తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో బతుకమ్మ-దసరా సంబరాలు అంబరాన్ని అంటేలా వైభవంగా జరిగాయి.
డల్లాస్: తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో బతుకమ్మ-దసరా సంబరాలు అంబరాన్ని అంటేలా వైభవంగా జరిగాయి. ప్రవాస తెలంగాణ ప్రజలంతా కలిసివచ్చి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినా బతుకమ్మ- దసరా పండుగను ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులంతా దేవతల, జానపద, చారిత్రాత్మక దుస్తులు ధరించి 'దసరా వేషాలు' పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకుని అందరిని మురిపించారు. ఈ కార్యక్రమానికి యుగంధర్ మరిన్ గంటి స్వామి, మంజురెడ్డి ముప్పిడి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా గౌరీ దేవీకి పూజలు జరిపి బతుకమ్మ ఆటపాటలతో, కోలాటాల నృత్యాలతో, ఢోల్ భాజాలతో వేడుకలకు కొత్త అందాలను తెచ్చారు. బతుకమ్మ పాటలతో ఊరేగింపులతో బతుకమ్మల నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిపారు.
టీరేఫ్ సంస్థ వనితలందరికీ పసుపు, కుంకుమ గాజులు బ్యాగులలో పెట్టి కానుకలు ఇచ్చారు. సాయి నృత్య అకాడమీ నుంచి శ్రీదేవి ఎడ్లపాటి శిష్యులు జమ్మి పూజ ప్రారంభించే ముందు 'హైగిరి నందిని' పాటతో నృత్యాన్ని ప్రదర్శించారు. పురుషులందరూ కూడా జమ్మి పూజలో పాల్గొన్నారు. ఐదువేల మందితో ఆలయ ప్రాంగణమంతా పండుగ సంబరాలతో కిక్కిరిసి పోయింది. 'బీచ్ బీట్స్' అకాడమీ నుంచి ఆదిత్య గంగసాని బృందం కాల్ వాయిద్యాలతో పండుగకి మరింత వన్నె తెచ్చారు.
కార్యక్రమంలో పాల్గొనవారికి పులిహోర, దద్ధోజనం, రవ్వకేసరి, సత్తుపిండి ప్రసాదాలతో చక్కటి విందుని టీరేఫ్ ఫుడ్ కమిటీ నిర్వహకులు వడ్డించారు. యోయో, టీ న్యూస్, టీవీ 9, ఐనా మీడియా వారికి టీరేఫ్ కార్యవర్గ బృందం కృతజ్ఞతలను తెలిపింది. టీడీఎఫ్, డల్లాస్, నేషనల్ కార్యవర్గ బృందం కలిసి గత 2006 నుంచి ఈ వేడుకలను ప్రతి ఏడాది ఘనంగా జరుపుతున్నారు.