వాడుకమాటల వరద
సరిగ్గా 125 ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని, అది ఏ నూతన జ్ఞాన కాంతిని అందించిందో గుర్తించకుండా... దానిలో లేని విషయాలను పట్టుకుని విమర్శలు గుప్పించడం ఏమిటి?
ఒక నాటకం, సాహిత్య ప్రక్రియగా, ప్రదర్శనా వినూ త్నతలతో, నూట పాతికేళ్లు బతికి ఉంది అంటే, ఏమిటి ఈ విజయ రహస్యం అని అడ గవచ్చు. అయితే దానికి, జవాబు చెప్పడానికి కన్యా శుల్కం నాటకకర్త మన మధ్య లేరు. నాటకమా మాట్లాడదు. మరి సమాధానం ఎలాగ? ఈ ప్రశ్న గురజాడ అప్పా రావు నాటకం కన్యాశుల్కం గురించి. కలకత్తా నుంచి 29 జనవరి 1912న రాసిన ఒక పూర్తిగా దొరకని ఉత్తరంలో ఇలా చెప్పారు గురజాడ. ‘‘తెలుగులో నవ్యరీతులకు, నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్య కళ నవీనం.
కావ్య ఇతివృత్తాలు భార తీయం... జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను. నాకా కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. వాటిని సంస్కృతిపరులు మాత్రం అర్థం చేసుకుని హర్షించగలరు. సంస్కృతి శూన్యులు కావ్య కథా సంవిధాన, హాస్య ధోరణులను గమనించి అంతటితో సంతృప్తిపడతారు’’.
నవ్య రీతులు, నూతన ప్రమాణాలు, నవీన కావ్య కళ అని పైన గురజాడ ఇచ్చిన ఆధారాలతో మనం ఈ నాటకం, అలాగే, గురజాడ ఇతర రచనల దీర్ఘ జీవన దివ్య రహస్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయ గలం. గురజాడ, కన్యాశుల్కం నాటకం రాయడానికి ముందర తెలుగు రచన చేయనే లేదు. తెలుగులో ఆయన తొలి రచన ఇది.
బహుశా గురజాడ 1919లో నాటకాన్ని పూర్తిగా తిరగరాసి, రెండు అంకాలు పెంచక పోతే, ఈ నాటకాన్ని ఇంతలా పట్టించుకోవలసిన అవ సరం ఉండేది కాదు. 19వ శతాబ్దపు అనేక భారతీయ నాటకాల వలె ఇది కూడా ఒక చరిత్ర పేరాగా మారి ఉండేది. కానీ, కళలో జీవితం నిండుగా కనిపించాలన్న పరిపూర్ణత్వ అన్వేషకుడు గురజాడ కావడం మూలాన, ఈ కన్యాశుల్కం నాటకం, ఇవాళ, 19వ శతాబ్దపు సాహి త్యంలో ఏకైక ఆధునిక భారతీయ సజీవ నాటకంగా, తెలుగు వెలుగుగా ఎదిగింది.
ఈ ఆయుష్షు, యశస్సు కలగడానికి గురజాడ చేసిన ప్రత్యేక పరిశ్రమ ఏమిటి? అది ‘‘పాత కొత్తల మేలు కలయిక’’ అన్న నాలుగు మాటల ఒక సజీవ వారధి. ‘‘ఔరా ఇంద్రజాలీ, పంతులు గొంతు ఎలా పట్టావ్?’’ అంటుంది మధురవాణి శిష్యునితో, వాడు పేకాట ఆడుతున్న మధురవాణిని, ఆమె పేకాట దోస్తు లను రామప్పంతులు గొంతుతో హడలగొట్టినప్పుడు. అలా పాత్రలందరి గొంతులు పట్టిన అసలు ఇంద్రజాలి గురజాడ. కన్యాశుల్క నాటకం చేసే చాలా కనికట్టుల్లో ఒకటి వాడుక భాషకు పెద్ద పీట వేయడం.
అలాగే పోలిశెట్టి తన పేకాట ముక్కలు ఎత్తేట ప్పుడు ‘‘నరసిమ్మ నీ దివ్వే నామ మంతరము చేత’’ అని ముక్కలు ఎత్తుతుంటాడు. ‘‘ఛప్! నోర్ముయి’’ అని పేకాట మిత్రులు గసుర్తుంటారు. ఇక్కడ గురజాడ ప్రస్తావిస్తున్నది కేవలం ఒక యేల పదం కాదు. అది కరీంనగర్ ప్రాంతంలోని ధర్మపురి దేవతపై రాసిన నర సింహ శతకంలోని ఒక పద్యం. రాసిన కవి ధర్మపురి శేషప్ప (1670 –1750). పేకాట ఆడే పోలిశెట్టి, ఎందుకీ పద్యం పాడుతున్నాడూ అంటే, తాను ధర్మపురి నించి విజయనగరం వలస వచ్చిన కోమటిశెట్టి అయి ఉండాలి. అందుకే, పేకాట కూడా గెలుపు కాంక్షతో చేసే యుద్ధం లాంటిదే కనుక, తన ఇష్టదైవాన్ని తలుచుకుం టున్నాడన్నమాట. ‘‘నరసిమ్మ’’ అనగానే అదేదో సింహా చల దైవ ధ్యానం అనుకుంటాము. కానీ గురజాడ చెప్ప కుండా చెక్కిన ఈ చెణుకు, ధర్మపురి శేషప్ప రాసిన నర సింహ శతకంలోని మూడో పద్యంగా ఉన్నది.
‘ప్రాబల్యవర్గాల సాహిత్య ఆధిపత్యం వల్లనే కన్యాశుల్కంకు బ్రహ్మరథం పడుతున్నార’ని పాతికేళ్ల క్రితమే కొత్త దారుల ఇలవేల్పులు విమర్శించారు. కానీ విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం అంటూ పాతికేళ్లుగా ఉద్య మాలు చేసి అలిసిపోయిన అస్తిత్వవాదం ఇవ్వాళ అదే ప్రాబల్య వర్గాల ముందు సాగిలబడి అమ్ముడుపోవడా నికి సిద్ధమైపోయింది. అసలు గురజాడను స్థానిక పరి మితులలో ఇరికించడమే తప్పు. భారతీయులను ప్రాపం చిక పౌరులుగా తీర్చిదిద్దడం, ఆనాటికి భారతీయ సాహిత్యం ఎరిగి ఉండని ఆధునిక సంస్కారాన్ని పరిచ యం చేయడమే కన్యాశుల్కం నాటక లక్ష్యం.
మొదటి పేజీలోనే ఆంగ్ల సాహిత్య ప్రస్తావనలతో మొదలయ్యే కన్యాశుల్కం నాటకంలో కాళిదాసు, శ్రీనాథుడు, శంకరాచార్యులు, షేక్సి్పయర్, విడో పద్య మూల (ది మదర్) కవయిత్రి టేలర్, సూరకవి, ధర్మ పురి శేషప్ప, జావళీలు, తత్వాలు, హిందూస్తానీ దోహాలు, సుమతీ పద్యాలు, వేమన పంక్తులు, చమకం ప్రస్తావనలు, క్రిస్టియన్ సూక్తులు, గురజాడ కట్టిన పద్యాలు, ఇలా ప్రతి పద్య ప్రస్తావన, విపులంగా చెప్పు కోదగిన ఒక సాంస్కృతిక సందర్భమే.
ఇన్ని సంస్కృ తుల ప్రాణవాయుబలంతో పరిఢవిల్లుతుండటమే, కన్యా శుల్కం నాటక దీర్ఘ యశస్సు, ఆయుష్షు, ప్రయోజనశీల తకు ఒక ప్రధాన కారణం. పాతకొత్తల మేలు సారం అయిన సంస్కృతి నేలకు ఒరిగితే తప్ప, ‘కన్యాశుల్కం’ నేలకు ఒరగదు. మంచిని పెంపొందించే కళాశీల దృక్పథం కలిగిన కన్యాశుల్కం కూడా చిరంజీవి, చిరాయువు.
(విజయనగరం, విశాఖపట్నం వేదికలలో ఆగస్టు 26 నుంచి 28 వరకు జరుగనున్న ‘కన్యాశుల్కం’ 125 ఏళ్ల జాతీయ ఉత్సవాల సందర్భంగా..)
రామతీర్థ
వ్యాసకర్త కవి, విమర్శకుడు 98492 00385