ఒత్తిడితో ఓడిపోతున్నవిద్యార్థి | The student losing with pressure | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో ఓడిపోతున్నవిద్యార్థి

Published Fri, Apr 29 2016 7:54 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఒత్తిడితో ఓడిపోతున్నవిద్యార్థి - Sakshi

ఒత్తిడితో ఓడిపోతున్నవిద్యార్థి

సమకాలీనం

ఐఐటీ పేరిట పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టి రాజస్థాన్‌లోని కోట తదితర ప్రాంతాల్లో ఏం చేస్తున్నారో, ఎలా కోచింగ్ కార్ఖానాలు నడుపుతున్నారో మీడియా కళ్లకు కట్టింది. ఈ ముతక పద్ధతుల్ని గుడ్డిగా సమర్థించే తల్లిదండ్రులు కూడా జరుగుతున్న అనర్థంలో ప్రధాన దోషులే! జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2014 లోనే ఆంధ్రప్రదేశ్‌లో 333 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క విశాఖ పట్నంలోనే, మూడేళ్ల కాలంలో 13 మంది మరణించారు.
 
సామాజిక మాధ్యమంలో ఓ మెసేజ్ రెండు రోజులుగా బాగా చక్కర్లు కొడుతోంది.
‘‘..... ఇంటర్ ఫలితాలు వచ్చాయి. నాకు తెలిసిన ఓ పదిమంది పిల్లలు పరీక్షలు రాసిన వారిలో ఉన్నారు. ఫలితాలు కనుక్కుందామని కొందరికి ఫోన్ చేశాను. ఒకమ్మాయికి ఫోన్ చేస్తే, వాళ్ల అమ్మ రిసీవ్ చేసుకుంది. ‘అమ్మాయికి మూడ్ బాగా లేదు, పడుకుంది’ అనగానే ఆశ్చర్యమేసింది. తెలివికల పాప, పొరపాటున తప్పిందా? అని అనుమానమొచ్చి ‘ఎన్నిమార్కులొచ్చాయి?’ అనడిగా. 975 అని జవాబిచ్చిందామె. ‘అబ్బో చాలా మంచి మార్కులు, మరి మూడ్ బాగాలేకపోవడం ఏమిటి?’ అన్నాను. ‘తను 985 ఎక్స్‌పెక్ట్ చేసింది. దాంతో డిప్రెషన్‌లో ఉంది. మాక్కూడా తృప్తి లేదు. అందుకే బయటికెక్కడికీ వెళ్లలేదు’ అని ఆమె సమాధానం.

మరొకరికి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయిపెద్దగా ఏడుస్తున్న శబ్దం ఫోన్లోనే వినిపించింది. వాళ్ల అమ్మ ఫోన్ తీసుకొని ‘‘మార్కులు తక్కువ వచ్చాయి. పొద్దుట్నుంచి ఏడుస్తోంది. ఓదార్చడం మా వల్ల కావట్లేదు.’’అని చెప్పింది. ‘ఎన్ని వచ్చాయ’ని అడిగితే, 985 అని బదు లిచ్చింది. నాకు చిరు కోపమొచ్చి, ‘మా బోటివాళ్లు పార్టీ అడుగుతారని అలా అంటున్నట్టున్నారు,  985 అంటే గొప్ప మార్కులు కదా!’ అన్నాను. ‘ఫలితాలు రాగానే వాళ్ల కాలేజీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఇంకొక్క రెండు మార్కులు వచ్చుంటే నీ పేరు, ఫోటో ఫ్లెక్సీలకు ఎక్కేది, ఎంత పని చేశా వమ్మా!, నీకు ఇలా తక్కువొస్తాయనుకోలేదు అందిట. దాంతో దిగులు చెంది, కుమిలి కుమిలి ఏడుస్తోంది’ అని వివరించిందా తల్లి. ఇంకో ఫోన్ కాల్‌కి స్పందించిన విద్యార్థి తండ్రి, ‘‘ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. డాక్టర్ని చేయాలనుకున్నాం. 20 వేలు పెట్టి స్మార్ట్ ఫోన్ కూడా కొనిపెట్టాము. అయిదారు వేల రూపాయలు పరీక్షల ముందు డ్రస్‌లకే అయ్యాయి. లక్షల రూపాయలు కాలేజీకి ఫీజులు కట్టాము. కాలేజీకి వెళ్లడానికి హోండా యాక్టివా కావాలంటే, అదీ కొని పెట్టాము. చివరకు 965 మార్కులు తెచ్చుకొని మా ఆశలు నీరు గార్చి...’’ ఇదీ వరుస!

వెయ్యి మార్కులకు 750 వచ్చినా, 850 వచ్చినా, చివరకు 985 మార్కులు వచ్చినా ఎవరికీ సంతృప్తి లేదు. ఎవరి స్థాయిలో వారు ఎత్తై లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, అది దక్కలేదని కుమిలి పోతూ తాము దిగులు పడుతున్నారు.  లోపం ఎక్కడుంది? పిల్లల్లోనా, తల్లిదండ్రుల్లోనా, టీచర్లలోనా, చదువుల్లోనా, విద్యావ్యవస్థలోనా....? ప్రభు త్వంలోనా? సమాజంలోనా...? ఇలా కొన్ని ప్రశ్నల్ని సంధించారీ మెసేజ్‌లో! ఇంతకీ ఇది నిజంగా జరిగిందా? వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడానికి ఎవరైనా తమ యథాశక్తి ఊహించి చక్కటి కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారా? తెలీదు కానీ, చదివిన వారంతా ‘నిజమే కదా! బయట పరిస్థితి అచ్చు ఇలాగే ఉంది’ అని మాత్రం అనుకుంటున్నారు.
 
ఒత్తిళ్లలో నలుగుతున్న లేలేత మెదళ్లు !
ఫలితాల తర్వాత కేవలం మార్కుల్ని చూసి విద్యార్థులు, వారి తలిదండ్రులు, టీచర్లు... స్పందించే తీరును బట్టి పిల్లలెంత ఒత్తిడిలో విద్యాభ్యాసం చేస్తు న్నారో ఇట్టే తెలిసిపోతోంది. వారి వయసుకు, స్థాయికి మించిన ఒత్తిళ్లకు వారు లోనవుతున్నారు. విద్యావిధానం, మార్కుల పద్ధతి, ముల్యాంకన తీరు ఇవన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. సిలబస్ కూడా అంతే! అనారో గ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

సాంకేతికమైన శాస్త్రీయ అంశాలు తప్పితే జీవితాంశాలు సిలబస్‌లోంచి క్రమంగా తొలగిపోతున్న తీరు కూడా వారి ఎదుగుదల, ఆలోచనా ధోరణిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చిన్న వయసునుంచి వారికి అపరిమితమైన లక్ష్యాల్ని నిర్దేశి స్తున్నారు. పిల్లల తెలివితేటల్ని, వారెదిగిన క్రమాన్ని, ఇష్టాయిష్టాల్ని... ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు తామాశించే కోర్సుల్లో చేర్పిస్తున్నారు. ఇతర విద్యార్థులతో పోలిక తీసుకువచ్చి నిత్యం సంఘర్షణకు గురిచేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులు, అటు కాలేజీల వారూ గుదిబండ ల్లాంటి ఈ లక్ష్యాలు విధిస్తుండటంతో పిల్లలు ఇంటా-బయటా తీవ్ర ఒత్తిళ్లకు గురికావాల్సి వస్తోంది.
 
మార్కులు రాకుంటే మరణమే శరణ్యమా?
బుధవారం విడుదల చేసిన జేఈఈ (మెయిన్-2016) ఫలితాల్లో అఖిల భారత స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలుగు విద్యార్థి సాయితేజ ఒక గొప్ప మాట చెప్పారు. ‘‘నేననుకుంటా... నా విజయానికి కారణం గట్టి పునాది. స్కూల్ స్థాయిలోనే నాకు ఉపాధ్యాయులు ఎంతో మేలు చేశారు. బట్టీ పట్టడం కాకుండా కాన్సెప్ట్స్‌పైనే దృష్టి కేంద్రీకరించేలా బోధించారు. నా తల్లిదండ్రులు కూడా అన్ని స్థాయిల్లో నాకు దన్నుగా ఉండి, నాలో స్థైర్యం పెరిగేలా చేశారు. ఒత్తిడిలేని వాతావరణంలో చదవడం వల్ల అవసరాన్ని బట్టి నేను వెంటనే కాన్సెప్ట్స్‌ను గుర్తుతెచ్చుకోవడం చాలా తేలికయింది’’ అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ అవకాశం ఎంత మందికి ఉంది?  ఐఐటి పేరిట పెద్ద మొత్తంలో ఫీజులు రాబట్టి రాజస్థాన్‌లోని కోట తదితర ప్రాంతాల్లో ఏం చేస్తున్నారో, ఎలా కోచింగ్ కార్ఖానాలు నడుపుతున్నారో మీడియా కళ్లకు కట్టింది. ఈ ముతక పద్ధతుల్ని గుడ్డిగా సమర్థించే తల్లి దండ్రులు కూడా జరుగుతున్న అనర్థంలో ప్రధాన దోషులే!

జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2014 లోనే ఆంధ్ర ప్రదేశ్‌లో 333 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క విశాఖ పట్నంలోనే, మూడేళ్ల కాలంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు యత్నించగా అందులో 13 మంది మరణించినట్టు పోలీస్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (పీసీఆర్బీ) చెబుతోంది. వారంతా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువు తున్న వారే! కడప జిల్లాకు చెందిన నాగేంద్ర కుమార్‌రెడ్డి గత సంవత్సరం సెప్టెంబరు నెలలో మద్రాస్ ఐఐటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తానాశించిన ప్లేస్‌మెంట్ రాలేదనే ఒత్తిడికి గురై ఓ తెలుగు విద్యార్థి ఖరగ్‌పూర్ ఐఐటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మూడో సంవత్సరంలో తగినన్ని మార్కులు రాలేదని జితీష్ శర్మ అనే విద్యార్థి ముంబై ఐఐటిలో బలవంతంగా తనువు చాలించాడు. ఇష్టంలేని కోచింగ్‌కు పంపుతున్నారనే వ్యధతో బిహార్‌లో వైష్ణవి ఆత్మహత్య చేసుకుంది. ఆశించింది దక్కలేదని పదోతరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు విద్యార్థులు బలవన్మ రణాల పాలయ్యారు.
 
మన ఆలోచనల్లోనూ లోపమే!
ప్రగతి కారకంగా లేని మన విద్యావిధానమే పెద్ద అవరోధం. దీనికి తోడు తల్లి దండ్రుల ఆలోచనా ధోరణిలో కూడా లోపముంది. ఇక బోధకులు సరేసరి! తాము చేసే కోర్సుల పట్ల, భవిష్యత్తు పట్ల, అసలు జీవితం పట్లనే విద్యా ర్థులకు విశ్వాసం కలిగించలేకపోతున్నాయి. పుస్తక పరిధి దాటని మార్కుల సాధన విద్యార్థి ప్రతిభను లెక్కగట్టే ఒక కొలమానమే తప్ప అదే సర్వస్వం కాదు. ఉద్యోగాలు పట్టుకోవడం, సమయస్ఫూర్తి, నైపుణ్యాల్ని ప్రదర్శించడం, ప్రతికూల పరిస్థితుల్లో నెట్టుకురావడం, ఎదుగుదల... ఇటు వంటివన్నీ, పుస్తకేతరమైన తెలివితేటలతోనే సాధ్యమని ఎన్నోమార్లు రుజు వైంది. ఆ నైపుణ్యాల్ని పెంచడంపై మనవాళ్లకు శ్రద్ధే ఉండదు. వ్యక్తిత్వ నిర్మాణం కోసం ప్రణాళికే లేదు. అందుకే, అకడమిక్‌గా ఎంతో గొప్ప ర్యాంకులు వచ్చి, తేలిగ్గా ప్రవేశాలు పొందే తెలుగు విద్యార్థులు ఐఐటి, ఐఐఎమ్, బిట్స్ వంటి సంస్థల్లోకి వెళ్లి అక్కడ కోర్సుల్లో రాణించేది తక్కువ.  

ప్రాథమిక, ముఖ్యంగా ఉన్నత విద్యా స్థాయిలో కార్పొరేట్, ఇతర ప్రయివేటు విద్యా సంస్థల కన్నా జిల్లాపరిషత్ బడుల స్థాయి సర్కారు విద్యా విధానమే గొప్పదని నిపుణులంటారు. పుట్టిన ప్రతి బిడ్డను ఐఐటికో, ఐఐఎమ్‌కో, ఎమ్బీబీఎస్‌కో పంపాలనుకోవడం కూడా అత్యాశను మించిన దురాశ. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 19 లక్షల మంది రెండు సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు హాజరవుతుంటే, దాదాపు నాలుగున్నర లక్షల మంది ఐఐటి, ఎన్‌ఐటి, బిట్స్, ఎమ్సెట్, ఇతర ఇంజనీరింగ్ కోర్సులకోసం సన్నద్ధమ వుతారు. నికరంగా జేఈఈ కి రెండు రాష్ట్రాల్లో కలిపి సగటున 1.30 లక్షల మంది రాస్తుంటారు. సుమారుగా ఆంధ్రప్రదేశ్‌లో 1.50 లక్షల మంది, తెలం గాణలో 1.40 లక్షల మంది ఏటా ఎమ్సెట్ రాస్తారంటే ఇక పరిస్థితిని ఊహిం చుకోవచ్చు. రాపిడి పెట్టి వీళ్లని పరీక్షకు సిద్ధం చేసే కార్పొరేట్ కాలేజీలు తెలంగాణలో 160 దాకా ఉంటే, ఏపీలో 260 వరకున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్ తప్పితే.... ఇక ఏ చదువులూ లేనట్టు వేలం వెర్రిగా పరుగులు తీయడంలో మనవాళ్లదే అగ్రతాంబూలం!
 
ఒత్తిళ్ల నుంచి సురక్షిత పొత్తిళ్లకెలా...?
హేతుబద్ధం కాని చిన్న చిన్న కారణాలతో తనువు చాలిస్తున్న యువతరాన్ని బతికించుకోవాలి. వృత్తి విద్యా కళాశాలల్లో, కోచింగ్ సెంటర్లలో ప్రధానంగా విద్యాపరమైన ఒత్తిళ్ల కారణంగానే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ కూడా ఓ అధ్యయనం తర్వాత అంగీకరించింది. ఫలితాలు, మార్కులు సాధించకుంటే కుటుంబీకులు అంగీ కరించరని, జీవితం వృథా అనుకుంటూ విద్యార్థులు ఒత్తిళ్లకు గురవు తున్నారని, ఈ స్థితిని అధిగమించాలనీ హెచ్చార్డీ శాఖ పేర్కొంది. సవాళ్లకు ఓ శారీరక ప్రతిస్పందనగా ఒత్తిడిని నిర్వచిస్తారు. అన్ని వేళలా నష్టదాయకం కాదని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒత్తిడి సత్ఫలితాల్నిస్తుందనీ నిపుణులు వివరిస్తారు. అది పరిధులు, పరిమితులు దాటకుండా జాగ్రత్త పడాలి. పరిధులు దాటుతున్న సంకేతాల్ని గ్రహించాలి. ఇంటివద్ద, కాలేజీల్లో, హాస్టళ్లలో... ఇలా వేర్వేరు చోట వేర్వేరు ఒత్తిడి సంకేతాలొస్తుంటాయి.

విద్యా ర్థుల్లో ముఖ్యంగా పోటీ పరీక్షలకు, వృత్తి కోర్సులకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఒత్తిళ్లు తీవ్రం కాకుండా చూసే ఒక నిఘా వ్యవస్థ ఉండాలి. వారికి ఒత్తిళ్ల నుంచి విముక్తి కలిగించే ‘కంపెన్సేటరీ రిలాగ్జేషన్ ప్రోగ్రామ్’ (సీఆర్పీ) పకడ్బందీగా అమలుపరచాలని నిపుణులంటారు. కానీ, విద్యను ఫక్తు లాభా పేక్షతో వ్యాపారంగా నడుపుతున్న కార్పొరేట్ సంస్థలు ఈ పనికి ససేమిరా అంటాయి. సమయం, డబ్బు వృథా అనేది వారి భావన. తల్లిదండ్రులైనా ఈ వాస్తవాల్ని గ్రహించి, ఆయా సంస్థలపై నిఘా వేయాలి.  ప్రభుత్వాలీ విష యంలో తగినంత చొరవ చూపాలి. సామాజిక వేత్తలు కూడా చేయి కలపాలి. అందరం కలిసి దేశ భవిష్యత్ సంపద అయిన విద్యార్థులు-యువతరాన్ని ఒత్తిళ్ల నుంచి, ఆత్మహత్యల నుంచి, బలవన్మరణాల నుంచి కాపాడుకోవాలి.
వ్యాసకర్త: దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement