ramatheertha
-
మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ
జమాల్ ఖషోగ్గి జటిల మైన వ్యక్తి. కానీ ఆయన కుమార్తెలమైన మాకు ఆయన సింపుల్ ‘డాడ్’ మాత్రమే. మా కుటుంబా నికి ఆయన చేసే పనంటే గౌరవం. ఆయన పాస్ పోర్ట్ నిండా ఎన్నో దేశాల ముద్రలు, తిరిగి వచ్చిన ప్రదేశాల ఆనవాళ్లూ ఉండేవి. తెచ్చిన అనేక పత్రి కలు, పుస్తకాలు, ముతక వాసన వేస్తూ, ఆయన టేబుల్ చుట్టూ క్లిప్పింగులుగా అమర్చి ఉండేవి నిత్యమూ. తిరిగి వచ్చేటప్పుడు, ఆయన మాకెన్నో బహుమతులను తేవడమే కాక, ఉత్కంఠ కలిగించే దూరదేశాల కథలెన్నో చెప్పే వాడు. మేం అమ్మా నాన్నల జ్ఞాన సముపార్జన ప్రేమ వలయంలో పెరిగాం. వాళ్ళు మమ్మల్ని ఎన్నో మ్యూజియంలకు, చారిత్రిక ప్రదేశాలకు తీసుకువెళ్లి, అవన్నీ విపులంగా చెప్పేవారు. జెడ్డా నుంచి మెదినా దాక కార్లో ప్రయాణం చేసేటప్పుడు చుట్టూ çవున్న ప్రదేశాల చారిత్రిక ప్రాధాన్యత మాకు చెప్పేవారు. ఎప్పుడూ ఆయన తన చుట్టూ పుస్తకాలతో ఉన్నా, ఇంకా పుస్తకాలు కావాలనే వారు. చదివిన విస్తార గ్రంథాలలో, ఎప్పుడూ ఇవే కావాలి అనో, అవి వద్దు అనో ఆయనకు ఎంపికలు ఉండేవి కావు. ఆ పుస్త కాల్లోని భిన్న వాదనలు, అభిప్రాయాలను ఆకళింపు చేసుకునేవారు. ఆయన జీవితం నిండా ఎన్నో అనూహ్యమైన మలుపులు, మెలికలు. అవి మా కుటుంబాన్నంత టినీ ప్రభావితం చేసేవి. కొద్ది సంవత్సరాల వ్యవ ధిలో, ఎవరైనా రెండుసార్లు ఉద్యోగం నుంచి తొలగించబడి ఉండరు. ‘అల్ వతన్’ పత్రిక ప్రధాన సంపాదకులుగా ఉండగా నాన్నకి ఈ అనుభవం ఎదురయింది. ఏం జరిగినా సరే, నాన్న ఒక ఆశా వాది. ప్రతి సవాలులో ఒక కొత్త అవకాశాన్ని చూడడం నాన్న తత్వం. అభిప్రాయాలు వ్యక్తపర్చ డం, తన భావాలను పంచుకోవడం నాన్నకి చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఆయనకి రచన కేవలం పని కాదు. అదొక తప్పనిసరి కర్తవ్యం. రంజాన్ పండుగ రోజుల్లో మేం వర్జీనియాలో ఉండగా, ఏడాదిగా తన కోసం నిర్మించుకున్న చిన్న లోకాన్ని చూపించాడు. మమ్మల్ని తన స్నేహితులకు పరిచయం చేశాడు. తను తరచుగా వెళ్లే ప్రదేశాలు చూపెట్టాడు. అక్కడ అమెరికాలో ఎలా తన కోసం ఒక చిన్న లోకం ఏర్పాటు చేసుకున్నాడో, అలాగే, తన స్వదేశం సౌదీ చూసేందుకు, తన కుటుంబాన్ని, తన ప్రియ సహచరులను కలిసేందుకు తపన పడే వాడు. సౌదీ అరేబియా వదిలి వెళ్లవలసిన రోజున తన గుమ్మంలో నిలబడి తను తిరిగి వస్తానా మళ్ళీ, అన్న అబ్బురపాటుకి గురయ్యాను అని చెప్పాడు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, చేసిన ప్రయా ణాలు, వీటివల్ల ఎంత తలమునకలుగా ఉన్నా, తాను తిరిగి స్వదేశం వస్తాను అన్న ఆశతోనే నాన్న బతికారు. ఎందుకంటే, నిజానికి, నాన్న అసమ్మతి దారు కాదు. అక్టోబర్ రెండు తరువాత, మా కుటుంబం వర్జీనియాలో నాన్న ఇంటికి వెళ్లాం. అక్కడ మా గుండెలు కలచి వేసింది, నాన్న కూచునే ఖాళీ కుర్చీ. ఆయన లేని శూన్యం మా చెవుల్లో హోరెత్తింది. మాకు అక్కడ కూచుని ఉన్న నాన్న కనిపిస్తున్నాడు. తలపైకి పెట్టుకున్న కళ్ళద్దాలు, ఏదో చదువుతూ, తీరిక లేకుండా. ఆయన రచనలు చూస్తూ ఉంటే, తాను సౌదీ తిరిగి వచ్చే నాటికి, తనకు, ఇతర సౌదీ పౌరులకు, ఆ దేశం మరింత జీవన భద్రతతో కూడిన మెరుగైన ప్రాంతంగా మారాలన్న ఆశ కనిపిస్తుంది. ఇది నాన్నకి నివాళి కాదు. ఎందుకు కాదు అంటే నివాళి అయితే, అక్కడితో ఈ విషయం ఆగి పోతుంది. అంతకన్నా ముఖ్యంగా ఇదొక వాగ్దానం. ఆయన వేలార్చిన కాంతి ఎప్పటికీ వెలిసి పోదు అని. ఆయనకు జ్ఞానం, సత్యం అంటే ఉన్న గౌరవం, ప్రేమ మాకు నిరంతర ప్రేరణ. వచ్చే జన్మలో మేము ఆయనను కలిసే దాకా. – నోహా ఖషోగ్గి, రజన్ జమాల్ ఖషోగ్గి (అక్టోబర్ రెండున టర్కీ లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయంలో, సౌదీ రాజ్య ఆమో దంతో 58 ఏళ్ల జమాల్ ఖషోగ్గి హత్యకు గుర య్యారు. ఆయన కుమార్తెలు నిండైన ఆత్మ గౌర వంతో చేసిన రచనకు తెలుగు అనువాదం) వ్యాసకర్త : రామ తీర్థ, ప్రముఖ కవి, రచయిత మొబైల్ : 98492 00385 -
లోకయాత్రికుడి విశేషయాత్ర
అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన పేరుకి అర్థమే లోక యాత్రికుడని. ఐక్యరాజ్యసమితిలో యువ రాజకీయవేత్తగా అత్యద్భుత ప్రసంగం చేసి భారతీయ ప్రతిభను విశ్వవ్యాప్తం చేసినా, అణు పరోక్ష వలసవాదానికి (ఇండైరెక్ట్ నూక్లియర్ కలోనియలిజం) వ్యతిరేకంగా, అమెరికా నిఘా సంస్థలు కనిపెట్టలేని వ్యూహంతో భారతీయ అణు వైజ్ఞానిక రంగాన్ని సాహసోపేతమైన అణు బాంబు పరీక్ష ద్వారా ముందుకు తీసుకు వెళ్లినా.. భిన్నరంగాల్లో జీవన ఆసక్తులు, నైపుణ్యాలు కలి గిన ఈ దేశ రాజకీయవేత్తల తరానికి చెందిన చివరి దార్శనికుడుగా భావించదగిన వాడు. పదవులకు వన్నె తెచ్చిన మానవ శిఖరం ఆయన. తను ప్రధానిగా ఉన్న కాలంలో, అలవి గాని ముఖ్యమంత్రులకు ‘రాజధర్మం’ అంటే ఏమిటో తెలియచెప్పేందుకు సహనశీల ప్రయత్నం చేసినవాడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన ఉన్నత సంస్కారం గల భారతీయ పౌరుడు. భారత మాత పుత్రుడు. వక్త, రచయిత, కవి, భారతీయ సంస్కృతీ జ్ఞాన సంపన్నుడు, ఇటువంటి విశిష్టమూర్తి ప్రస్తుత ఓట్ల, నోట్ల, సీట్ల, ఫీట్ల రాజకీయ రంగంలో కనిపిం చడు. హిందీ కవిగా కూడా ఉత్తర భారత సాహిత్య లోకానికి చిరపరిచితుడు. విలువల రాజకీయాల స్థాపనలో వజ్ర సమానుడు. ఆయన్ని మనం కోల్పోయిన ఈ క్షణాల్లో, విభేదాలకు అతీతంగా భారతీయ పౌరసమాజం, రాజకీయ నాయకులు, ఇతర వర్గాలు, ముక్తకంఠంతో ఈ నవభారత సేనానికి నివాళి ఆర్పిస్తున్న వేళ, కవిగా ఆయన పలికిన వివేక వాణి నుంచి కొన్ని మంచి ముత్యాలు. రెండు రోజులు దొరికాయి ప్రసాదంగా గాయాల ఈ వ్యాపారంలో ప్రతిక్షణం లెక్క చూసుకోనా లేదూ నిధి శేషాన్ని ఖర్చు పెట్టేయనా ఏ దారమ్మట వెళ్ళాలి నేను? పగిలిన కలల వెక్కిళ్లు వినేదెవరు లోలోపలి తెగని వెత కనురెప్పలపై నిలిచింది ఓటమి ఒప్పుకోను, వెనుతిరగను పోరులో కాల కపాలం మీది రాత చెరిపేస్తాను నవగీతం పాడుతాను, నవగీతం పాడుతాను ఎందుకు నేను క్షణ క్షణంగా బతకకూడదు కణ కణంలో అలరిన అందాల్ని తాగకూడదు రేపు రేపంటూ ఉంటే ఇవాళ అన్నీ చేజారుతాయి గతం, భవిత వీటి తలపోతలో ఓడి పోతావు నేడు అనే పందెం నన్ను నేను ఇతరుల అంచనాల్లో చూసుకోగలుగుతున్నాను నేను మౌనంగానూ లేను, పాడడమూ లేదు నిన్న ఉన్నది నేడు లేదు నేడున్నది రేపుండదు ఉండడం, ఉండక పోవడమనే దశ ఇలాగే సాగుతూ ఉంటుంది. నేనున్నాను, నేనుంటాను అనే భ్రమ మాత్రం ఉంటుంది నిత్యం మండుటెండలో కమ్మింది చీకటి సూర్యుడు నీడ చేతిలో ఓడాడు లోలోని స్నేహాలకు ఒత్తిడే దక్కింది ఆరిన దీపాలకు వెలుగిద్దాము రండి మళ్ళీ దివ్వెలు వెలిగిద్దాము మూలం – అటల్ బిహారీ వాజ్‌పేయి రచన – హిందీ నుంచి కవితాపంక్తుల అనువాదం రామతీర్థ, కవి, విమర్శకులు మొబైల్ : 98492 00385 -
అలాంతర్గామి గరికిపాటి కలం కడలి హోరు
మన కాలపు మహాబలిపురం రాతి ఏనుగు గరికిపాటి నరసింహారావు గారు. సాహిత్య లలిత కళా పల్లవునిగా వారి ఆభివ్యక్తి శిల్పారామం వాగ్మానస గోచరంగా ఉంటూనే, ఒక అలౌకికావరణంలోనికి మనలను తీసుకువెళ్తుంది. పద్య దారగా పటిష్టమై కుప్పించి ఎగసిన భావ తరంగాల హేష వినిపిస్తుంది వారి కండువా అంచుల కడలి కెరటాలుగా, ఒకప్పుడు కృష్ణుడి పేరిట నారాయణ తీర్థుల తరంగాలు నేటి కమనీయమైన తెలుగు పలుకుబళ్ళు. సాగర ఘోషగా గరికిపాటి చేసిన లోకదర్శనం ఈ వెయ్యిన్నూట పదార్ల పద్యాల్లో భిన్న వృత్తాల్లో ఉన్నది. మూలం తెలుగులో వెలుగు చూసి అష్టాదశ వర్షాలు కాగా, నేటికి ఈ రచన, ఇంతకు ముందరే కొన్ని ఆంగ్ల అనువాద రచనలు చేసిన మహతి గారి ఇంగ్లిష్ అనువాదంలో విశాల ప్రపంచానికి పరిచయం అవుతున్నది. ప్రథమాంతరంగం, ద్వితీయ అంటూ పది అంతరంగాలుగా విభజించి, అటు తరంగాలు, ఇటు అంతరంగం ధ్వనించేలా, తెలుగులో ఉన్న తరంగ విభాగాన్ని, ఆంగ్లంలో అధ్యాయాలుగా మార్చారు. ఉప విషయ శీర్షికలు మూలంలో ఉన్నవి తొలగించారు. అంకితం కూడా తీసేశారు. విపులంగా పాద సూచికలు ఇచ్చిన మాటలు చూస్తే, వందల ఏళ్ల కిందటి పాత నార్స్ కాలపు మాటలు అయిన ్ఛట్ఛ, వంటి ( before అనేది ఆధునిక వాడుక) మాటలు వాడారు. బడబాగ్నిని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అని వాడాలి సులభంగా అర్ధం చేసుకోవడం మన లక్ష్యం అయితే. గుయోట్ అన్న మాట క్రీ.శ. 1870ల ముందు లేదు. పైగా ఇదొక మనిషి పేరు. ఇది మన సంస్కృతిలో ప్రాచీనమైన బడబాగ్నిని సూచించదు. అయితే కాల మహాప్రవాహాన్ని తరంగాలుగా దర్శిస్తూ, అనేక ప్రాచ్య, పాశ్చాత్య విషయాలు, ఘట్టాలు, చరిత్ర, మహాకవులు, చక్రవర్తులు ఇతివృ త్తాలుగా, గరికిపాటి వారు చేసిన ఆసక్తికరమైన, కవితాత్మకమైన సృజన, తెలుగులో ఒక బలమైన ముద్ర వేస్తుంది. ఇది ఆంగ్లంలో ఇంకా సాధన చేస్తే కానీ, ఇంకామూల విధేయత ఉంటేనే కానీ పట్టుబడదు. క్రీస్తు మీద పద్యాల్లో, ఆటవెలది చిన్న పద్యం కేవలం ఇరవై రెండు మాటలుండేది, అనువా దంలో నలభై మాటలు మించి పోవడం, ఎలా అను వాదం అనిపించుకుంటుంది? మూలంలో కవి అనని మాటలు, భావనలు అనువాదకులు చొప్పించకూ డదు. క్రీస్తుని వెస్టర్న్ క్లోన్ అనడం (పద్యం 52, పుట 30) అనువాదకుల జోడింపు. చారిత్రికంగా కూడా సరి కాదు, క్రీస్తు కూడా ఆసియా వాసే. పడమట ప్రచారంలో ఉన్నమతం కదా అని అన్నారేమో అను కున్నా, అది గరికిపాటి వారి మూల రచనలో లేదు. ఇలా అనువాదకులు, ప్రత్యామ్నాయ పంక్త్యంత్య ప్రాస (ABAB) వాడడం కోసం, తెలుగు పద్యం సొగసు, ఆంగ్లంలో ఇలా ఠ్ఛిటట్ఛ రాయడం కోసం బలవంతాన ఒదిగించారు. అనువాదంలో మాటలు అమితంగా పెంచారు. మూల విధేయత వారి దృష్టిలో లేదు. ఫ్రీ వెర్స్‌లో రాస్తే, ఒకింత వెసులు బాటు ఉండేది. చరిత్ర దర్శనంలో, విజ్ఞానం, విప్లవాలు, మాన వాళి విజయాలు, తాత్విక గవేషణ నమోదు చేసిన ఒక సహజ సుందర పద్య సౌధం గరికిపాటి వారి రచన. అన్నమయ్య మీద రాసిన రెండు పద్యాలలో కదన కుతూహల రాగం ప్రస్తావన చేస్తారు కవి. అను వాదకులు రెండు సంస్కృతుల మధ్య ఒక జీవ వారధి తప్ప మూల సంస్కృతిలోని విశేషాలను, లక్ష్య భాషా సమాజపు సంస్కృతిలోకి మార్చడం, ఇవాల్టి అనువాద ప్రక్రియ కాదు. కదనకుతూహల రాగం అంటూ మూలంలో కవి అన్నది ‘ఎలెగ్రో ఎలెగ్రో’ అంటూ పియానో మెట్ల రాగంగా మార్చడం, మనకి గల భిన్న విషయాల పరిజ్ఞానం చెప్తుంది కానీ, అన్నమయ్య ఆలపించిన కదన కుతూహల రాగం, భారతీయ సంగీతంలో ఎటువంటి స్థానం కలిగి ఉన్నదో తెలపదు. ఎన్నో మాటలకు పాద సూచికలు ఇచ్చిన అనువాదకులు, ఇటువంటి సంస్కృతీ విశేషాలకు సైతం, వాటిని రచనలో సాధ్యమైనంత వరకు యథాతధంగా, ఇటాలిక్స్‌లో వాడుక,వాటికి దిగువన తన వివరణ ఇవ్వాలి. అప్పుడే ఒక సంస్కృతీ పరిచయం జరుగుతుంది. ఈ పద్యంలో కూడా అనువాదకుల స్వేచ్చ పరిమితి దాటింది. ధూర్జటి గురించిన కవి రాసిన పద్యంలో చివరి రెండు పంక్తులు, అనువాదకులు (పుట 57 , పద్యం 96) అసలు పట్టించుకోలేదు. మనుషుల, ఊర్ల, ప్రాంతాల, సంస్కృతీ పరమైన నామవాచ కాలు, కావ్యాల పేర్లు, సంస్కృతీ సంకేతాలు లక్ష్య భాషా సమాజనికి అందచేయడం నేటి అనువాద పద్ధతి. ఈ అనువాదంలో దీన్ని పాటించలేదు. చివరగా పుస్తకం పేరు ‘సాగర ఘోష’. తరిచి చూస్తే, ఇది కాలాబాధితమైన లోకపు భిన్న మాన సిక దశల అలల పలకరింపుల కడలి సందడి. విషాద ప్రధానం కాదు. అప్పుడు ‘ఓషన్ బ్లూస్’ అన్న పేరు సరికాదు. ‘బ్లూస్’ అనేది విషాద సంకేతం ఆంగ్ల సంస్కృతిలో. మరి ఘోష అన్నారుగా కవి – అవును ‘ఓషనిక్ ట్యుముల్ట్’ లేదా ట్యుముల్టస్ ఓషన్’ అనే పేరు మూల శీర్షికకు దగ్గరగా వస్తుంది. వేల ఏళ్ల కిందటి వేద స్రోతస్వినికి, మూడు వేల ఏళ్ల నాగరిక కాల ప్రవాహానికి గళగళన్మన్గళ కళాకాహళిగా తెలుగు సంస్కృతి ఘనాపాటి గరికిపాటి. అనువాదంలో ఈ ‘సాగర ఘోష’ ఇంతకన్నా బలంగా, ఆధునికంగా, సరళ సుందరంగా, మూల విధేయంగా అందాలని ఆశిద్దాము.–రామతీర్థ, ప్రముఖ కవి, విమర్శకులు (మొబైల్ : 98492 00385) -
అకాడమీ సిగలో కొత్త కాంతి
సందర్భం తెలుగు భాషా కమిటీ కార్యవర్గ సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ప్రజా కవి, బహు పురస్కృత, బహు కావ్య రచయిత కె. శివారెడ్డి ఎన్నిక కావడం తెలుగు సాహిత్య వికాసానికి మంచి పరిణామం. సాహిత్య అకాడమీ కొత్త కార్యవర్గం ఏర్పడగా, అధ్యక్ష హోదా ఈసారి 1998 తరువాత తిరిగి, కన్నడ దేశానికి దక్కింది. 1998లో యు.ఆర్ అనంత మూర్తి తరువాత, ప్రస్తుతం ఫిబ్రవరి పన్నెండున సాహిత్య అకాడమీ అధ్యక్ష పదవికి ప్రముఖ సాహితీ వేత్త, ఎనభయ్యేళ్ళ చంద్రశేఖర కంబర్ ఎంపిక అయ్యారు. 1964 వరకూ జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధాని అయినందుకు కాకుండా, ఆయన స్వయానా రచయిత, సాహిత్య వేత్త కావడం మూలాన అకాడెమీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. అటుపై సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, సునీతి కుమార్ చటర్జి, కె.ఆర్ శ్రీని వాస అయ్యంగార్, (రెండు సార్లు) ఉమాశంకర్ జోషి, బీరేంద్ర కుమార్ భట్టాచార్య, యు.ఆర్. అనంతమూర్తి, రమాకాంత్ రథ్, గోపిచంద్ నారంగ్, సునీల్ గంగోపాధ్యాయ్ (పదవిలో మరణం) విశ్వనాథ్ ప్రసాద్ తివారీ నిర్వహిం చగా, 2018 నుంచి 2022 వరకూ ఈ జాతీయ సంస్థ అధ్యక్ష పదవిలో చంద్రశేఖర్ కంబర్ బాధ్యతలు నిర్వహిస్తారు. కంబర్ ప్రఖ్యాత రచయిత, జానపద గేయ కర్త, సినిమా దర్శకులు కావడం, బహు కళా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి, సాహిత్య అకాడమీకి తగు దిశా దర్శనం చేయగలరు అన్న ఆశాభావం నలుదిశలా వ్యక్తం అవుతున్నది. హంపి లోని కన్నడ విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతిగా, ఉత్తర కన్నడ మాండలికం తన కవితలు, నాటకాలు, ఇతర రచనల్లో సృజనాత్మకంగా ఉపయోగించిన సాహిత్యవేత్తగా మంచి గుర్తింపు ఉన్నవారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి, కర్ణాటక నాటక అకాడమీకి కూడా వారు ఉన్నత పదవులని నిర్వహించారు. షికాగో విశ్వ విద్యాలయంలో కొంత కాలం బోధన తరువాత, తాను బెంగళూర్ విశ్వ విద్యాలయంలో రెండు దశాబ్దాలకు పైగా ఆచార్య వృత్తిలో ఉన్నారు. ఇరవై అయిదు నాటకాలు, పదకొండు సంపుటాల కవిత్వం, అయిదు నవలలు, పదహారు పరిశోధనలు వారి నిరంతర సాహిత్య కృషిలో భాగంగా వెలుగు చూశాయి. జానపద కళా రంగం, విద్యా, సాహిత్య అంశాల పైన పలు రచనలు వెలువరించారు. వీరి నాట కాలు భారతీయ భాషలు, అలాగే ఆంగ్లంలోకి కూడా అనువాదం జరిగాయి. కర్ణాటక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కోసం వీరు కొన్ని డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు. సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు, జ్ఞాన్ పీఠ, కబీర్ సమ్మాన్, కాళిదాస్ సమ్మాన్, మొదలయిన పురస్కారాలు పొందినవారు. ఫుల్బ్రైట్ స్కాలర్‌గా, సాహిత్య పరిశోధకులు కూడా. దక్షిణ భారతీయ సాహిత్య రంగం, మరింత ప్రాధాన్యత సంతరించుకుని, తన ప్రతిష్టను పెంపొందించుకోగలదని ఆశి ద్దాము. అలాగే తెలుగు భాషా కమిటీ కార్యవర్గ సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ఆధునిక కవిత్వ చేతనతో ఎన్నో సంపుటాలు వెలువరించిన ప్రజల కవి, ప్రముఖ కవి, బహు పురస్కృత కె. శివారెడ్డి ఎన్నిక కావడం మంచి పరి ణామం. తెలుగు భాషకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు గల నిధులను రెండు రాష్ట్రాలలోనూ సముచి తంగా వినియోగించడంలో మేలైన పాత్ర పోషించాలని ఆశిద్దాం. తెలుగు ప్రాంతాల్లో జరగకుండా పోతున్న ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అలాగే, దక్షిణ భారతీయ సాహిత్య సమ్మేళనం వంటి అనేక ప్రాతిపదికలు పరిశీలనలో ఉండి పోయాయి. ముఖ్యంగా అనువాద ప్రణాళిక విస్తరించి, నిర్ణీతంగా, తెలుగు సాహిత్య రచనలు భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి వెళ్ళేలా, కొత్త కమిటీ ఆలోచనలు చేయాలి. అందుకు తగు పరిణతి, అంతర్జాతీయ దృక్పథం, ప్రగతిశీల స్వభావం, బహుళ సాంస్కృతిక చైతన్యం కలిగిన శివారెడ్డి వంటి కన్వీనర్ వలన తెలుగు సాహిత్య సంఘం, తన ప్రతిష్ట, దేశ భాషల్లో పెంపొందేలా, వీరి నేతృత్వంలో పని చేస్తుందని ఆశించవచ్చును. సాహిత్య రంగంలో కొత్త కమిటీ జాతీయంగా, భాషీయంగా ఏర్పాటు అయిన ఈ సందర్భంలో జాతి తరఫున శుభాకాంక్షలు. వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత రామతీర్థ మొబైల్ : 98492 00385 -
వాడుకమాటల వరద
సరిగ్గా 125 ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని, అది ఏ నూతన జ్ఞాన కాంతిని అందించిందో గుర్తించకుండా... దానిలో లేని విషయాలను పట్టుకుని విమర్శలు గుప్పించడం ఏమిటి? ఒక నాటకం, సాహిత్య ప్రక్రియగా, ప్రదర్శనా వినూ త్నతలతో, నూట పాతికేళ్లు బతికి ఉంది అంటే, ఏమిటి ఈ విజయ రహస్యం అని అడ గవచ్చు. అయితే దానికి, జవాబు చెప్పడానికి కన్యా శుల్కం నాటకకర్త మన మధ్య లేరు. నాటకమా మాట్లాడదు. మరి సమాధానం ఎలాగ? ఈ ప్రశ్న గురజాడ అప్పా రావు నాటకం కన్యాశుల్కం గురించి. కలకత్తా నుంచి 29 జనవరి 1912న రాసిన ఒక పూర్తిగా దొరకని ఉత్తరంలో ఇలా చెప్పారు గురజాడ. ‘‘తెలుగులో నవ్యరీతులకు, నూతన ప్రమాణాలకు ప్రయత్నించిన మొదటి కవిని నేనే. నా కావ్య కళ నవీనం. కావ్య ఇతివృత్తాలు భార తీయం... జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించి కథా కవితా రూపంలో దాని తత్వాన్ని అన్వయించడానికి ప్రయత్నించాను. నాకా కళల పట్ల, జీవితం పట్ల కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. వాటిని సంస్కృతిపరులు మాత్రం అర్థం చేసుకుని హర్షించగలరు. సంస్కృతి శూన్యులు కావ్య కథా సంవిధాన, హాస్య ధోరణులను గమనించి అంతటితో సంతృప్తిపడతారు’’. నవ్య రీతులు, నూతన ప్రమాణాలు, నవీన కావ్య కళ అని పైన గురజాడ ఇచ్చిన ఆధారాలతో మనం ఈ నాటకం, అలాగే, గురజాడ ఇతర రచనల దీర్ఘ జీవన దివ్య రహస్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయ గలం. గురజాడ, కన్యాశుల్కం నాటకం రాయడానికి ముందర తెలుగు రచన చేయనే లేదు. తెలుగులో ఆయన తొలి రచన ఇది. బహుశా గురజాడ 1919లో నాటకాన్ని పూర్తిగా తిరగరాసి, రెండు అంకాలు పెంచక పోతే, ఈ నాటకాన్ని ఇంతలా పట్టించుకోవలసిన అవ సరం ఉండేది కాదు. 19వ శతాబ్దపు అనేక భారతీయ నాటకాల వలె ఇది కూడా ఒక చరిత్ర పేరాగా మారి ఉండేది. కానీ, కళలో జీవితం నిండుగా కనిపించాలన్న పరిపూర్ణత్వ అన్వేషకుడు గురజాడ కావడం మూలాన, ఈ కన్యాశుల్కం నాటకం, ఇవాళ, 19వ శతాబ్దపు సాహి త్యంలో ఏకైక ఆధునిక భారతీయ సజీవ నాటకంగా, తెలుగు వెలుగుగా ఎదిగింది. ఈ ఆయుష్షు, యశస్సు కలగడానికి గురజాడ చేసిన ప్రత్యేక పరిశ్రమ ఏమిటి? అది ‘‘పాత కొత్తల మేలు కలయిక’’ అన్న నాలుగు మాటల ఒక సజీవ వారధి. ‘‘ఔరా ఇంద్రజాలీ, పంతులు గొంతు ఎలా పట్టావ్?’’ అంటుంది మధురవాణి శిష్యునితో, వాడు పేకాట ఆడుతున్న మధురవాణిని, ఆమె పేకాట దోస్తు లను రామప్పంతులు గొంతుతో హడలగొట్టినప్పుడు. అలా పాత్రలందరి గొంతులు పట్టిన అసలు ఇంద్రజాలి గురజాడ. కన్యాశుల్క నాటకం చేసే చాలా కనికట్టుల్లో ఒకటి వాడుక భాషకు పెద్ద పీట వేయడం. అలాగే పోలిశెట్టి తన పేకాట ముక్కలు ఎత్తేట ప్పుడు ‘‘నరసిమ్మ నీ దివ్వే నామ మంతరము చేత’’ అని ముక్కలు ఎత్తుతుంటాడు. ‘‘ఛప్! నోర్ముయి’’ అని పేకాట మిత్రులు గసుర్తుంటారు. ఇక్కడ గురజాడ ప్రస్తావిస్తున్నది కేవలం ఒక యేల పదం కాదు. అది కరీంనగర్ ప్రాంతంలోని ధర్మపురి దేవతపై రాసిన నర సింహ శతకంలోని ఒక పద్యం. రాసిన కవి ధర్మపురి శేషప్ప (1670 –1750). పేకాట ఆడే పోలిశెట్టి, ఎందుకీ పద్యం పాడుతున్నాడూ అంటే, తాను ధర్మపురి నించి విజయనగరం వలస వచ్చిన కోమటిశెట్టి అయి ఉండాలి. అందుకే, పేకాట కూడా గెలుపు కాంక్షతో చేసే యుద్ధం లాంటిదే కనుక, తన ఇష్టదైవాన్ని తలుచుకుం టున్నాడన్నమాట. ‘‘నరసిమ్మ’’ అనగానే అదేదో సింహా చల దైవ ధ్యానం అనుకుంటాము. కానీ గురజాడ చెప్ప కుండా చెక్కిన ఈ చెణుకు, ధర్మపురి శేషప్ప రాసిన నర సింహ శతకంలోని మూడో పద్యంగా ఉన్నది. ‘ప్రాబల్యవర్గాల సాహిత్య ఆధిపత్యం వల్లనే కన్యాశుల్కంకు బ్రహ్మరథం పడుతున్నార’ని పాతికేళ్ల క్రితమే కొత్త దారుల ఇలవేల్పులు విమర్శించారు. కానీ విభిన్న వర్గాలకు ప్రాతినిధ్యం అంటూ పాతికేళ్లుగా ఉద్య మాలు చేసి అలిసిపోయిన అస్తిత్వవాదం ఇవ్వాళ అదే ప్రాబల్య వర్గాల ముందు సాగిలబడి అమ్ముడుపోవడా నికి సిద్ధమైపోయింది. అసలు గురజాడను స్థానిక పరి మితులలో ఇరికించడమే తప్పు. భారతీయులను ప్రాపం చిక పౌరులుగా తీర్చిదిద్దడం, ఆనాటికి భారతీయ సాహిత్యం ఎరిగి ఉండని ఆధునిక సంస్కారాన్ని పరిచ యం చేయడమే కన్యాశుల్కం నాటక లక్ష్యం. మొదటి పేజీలోనే ఆంగ్ల సాహిత్య ప్రస్తావనలతో మొదలయ్యే కన్యాశుల్కం నాటకంలో కాళిదాసు, శ్రీనాథుడు, శంకరాచార్యులు, షేక్సి్పయర్, విడో పద్య మూల (ది మదర్) కవయిత్రి టేలర్, సూరకవి, ధర్మ పురి శేషప్ప, జావళీలు, తత్వాలు, హిందూస్తానీ దోహాలు, సుమతీ పద్యాలు, వేమన పంక్తులు, చమకం ప్రస్తావనలు, క్రిస్టియన్ సూక్తులు, గురజాడ కట్టిన పద్యాలు, ఇలా ప్రతి పద్య ప్రస్తావన, విపులంగా చెప్పు కోదగిన ఒక సాంస్కృతిక సందర్భమే. ఇన్ని సంస్కృ తుల ప్రాణవాయుబలంతో పరిఢవిల్లుతుండటమే, కన్యా శుల్కం నాటక దీర్ఘ యశస్సు, ఆయుష్షు, ప్రయోజనశీల తకు ఒక ప్రధాన కారణం. పాతకొత్తల మేలు సారం అయిన సంస్కృతి నేలకు ఒరిగితే తప్ప, ‘కన్యాశుల్కం’ నేలకు ఒరగదు. మంచిని పెంపొందించే కళాశీల దృక్పథం కలిగిన కన్యాశుల్కం కూడా చిరంజీవి, చిరాయువు. (విజయనగరం, విశాఖపట్నం వేదికలలో ఆగస్టు 26 నుంచి 28 వరకు జరుగనున్న ‘కన్యాశుల్కం’ 125 ఏళ్ల జాతీయ ఉత్సవాల సందర్భంగా..) రామతీర్థ వ్యాసకర్త కవి, విమర్శకుడు 98492 00385 -
యాభయ్యేళ్లుగా వంగపండు పాటా హుషార్!
సందర్భం శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం దగ్గర్లో బొండపల్లి, పెద బొండపల్లి అనే గ్రామాలు వస్తాయి. ఆ పెద బొండపల్లి వంగపండు ప్రసాదరావు స్వగ్రామం. చదివిన చదువులా.. కూలీ నాలీ చేసు కునేందుకు పనికి వచ్చే సామాన్యమై నవి. పాడిన పాటలా.. ఇరవయ్యో శతా బ్దపు ప్రజా ప్రతిఘటన వారసత్వంలో వెలు వడ్డ జంఝావతి పొంగులు, వంశధార నిరసనలు, మహేంద్ర తనయ గర్జనలు. భిలాయి స్టీల్ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు, పొట్ట చేత పట్టుకు అక్కడికి పనికి పోయే శ్రీకాకుళం జిల్లా పేదలు పాడు కునేవారట ‘‘ఏం పిల్లడో భిలాయి వత్తవా?’’ అది విని పాట కట్టాడు వంగపండు ‘‘ఏం పిల్లడో ఎల్దుమొత్తవా, ఏం పిల్లో ఎల్దామొత్తవా’’ అంటూ. వంగపండు పాట 1970ల్లో తెలుగునాట చెలరేగిన తీవ్రతర సామాజికోద్యమంలో ప్రజలకు గల తిరగబడే హక్కును సమ ర్ధిస్తూ నిలబడ్డ ప్రజల పక్షమై నిలబడటమేకాకుండా, ప్రముఖ విప్లవ కవులతో సాటిగా, వారి మన్ననలందుకుంటూ వేదిక లెక్కింది. శ్రీశ్రీ వంటి ప్రఖ్యాత కవులు, ఈ ఉద్యమ సమయాల్లో, లిఖిత కవిత్వం చదివే మధ్యతరగతి వారి కన్నా, విప్లవ చైతన్యం పొందాల్సిన పేదలకు, వంగపండు, గద్దర్ వంటి వారి పాటలే శ్రేష్టమైనవని వారికే ముఖ్య పాత్ర ఇచ్చిన కాలం ఉన్నది. ఇది వంగపండు మాటల్లోనే వేల ప్రదర్శనలు పడిన ‘భూమి భాగోతం’ విషయమై స్పష్టం. ‘‘సిక్కోలు యుద్ధం’’ కూడా ఏదో ప్రాంతీయ దృష్టి కోణం నుంచి కాక, యావత్ తాడిత, పీడిత, బడుగు ప్రజల తరఫున, వాక్కు గేయంగా మలచ గల పోరాట శీల కళాకారునిగా వంగపండు సమాజానికి అందచేసిన ఒక సమర స్మృతి. వ్యవసాయ జీవనుల దుస్థితి, నగర పెట్టుబడిదారీ పారిశ్రా మికత కార్మికులకు కలిగిస్తున్న కడగండ్లు, వంగపండు రచ నల్లో, సమాన ప్రాముఖ్యత కలిగి ఉండడం విశేషం. ‘‘మడిలో బెడ్డ లన్నీ మన నెత్తురు గడ్డలు, పండిన పంటలన్నీ మన సెమట సుక్కలు, పట్టా పట్టుకొని మన పొట్టలు కొట్టాలని లారీ తెచ్చిన బాబుకు తూరుపు సూపించ రండి’’ అని రాసినా, ‘‘యంత్రమెట్ట నడుస్తూ ఉందంటూ’’ అని యంత్ర భూతముల కోరలు తోమే వారి విలా పాగ్నులు, విషాదాశ్రులు గురించి రాసినా, వంగపండు శ్రామిక వామపక్ష ప్రయోజన కవిగానే, తన అర్ధ శతాబ్దపు రచన కొనసాగించడం విశేషం. వెన్నెల చూపెట్టి సింహాలను చేయవచ్చునా పిల్లలను? వంగ పండు రాసిన మరొక గిరిజన బాణీ గీతం ‘‘రావనా సెందనాలో’’ – ఎవరికైనా వెన్నెల ఒక భావ కవితాసమయం కావచ్చు, కానీ, ఈ పాటలో అంటుంది ఓ అభాగ్యురాలు అమేయమైన ఆత్మ విశ్వాసంతో, ‘‘పేరులేని దానినీ, పేద దానినీ, పంట లేని దానినీ, ఇంటి దానినీ, అన్నమంటే నాకొడుకూ నిన్నూ జూపించుతాను, సిన్నారి నా కొడుకును ఎన్నెలా, సింహప్పిల్లనే చేత్తాను ఎన్నెలా!’’ వంగపండు పాటలో పేదల విధ్వంసకరమైన హాస్యం తొణి కిసలాడుతుంది. ఈ వ్యంగ్యం, ఎన్నో బాధలు ఎరిగిన ప్రజల మనోస్థితికి అద్దం పడుతుంది. పైసా పాటలో, ఇవాల్టి నోట్ల రద్దు విడ్డూరాలన్నీ ఆనాడే కళ్ళకు కట్టినట్టు చెప్పాడు, ఈ జన ఫిరంగి గుండు వంగపండు–‘‘చిన్నది కాదయ్యో పైసా, చిత్రాల మొగు డయ్యో పైసా, అది నీ కాడుంటది, నీ కాడుంటడది, మూడవ వాడిని మురిపిస్తంటది, రాత రాయదయ్యో పైసా, రాజ్యం ఎల్త దిరో పైసా, –అది సదువులిత్తది , సరుకులిత్తది, ఎదవలకేమో పద వులిత్తది, చేతులుండవయ్యో పైసా, చేతుల్నీ తిరుగుద్దీ పైసా అని’’ ధనస్వామ్యపు వికృతాలపై ఒక బీభత్స గీతం కట్టగలడు. చెరిగి పోతున్న వేల గ్రామాల తరపున ఒక బృహత్ కైఫీయత్ గా తన పాటల్లో నిక్షేపించిన వాడు వంగపండు. ‘‘ఊరు బంధం’’ పాటలో మనం ఈ శతాబ్దంలో బాగా సాధన చేసిన, గ్రామాల నిరాదరణ పట్ల కన్నెర్ర చేయడు కానీ, కళ్ళారా ఏడుస్తాడు. ‘‘ఊరో నా ఊరో– నా సెరుకు ముక్కలూరో, నా అరిసి పప్పలూరో, నా తోపుండల ఊరో–నా పోకుండల ఊరో–కాటు బెల్లం నాకుతుంటే కమ్మగున్న ఊరో–కమ్మకమ్మగున్న ఊరో–అంటూ ఎలుగెత్తి, చెరిగి పోతున్న పల్లె తల్లిని నోరారా పిలుస్తాడు, ఈ జనం గుండెల చెండు వంగ పండు. నాలుగు వందల పాటలకు పైగా రాసి, పాడి, సినిమాలలో నటించి, తెలుగు లోగిళ్ళలో, కార్మిక కర్షక కాంభోజి, ప్రమాద వీణల కమాచి పాటగా, చెలరేగుతున్న వంగపండు, అడవి దివిటీలు నాటకం, కారా మాస్టారి ‘‘యజ్ఞం’’ వంటి కథా గేయ కావ్యాలను సైతం రక్తి కట్టించాడు. పాట కట్టి, గజ్జె బిగించి, ప్రజల ప్రయోజనాలకు నిత్యం పహారా కాస్తూన్న కాపలాదా రుగా, తన వివిధ కళాకృతులకు యాభై ఏళ్ల సందర్భంగా, సంపా దకులు, రైటర్స్ అకాడమీ నిర్వాహకులు రమణమూర్తి ఆధ్వ ర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సాయంత్రం అయిదు గంట లనుంచి ఇవాళ విశాఖలో వంగపండు ఆటాపాటా. రామతీర్థ కవి, విమర్శకులు ‘ 98492 00385