ పాటలో మనం ఈ శతాబ్దంలో బాగా సాధన చేసిన, గ్రామాల నిరాదరణ పట్ల కన్నెర్ర చేయడు కానీ, కళ్ళారా ఏడుస్తాడు. ‘‘ఊరో నా ఊరో– నా సెరుకు ముక్కలూరో, నా అరిసి పప్పలూరో, నా తోపుండల ఊరో–నా పోకుండల ఊరో–కాటు బెల్లం నాకుతుంటే కమ్మగున్న ఊరో–కమ్మకమ్మగున్న ఊరో–అంటూ ఎలుగెత్తి, చెరిగి పోతున్న పల్లె తల్లిని నోరారా పిలుస్తాడు, ఈ జనం గుండెల చెండు వంగ పండు.
నాలుగు వందల పాటలకు పైగా రాసి, పాడి, సినిమాలలో నటించి, తెలుగు లోగిళ్ళలో, కార్మిక కర్షక కాంభోజి, ప్రమాద వీణల కమాచి పాటగా, చెలరేగుతున్న వంగపండు, అడవి దివిటీలు నాటకం, కారా మాస్టారి ‘‘యజ్ఞం’’ వంటి కథా గేయ కావ్యాలను సైతం రక్తి కట్టించాడు. పాట కట్టి, గజ్జె బిగించి, ప్రజల ప్రయోజనాలకు నిత్యం పహారా కాస్తూన్న కాపలాదా రుగా, తన వివిధ కళాకృతులకు యాభై ఏళ్ల సందర్భంగా, సంపా దకులు, రైటర్స్ అకాడమీ నిర్వాహకులు రమణమూర్తి ఆధ్వ ర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సాయంత్రం అయిదు గంట లనుంచి ఇవాళ విశాఖలో వంగపండు ఆటాపాటా.
రామతీర్థ
కవి, విమర్శకులు ‘ 98492 00385