సోలి సొరాబ్జీ (మాజీ అటార్నీ) రాయని డైరీ
దేశానికి ఒక జాతీయ గీతం, ఒక జాతీయ జెండా ఉండాల్సిందే. ఏ కాలానికి ఆ కాలంలో ఒక జాతీయ నేత ఎలాగూ ఉంటాడు. అలాగని ప్రతి పౌరుడూ ఒక జాతీయ పౌరుడిలా ఉండాలని కోర్టులు ఆదేశించవచ్చా అన్న విషయమై నేనేమీ ఆలోచించలేక పోతున్నాను. బహుశా ఇది నా న్యాయవాద వృత్తికి, నా వివేచనా శక్తికి మించిన ఆలోచనైతే కాదు కదా!!
జాతీయ గీతాన్ని చదివే గుర్తు పట్టక్కర్లేదు. జాతీయ గీతాన్ని వినే గుర్తు పట్టక్కర్లేదు. నిరంతరం లేచి నిలబడి పాడుతూ ఉంటేనే జాతీయ గీతం గుర్తుంటుందని లేదు. అది మన బ్లడ్! లోపల ప్రవహిస్తూ ఉంటుంది. గుండె జనగణమన అని కొట్టుకుంటూ ఉంటుంది. నిలుచున్నా, కూర్చున్నా, పడుకుని ఉన్నా, ప్రయాణిస్తూ ఉన్నా కూడా. జెండా కూడా అంతే. కళ్ల ముందు రెపరెపలాడుతుంటేనే, మనం వెళ్లి సెల్యూట్ కొడుతుంటేనే గుర్తుకొస్తుందనేమీ లేదు. దేశం లోపల ఎన్ని రంగులు ఉన్నా, దేశంలోని మనుషుల లోపల ఉండేవి ఆ మూడు రంగులే.
మన కొత్త జాతీయ నేత మాత్రం? ఏ రోజైనా ఆయన్ని గుర్తుపట్టకుండా ఉన్నామా? ఆయన దేశంలో ఉన్నా లేకున్నా మనం గుర్తుపట్టడం లేదా? ఆయన పార్లమెంటుకు వస్తున్నా రాకున్నా మనం గుర్తుపట్టడం లేదా? నోట్లపై ఉన్న జాతిపిత మనకెంత గుర్తో, నోట్లు రద్దు చేసిన జాతీయ నేత అంతే గుర్తు. పౌరుల్ని గుర్తుపట్టడానికి పాస్‌పోర్ట్‌లు ఉండాలి. మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. జిరాక్స్ కాపీలు ఉండాలి. ఆధార్ కార్డులు ఉండాలి. పాన్ కార్డులు ఉండాలి. రేషన్ కార్డులు ఉండాలి. జన్‌ధన్ ఖాతాలు ఉండాలి. గ్యాస్ రిసీట్ ఉండాలి. నీటి బిల్లు ఉండాలి. కరెంటు బిల్లు ఉండాలి. ఐటీ రిటర్న్స్ ఉండాలి. జాతీయ గీతానికీ, జాతీయ జెండాకు, జాతీయ నేతకు ఇవేవీ అక్కర్లేదు. దేశభక్తులకు, దేశభక్తికి కూడా అక్కర్లేదు.
జాతీయ గీతాన్ని భక్తిగా ఆలపించమని, జాతీయ గీతాన్ని శ్రద్ధగా ఆలకించమని ఆదేశించడమంటే.. దేశభక్తికి ఐడీ కార్డు చూపించమని అడగడమే! భక్తిని శంకిస్తే భక్తుడు సహించడు. ‘ముందు నీ ఐడీ కార్డు చూపించు’ అంటాడు. ‘నీ భక్తిని గానీ, నా భక్తిని గానీ నిరూపించుకోవలసింది దేశానికే గానీ.. నేను నీకు, నువ్వు నాకు కాదు’ అంటాడు. ‘నేను సినిమా హాల్లో జాతీయ గీతం పాడి నా దేశభక్తిని ప్రదర్శించుకుంటాను. నువ్వు కోర్టు హాల్లో జాతీయ గీతం పాడి నీ దేశభక్తిని చాటుకోగలవా యువర్ ఆనర్’ అని అడుగుతాడు. భావప్రకటన స్వేచ్ఛ అంటే మాట్లాడే స్వేచ్ఛ అని మాత్రమే కాదు. మాట్లాడకుండా ఉండే స్వేచ్ఛ కూడా. బలవంతంగా మాట మాట్లాడించినా, బలవంతంగా పాట పాడించినా ఆ స్వేచ్ఛను హరించినట్టే.
-మాధవ్ శింగరాజు