మాట తప్పి.. మంట పెట్టి..
రెండోమాట
ఎన్నికల ప్రయోజనాల కోసం, ఓటర్లను ఆకట్టుకునే ‘వశీకరణ’ మంత్రంగా రిజర్వేషన్లు తయారైనాయి. చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చకుండా మాటలతో డొల్లిస్తున్న సందర్భంలోనే ముద్రగడ సారథ్యంలో కాపుల సమీకరణ మహోద్యమ రూపం తీసుకోవలసి వచ్చింది. పైగా కొత్త ప్రభుత్వ హయాంలోనే కాపుల ఉద్ధరణకు రూ. 1,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి, రూ. 100 కోట్లకు పరిమితమయ్యారు.
‘వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో చేర్చాలని కోరే హక్కు కాపులకు ఉంది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో బాహాటంగా ప్రకటించింది. అలా మాకు హామీ ఇచ్చింది. రిజర్వేషన్‌లలో మాకూ వాటా ఉండాలి. కాపులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వెనకబాటుతనంతో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి గత ఇరవయ్యేళ్లుగా నేను పోరాడుతున్నాను.’
- ముద్రగడ పద్మనాభం (31-1-2016 తుని కాపు ఐక్య గర్జన సభలో)
‘కాపుల ఆందోళన వెనుక ఒక క్రిమినల్ ఉన్నాడు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంది. తన స్వప్రయోజనాల కోసం అది ప్రజలను రెచ్చగొడుతోంది. అది రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకం. రేపు బీసీలను రెచ్చగొట్టి కాపులకు రిజర్వేషన్‌లను వ్యతిరేకిస్తూ పోరాడమని రెచ్చగొడుతుంది.’
- నారా చంద్రబాబునాయుడు (31-1-2016)
కాపులను వెనుకబడిన తరగతి (బీసీ) జాబితాలో చేర్చి విద్య, ఉపాధి, ఉద్యోగాల కల్పనలో; ప్రమోషన్లలో రిజర్వేషన్ సౌకర్యానికి అర్హులుగా ప్రకటించాలన్న ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇప్పుడు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లోనూ రెండు దశాబ్దాల నుంచి దఫదఫాలుగా జరుగుతోంది. ఇప్పుడు తుని కేంద్రంగా, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో మళ్లీ ఆరంభమైంది. అయితే ఇది అనేక అవాంఛనీయ సంఘటనలకు దారితీసింది. కాపులను బీసీ కేటగిరీలో చేరుస్తూ విస్పష్టమైన జీవో తక్షణం విడుదల చేయాలనీ, అంతవరకు ఉద్యమం ఆగదనీ ముద్రగడ ప్రకటించారు. తెలుగుదేశం నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో కాపు వర్గానికి అనేక హామీలు గుప్పించారు. కానీ మరచిపోయారు. దాని ఫలితంగా చోటు చేసుకున్న పరిణామాలకు జగన్, వైఎస్‌ఆర్‌సీపీలను బాధ్యులను చేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం.
ముద్రగడ ప్రారంభించిన ఈ ఉద్యమానికి టీడీపీ, బీజేపీలు మినహా మిగిలిన రాజకీయ పక్షాలలోని ఆ వర్గానికి చెందిన నాయకులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ప్రకటించినవారే. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్‌ఆర్‌సీపీ ముద్రగడ ఉద్యమానికి మద్దతు ప్రకటించడం ఆశ్చర్యమూ కాదు. అభ్యంతరకరమూ కాదు. ఈ అంశంలో చంద్రబాబు వైఎస్‌ఆర్‌సీపీ నేత మీద ఒకటి రెండు అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం పూర్తిగా అప్రజాస్వామికం. ఈ వ్యాఖ్యలలో ప్రధానమైనది- ప్రతిపక్ష నేతను పరోక్షంగా ‘క్రిమినల్’ అని ప్రకటించడం. ఏ కోర్టూ- కింది కోర్టుగానీ, రకరకాల కేసులు (‘దేశం’ నాయకుడు ప్రేరేపించగా నమోదు చేసినవి) నడుపుతున్న సీబీఐ గానీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇంతవరకు ప్రతిపక్ష నేతపై ఆర్థిక కారణాలతో శిక్షను ఖరారు చేయలేకపోయాయి. చివరికి ఆ కేసులన్నీ ఏమైనాయో నివేదించేవారే ఇప్పుడు కరువయ్యారు. పైగా జగన్, ఆయన పార్టీ ఉప ఎన్నికలలోను, సాధారణ ఎన్నికలలోను టీడీపీకి బలమైన పోటీ ఇస్తూ గణనీయమైన విజయాలు సాధిస్తూ వచ్చింది. చంద్రబాబు మాత్రం బూటకపు ఐఎంజీ కంపెనీకి భూకేటాయింపులకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు ఒక కొలిక్కి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే మాటకూ, ఆచరణకూ అందకుండా తప్పించుకుంటున్న నాయకునిగా చంద్రబాబు మిగిలారు.
మాట నిలుపుకోని ఫలితం
కుల వ్యవస్థ లేకపోతే రిజర్వేషన్ల ప్రసక్తే రాదు. అయినా కులం ఒక వ్యవస్థగా పాతుకుపోవడానికీ, రాజ్యమేలడానికీ కారణం అందరికీ తెలిసిన రహస్యమే. దానిని బహిర్గతం చేయడానికి మాత్రం జంకు. ముద్రగడ విమర్శ అంతా దేని మీద? ఎన్నికల ప్రయోజనాల కోసం, ఓటర్లను ఆకట్టుకునే ‘వశీకరణ’ మంత్రంగా రిజర్వేషన్లు తయారైనాయి. చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోలో కాపులను బీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చకుండా మాటలతో డొల్లిస్తున్న సందర్భంలోనే ముద్రగడ సారథ్యంలో కాపుల సమీకరణ మహోద్యమ రూపం తీసుకోవలసి వచ్చింది. పైగా కొత్త ప్రభుత్వ హయాంలోనే కాపుల ఉద్ధరణకు రూ. 1,000 కోట్లు కేటాయిస్తానని చెప్పి, రూ. 100 కోట్లకు పరిమితమయ్యారు. అంతేకాకుండా, ఆ వర్గంలో చీలిక కోసం ఒకరిని బుజ్జగించి తలాతోకా లేని ఒక కార్పొరేషన్‌కు అధ్యక్షునిగా ప్రకటించారు. మొత్తంగా బీసీ జాబితాలో చేర్చి, రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ను నెరవేర్చడంలో విఫలమయ్యారు. చంద్రబాబు మరోసారి మాట తప్పినందుకు ఆ వర్గం ఉద్రిక్తతకూ, ఉద్వేగానికీ లోను కాక తప్పలేదు.
రుణమాఫీ విషయంలో, రాజధాని పేరుతో బలవంతంగా లేదా బుజ్జగింపులతో, ఇంకా కొన్ని భూములలో పంటలను ధ్వంసం చేసైనా సరే, ప్రజలను ఇబ్బంది పెడుతూ కోర్టులకు ఎక్కించేదాకా ఎలా వదలడం లేదో, కాపుల విషయంలో కూడా అంతే జరుగుతోంది. కాంగ్రెస్ కూడా యూపీఏ -2 సహా కులాల వర్గీకరణ, వారి సమస్యల పరిష్కారం విషయంలో నాన్పుడు ధోరణి వహించడం వల్లనే ఉద్రేకాలు ప్రబలుతూ వచ్చాయి. ఇది నిజం కాకుంటే సంజీవయ్య, విజయభాస్కరరెడ్డిల హయాంలలో కాపుల డిమాండ్లను ఆమోదిస్తూ జీవోలు తెచ్చినప్పటికీ ఇంతకాలం అమలు జరక్కుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? మధ్యలో బ్రహ్మానందరెడ్డి కాపుల బీసీ హోదాను ఎందుకు తొలగించినట్టు? బీజేపీ హయాంలో కూడా రిజర్వేషన్ల సమస్య ఒక కొలిక్కి రాకుండా ఎందుకు జాప్యం చేస్తున్నట్టు? అలాగే ఎన్టీఆర్ పాలన తొలిరోజులలో ఉద్యోగాలకు చేసే దరఖాస్తులలో ఏ వర్గమూ తమ కులాన్ని పేర్కొనకుండా ఉండాలన్న ప్రతిపాదన ఏ ఉద్దేశంతో చేసినట్టు? అయినా అది ఎందుకు అమలులోకి రాలేదు? ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, దాటాక బోడి మల్లయ్య వ్యవహారంగా రిజర్వేషన్ల వ్యవహారం మారుతోంది.
నేనూ నా కులం
భారత జనాభాలో అగ్రవర్ణాలుగా ముద్రపడిన వారి సంఖ్య స్వల్పమనీ, ఉపజాతులూ, ఉప కులాలూ, అట్టడుగు వర్గాలూ, ఆదివాసీలూ, ఎత్నిక్ గ్రూపులూ అధిక సంఖ్యాకులనీ ఒక వాదన. ‘ఇండియాలో పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, అపశ్రుతులు లేని కులం ఏదీ లేదు. పరిశుద్ధమైన కులం అనేది ఒక భ్రమ. కల్పిత గాథ మాత్రమే’ అని ఇటీవలనే జాతీయ శాస్త్ర విజ్ఞాన పరిషత్ నివేదికలు నిగ్గు తేల్చాయి. విభజనతో కూడిన కుల వ్యవస్థకు 1500 సంవత్సరాలకు మించి వయసు లేనేలేదనీ, అంతకు ముందు కుల వ్యవస్థ లేదనీ ఆ నివేదిక చెప్పింది. ఈ పరిణామం జన్యుకణాల చరిత్రను ప్రభావితం చేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేల సంవత్సరాల వంశపారంపర్యపు తబిశీళ్లను పరిశీలించిన తరువాత కొసమెరుపుగా వచ్చిన నిర్ణయమిది. మన దేశంలోని దౌర్భాగ్యపు కుల వ్యవస్థకు గల పునాదులను శాస్త్రీయంగా విశ్లేషించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, ‘కుల వ్యవస్థ ఉనికి, ఊపిరి అంతా సమాజాన్ని అంతకు ముందు లేని కులాలు, ఉప కులాల కింద విభజించి, నిలువునా చీల్చి అసమానతల దొంతర్లు పేర్చడంలో ఉంది.
కింది వర్గాల వారిని అధికార స్థానాలలోకి రాకుండా చేయడం, వారికి విద్య, ఉపాధి అవకాశాలను దూరం చేయడం, ఆస్తిపాస్తులు సమకూర్చుకోకుండా అడ్డంకులు కల్పించడం, స్త్రీలను అణచివేతకు గురిచేయడం మతాచార్యుల అభిమతంగా ఉండేది. హిందూ మతగ్రంథాలన్నీ దాదాపుగా మతాచార్యుల సృష్టే. నిరక్షరాస్యులను అమాయకత్వంలో, పేదరికంలో తొక్కి పట్టి ఉంచడమే మతాచార్యుల సిద్ధాంతమూ, తాత్విక పునాది’ అన్నాడు. వర్గ, వర్ణ (కుల) రహితమైన ఆది హైందవంలోని మంచిని సర్వజనులు సుఖంగా ఉండాలన్న అభ్యుదయకర కోణాలను అనంతర కాలాల్లో మతాచార్యుల వర్గమే చంపుతూ వచ్చిందని కూడా అంబేడ్కర్ విమర్శించారు. నేనూ, నా కులం అన్న భావనే అన్ని రకాల ఆర్థిక పురోగతికి ఆటంకమని కూడా ఆయన అన్నారు. వ్యవసాయ తదితర రంగాలలోనూ సమష్టి కృషికి ప్రతిబంధకంగా ఉండే హానికర పరిస్థితులను కూడా కులతత్వం సృష్టిస్తుంది. ఇలా కుల సంబంధాల మీద ఆధారపడి సాగే గ్రామీణాభివృద్ధి సోషలిస్టు సూత్రాలకే పరమ విరుద్ధం అని ఆయన అన్నాడు. దున్నేవారికే భూమిని పంచాలి. అప్పుడు కాని మన పట్టణాలు, నగరాల త్వరితగతి పురోగతి సాధించాలంటే సమష్టిగా ఉత్పత్తి కార్యకలాపాల నిర్వహణ వల్లనే సాధ్యమని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారని మరువరాదు. మన పట్టణాల, నగరాల త్వరితగతి పురోగతి సమష్టి ఉత్పత్తి కార్యకలాపాల నిర్వహణవల్లనే సాధ్యమని కూడా అంబేడ్కర్ ప్రతిపాదించారు.
జాతి మాట - ఒక స్పృహ
కాపు నాయకులకు ఇక్కడొక హెచ్చరిక చేయవలసి ఉంటుంది. వీరు తరచూ కులాన్ని ‘జాతి’గా వర్ణించుకుంటున్నారు. అది తప్పు. జాతి శబ్దానికి విస్తృతార్థం ఉంది. ఒక దేశాన్ని ఒకే జాతిగా భావిస్తాం గానీ, కులాన్ని జాతిగా పేర్కొంటే అర్థం చాలా దూరం వెళుతుంది. ‘కుల వ్యవస్థ రద్దునే ఆరోగ్యవంతులు కోరుకుంటున్న తరుణంలో, మళ్లీ జాతినీ, ఉపజాతులనీ వెతుక్కునే ప్రయత్నం సమాజ సమష్టి జీవనానికీ, ప్రయోజనకరమైన ఉమ్మడి వారసత్వాన్ని స్థిరపరచడానికీ విరుద్ధమని అందరం గ్రహించాలి. ఈ అవగాహన లేకనే చంద్రబాబు సహితం గందరగోళంలో పడి, తన అవకాశవాద ఎత్తుగడ ద్వారా జనాన్ని కూడా గందరగోళంలోకి నెడుతున్నారు. జగన్ సలహా మీదనే తాను హామీలిచ్చినట్టు బాబు పరోక్షంగా భావిస్తున్నట్టు ఉంది. ఇంతకూ అసలు క్రిమినల్ ఎవరు? దొరికితే ఆలోచిద్దాం. అసలు ఓటుకు కోట్లు కేసులో దొంగెవరో తేలితే, మాట తప్పే క్రిమినల్ కూడా దొరికిపోతాడు.
సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్
abkprasad2006@yahoo.co.in