మన కాలపు మహాబలిపురం రాతి ఏనుగు గరికిపాటి నరసింహారావు గారు. సాహిత్య లలిత కళా పల్లవునిగా వారి ఆభివ్యక్తి శిల్పారామం వాగ్మానస గోచరంగా ఉంటూనే, ఒక అలౌకికావరణంలోనికి మనలను తీసుకువెళ్తుంది. పద్య దారగా పటిష్టమై కుప్పించి ఎగసిన భావ తరంగాల హేష వినిపిస్తుంది వారి కండువా అంచుల కడలి కెరటాలుగా, ఒకప్పుడు కృష్ణుడి పేరిట నారాయణ తీర్థుల తరంగాలు నేటి కమనీయమైన తెలుగు పలుకుబళ్ళు. సాగర ఘోషగా గరికిపాటి చేసిన లోకదర్శనం ఈ వెయ్యిన్నూట పదార్ల పద్యాల్లో భిన్న వృత్తాల్లో ఉన్నది. మూలం తెలుగులో వెలుగు చూసి అష్టాదశ వర్షాలు కాగా, నేటికి ఈ రచన, ఇంతకు ముందరే కొన్ని ఆంగ్ల అనువాద రచనలు చేసిన మహతి గారి ఇంగ్లిష్ అనువాదంలో విశాల ప్రపంచానికి పరిచయం అవుతున్నది. ప్రథమాంతరంగం, ద్వితీయ అంటూ పది అంతరంగాలుగా విభజించి, అటు తరంగాలు, ఇటు అంతరంగం ధ్వనించేలా, తెలుగులో ఉన్న తరంగ విభాగాన్ని, ఆంగ్లంలో అధ్యాయాలుగా మార్చారు. ఉప విషయ శీర్షికలు మూలంలో ఉన్నవి తొలగించారు. అంకితం కూడా తీసేశారు. విపులంగా పాద సూచికలు ఇచ్చిన మాటలు చూస్తే, వందల ఏళ్ల కిందటి పాత నార్స్ కాలపు మాటలు అయిన ్ఛట్ఛ, వంటి ( before అనేది ఆధునిక వాడుక) మాటలు వాడారు. బడబాగ్నిని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అని వాడాలి సులభంగా అర్ధం చేసుకోవడం మన లక్ష్యం అయితే. గుయోట్ అన్న మాట క్రీ.శ. 1870ల ముందు లేదు. పైగా ఇదొక మనిషి పేరు. ఇది మన సంస్కృతిలో ప్రాచీనమైన బడబాగ్నిని సూచించదు.
అయితే కాల మహాప్రవాహాన్ని తరంగాలుగా దర్శిస్తూ, అనేక ప్రాచ్య, పాశ్చాత్య విషయాలు, ఘట్టాలు, చరిత్ర, మహాకవులు, చక్రవర్తులు ఇతివృ త్తాలుగా, గరికిపాటి వారు చేసిన ఆసక్తికరమైన, కవితాత్మకమైన సృజన, తెలుగులో ఒక బలమైన ముద్ర వేస్తుంది. ఇది ఆంగ్లంలో ఇంకా సాధన చేస్తే కానీ, ఇంకామూల విధేయత ఉంటేనే కానీ పట్టుబడదు. క్రీస్తు మీద పద్యాల్లో, ఆటవెలది చిన్న పద్యం కేవలం ఇరవై రెండు మాటలుండేది, అనువా దంలో నలభై మాటలు మించి పోవడం, ఎలా అను వాదం అనిపించుకుంటుంది? మూలంలో కవి అనని మాటలు, భావనలు అనువాదకులు చొప్పించకూ డదు. క్రీస్తుని వెస్టర్న్ క్లోన్ అనడం (పద్యం 52, పుట 30) అనువాదకుల జోడింపు. చారిత్రికంగా కూడా సరి కాదు, క్రీస్తు కూడా ఆసియా వాసే. పడమట ప్రచారంలో ఉన్నమతం కదా అని అన్నారేమో అను కున్నా, అది గరికిపాటి వారి మూల రచనలో లేదు. ఇలా అనువాదకులు, ప్రత్యామ్నాయ పంక్త్యంత్య ప్రాస (ABAB) వాడడం కోసం, తెలుగు పద్యం సొగసు, ఆంగ్లంలో ఇలా ఠ్ఛిటట్ఛ రాయడం కోసం బలవంతాన ఒదిగించారు. అనువాదంలో మాటలు అమితంగా పెంచారు. మూల విధేయత వారి దృష్టిలో లేదు. ఫ్రీ వెర్స్‌లో రాస్తే, ఒకింత వెసులు బాటు ఉండేది.
చరిత్ర దర్శనంలో, విజ్ఞానం, విప్లవాలు, మాన వాళి విజయాలు, తాత్విక గవేషణ నమోదు చేసిన ఒక సహజ సుందర పద్య సౌధం గరికిపాటి వారి రచన. అన్నమయ్య మీద రాసిన రెండు పద్యాలలో కదన కుతూహల రాగం ప్రస్తావన చేస్తారు కవి. అను వాదకులు రెండు సంస్కృతుల మధ్య ఒక జీవ వారధి తప్ప మూల సంస్కృతిలోని విశేషాలను, లక్ష్య భాషా సమాజపు సంస్కృతిలోకి మార్చడం, ఇవాల్టి అనువాద ప్రక్రియ కాదు. కదనకుతూహల రాగం అంటూ మూలంలో కవి అన్నది ‘ఎలెగ్రో ఎలెగ్రో’ అంటూ పియానో మెట్ల రాగంగా మార్చడం, మనకి గల భిన్న విషయాల పరిజ్ఞానం చెప్తుంది కానీ, అన్నమయ్య ఆలపించిన కదన కుతూహల రాగం, భారతీయ సంగీతంలో ఎటువంటి స్థానం కలిగి ఉన్నదో తెలపదు. ఎన్నో మాటలకు పాద సూచికలు ఇచ్చిన అనువాదకులు, ఇటువంటి సంస్కృతీ విశేషాలకు సైతం, వాటిని రచనలో సాధ్యమైనంత వరకు యథాతధంగా, ఇటాలిక్స్‌లో వాడుక,వాటికి దిగువన తన వివరణ ఇవ్వాలి. అప్పుడే ఒక సంస్కృతీ పరిచయం జరుగుతుంది. ఈ పద్యంలో కూడా అనువాదకుల స్వేచ్చ పరిమితి దాటింది. ధూర్జటి గురించిన కవి రాసిన పద్యంలో చివరి రెండు పంక్తులు, అనువాదకులు (పుట 57 , పద్యం 96) అసలు పట్టించుకోలేదు. మనుషుల, ఊర్ల, ప్రాంతాల, సంస్కృతీ పరమైన నామవాచ కాలు, కావ్యాల పేర్లు, సంస్కృతీ సంకేతాలు లక్ష్య భాషా సమాజనికి అందచేయడం నేటి అనువాద పద్ధతి. ఈ అనువాదంలో దీన్ని పాటించలేదు.
చివరగా పుస్తకం పేరు ‘సాగర ఘోష’. తరిచి చూస్తే, ఇది కాలాబాధితమైన లోకపు భిన్న మాన సిక దశల అలల పలకరింపుల కడలి సందడి. విషాద ప్రధానం కాదు. అప్పుడు ‘ఓషన్ బ్లూస్’ అన్న పేరు సరికాదు. ‘బ్లూస్’ అనేది విషాద సంకేతం ఆంగ్ల సంస్కృతిలో. మరి ఘోష అన్నారుగా కవి – అవును ‘ఓషనిక్ ట్యుముల్ట్’ లేదా ట్యుముల్టస్ ఓషన్’ అనే పేరు మూల శీర్షికకు దగ్గరగా వస్తుంది. వేల ఏళ్ల కిందటి వేద స్రోతస్వినికి, మూడు వేల ఏళ్ల నాగరిక కాల ప్రవాహానికి గళగళన్మన్గళ కళాకాహళిగా తెలుగు సంస్కృతి ఘనాపాటి గరికిపాటి. అనువాదంలో ఈ ‘సాగర ఘోష’ ఇంతకన్నా బలంగా, ఆధునికంగా, సరళ సుందరంగా, మూల విధేయంగా అందాలని ఆశిద్దాము.–రామతీర్థ, ప్రముఖ కవి, విమర్శకులు (మొబైల్ : 98492 00385)
అలాంతర్గామి గరికిపాటి కలం కడలి హోరు
Published Sun, Aug 12 2018 1:01 AM | Last Updated on Mon, Aug 13 2018 7:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment