![Student Bablu Hanged Basara Triple IT Campus - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/8/Basara-Triple-IT-Student-St.jpg.webp?itok=AS9gOv1g)
సాక్షి, నిర్మల్: భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన విద్యాక్షేత్రం.. విద్యార్థుల్ని బలిగొంటోందా?. ఫుడ్ పాయిజన్లు, విద్యార్థుల సమస్యలతో తరచూ వార్తల్లో నిలిచే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మరో అఘాయిత్యం జరిగింది. మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధితుడు పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా ప్రకటించారు పోలీసులు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆ క్యాంపస్‌లోనే చదువుతున్న తన సోదరుడితో మాట్లాడాడు కూడా. ఈ క్రమంలో గదిలో అచేతనంగా వేలాడుతూ కనిపించిన జాదవ్‌ను హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించింది ట్రిపుల్ ఐటీ సిబ్బంది. అయితే అప్పటికే జాదవ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.
ఉద్రిక్తత
జాదవ్ క్యాంపస్‌లో చేరి నెల కూడా కాలేదు. అయితే వ్యక్తిగత కారణాలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డానని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బబ్లూ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించాల్సిన నేపథ్యంలో భైంసా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉండడంతో.. భారీగా పోలీసులు మోహరించారు.
వీసీ విచారం
నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి బబ్లూ మానసిక సమస్యలతో చనిపోయాడు. మధ్యాహ్నాం ఉరివేసుకోని అత్మహత్యచేసుకున్నాడు. ఇది విచారకరమైన ఘటన. కిందటి నెల 31వ తేదీన అడ్మిషన్ తీసుకున్నాడు. అతని అన్న కూడా ట్రిపుల్ ఐటీలోనే చదువుతున్నాడు. మధ్యాహ్నాం అతనితో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న సమస్యను బబ్లూ సోదరుడితో కూడా చెప్పుకోలేదు. ఆత్మహత్యకు పాల్పపడటం బాధాకరం.
::: వీసీ వెంకటరమణ
నాలుగో ఘటన
ఇదిలా ఉంటే.. ఈ విద్యా సంవత్సర కాలంలో నలుగురు మృత్యువాత చెందారు. డిసెంబర్‌లో ఒకరు, ఈ ఏడాది జూన్‌లో ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు జాదవ్ మృతితో ఆ సంఖ్య నాలుగుకి చేరింది. దీంతో అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. విద్యార్థుల బలవన్మరణాలపై క్యాంపస్ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. అయితే.. ప్రాణం తీసుకునేంత ఒత్తిడికి విద్యార్థులు ఎందుకు చేరుకుంటున్నారు? అసలు వాళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు విద్యారంగ నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment