విజయ్‌మాల్యా ఎక్కడ?! | where is Vijay Mallya | Sakshi
Sakshi News home page

విజయ్‌మాల్యా ఎక్కడ?!

Published Fri, Mar 11 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

విజయ్‌మాల్యా ఎక్కడ?!

విజయ్‌మాల్యా ఎక్కడ?!

అప్పిచ్చేవాళ్లకు లోకజ్ఞానం పుష్కలంగా ఉండాలి. ముఖ్యంగా అప్పులు తీసుకుం టున్నవారి స్తోమత ఏమిటో అవగాహన ఉండాలి. దేశంలో పేరెన్నికగన్న 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయాయి. డబ్బుతో వ్యాపారం చేస్తున్నామన్న సంగతిని విస్మరించాయి. ఫలితంగా బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా అదృశ్య మయ్యాడు. ఆయన ఈ నెల 2నే దేశం విడిచి వెళ్లిపోయాడని తమకు సమాచారం అందిందని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గీ వెల్లడించారు. కొద్ది రోజులుగా మీడియాలో గుప్పుమంటున్నా ప్రభుత్వానికీ, బ్యాంకులకూ సీబీఐ చెప్పేవరకూ ఆ సంగతి తెలియకపోవడం అందరినీ దిగ్భ్రాంతిపరుస్తున్నది.

 కొన్నేళ్లుగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్న అవకతవకలు, నిధుల మళ్లింపు వ్యవహారం తెలిసినవారికి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్న బ్యాంకుల తీరు వింతగానే అనిపిస్తోంది. ఒక్క విజయ్ మాల్యా విషయంలోనే కాదు... కోట్లాది రూపాయలు అప్పు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూస్తున్న అనేకమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు సంబంధించి కూడా బ్యాంకులు ఇలాగే మౌనముద్ర పాటిస్తున్నాయి. సామాన్య పౌరులెవరైనా అయిదు వేలో, పదివేలో అప్పు కావాలని వెళ్తే బ్యాంకులు ఎన్ని యక్ష ప్రశ్నలు వేస్తాయో అందరికీ అనుభవమే. తీసుకునే రుణానికి సరిపడా ఆస్తుల్ని గ్యారెంటీగా చూపినా వాటికి ఓపట్టాన సంతృప్తి కలగదు. వాటిని తిరిగి చెల్లించడంలో ఆలస్యమైనా ఊరుకోవు. రైతులకైతే బ్యాంకుల్లో అప్పు పుట్టడమే అరుదు. బ్యాంకుల విధించే అనేక రకాల నిబంధనలతో విసుగెత్తి వారంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించడం సర్వ సాధారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌మాల్యావంటివారు ఒకపక్క అప్పులు ఎగ్గొడుతున్నా అడిగినంత రుణం దొరకడం, ఇవ్వకున్నా అడిగే నాథుడు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందికి జీతాలివ్వకుండా, ఆ సంస్థను సక్రమంగా నడపకుండా కాలక్షేపం చేస్తున్న విజయ్ మాల్యాకు బ్యాంకులు పదే పదే రుణాలిచ్చాయి.

 తన ఆధ్వర్యంలోని యుబి గ్రూపును ఇటీవలే బ్రిటన్‌కు చెందిన డియాజియో సంస్థకు ఆయన విక్రయించాడు. ఈ అమ్మకం విలువ రూ. 515 కోట్లు కాగా అందులో రూ. 275 కోట్లు ఆ సంస్థ చెల్లించింది కూడా. ఈ వ్యవహారం ముగిశాక తాను లండన్‌కు వెళ్లిపోతానని స్వయంగా విజయ్ మాల్యా ప్రకటించాకే బ్యాంకుల వెన్నులో చలి మొదలైంది. ఆ తర్వాతే ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షి యం రుణాల కేసులకు సంబంధించిన డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్‌టీ)ను ఆశ్ర యించింది. అప్పుల ఎగవేత వ్యవహారాన్ని మాల్యా ఎస్‌బీఐతో పరిష్కరించుకునే వరకూ రూ. 515 కోట్లు విడుదల చేయొద్దని డీఆర్‌టీ డియాజియోను మొన్న సోమ వారం ఆదేశించింది. అప్పటికే ఆ సంస్థ కొంత మొత్తాన్ని చెల్లిందన్న సంగతి బ్యాం కులకు తెలియదు. అసలు ఈ ఆదేశాలు ఇంతవరకూ డియాజియో సంస్థకు చేరనే లేదు. మరోపక్క తానిచ్చిన 900 కోట్ల రూపాయలనూ రాబట్టుకునేందుకు ఐడీబీఐ బ్యాంకు ఆయనపై మనీ ల్యాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఆ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ప్రశ్నించాలని నిర్ణయించేసరికే మాల్యా దేశంలో లేడు.

 తాను అప్పులు ఎగ్గొడుతున్నానని బ్యాంకులు చేస్తున్న ప్రచారం విజయ్ మాల్యాకు రోషం తెప్పించింది. నాలుగురోజుల క్రితం ఇందుకు నిరసనగా ఆయనొక బహిరంగ లేఖ కూడా రాశాడు. ‘ఇలా ఎగ్గొట్టింది నేనొక్కడినేనా?’ అని అందులో ఆయన ప్రశ్నించాడు. తనలాంటివారెందరో ఉండగా తననొక్కడినే వేలెత్తి చూపడమేమిటని మండిపడ్డాడు. అసలు నా ఆర్ధిక స్తోమత గురించి తెలిసి అప్పు ఎందుకిచ్చారని నిలదీశాడు. తనలాంటి వారినుంచి రావలసిన మొండి బకాయిల విలువ 11 లక్షల కోట్లుంటుందని, మరి తననే ఎందుకు వేలెత్తి చూపుతున్నారని ప్రశ్నించాడు. మన బ్యాంకులు వ్యాపారాన్ని ఎంత ఘనంగా నిర్వహిస్తున్నాయో, కోటీశ్వరులుగా భుజకీర్తులు తగిలించుకున్నవారిముందు ఎలా మోకరిల్లుతున్నాయో ఈ బహిరంగ లేఖ వెల్లడించింది.

తగిన పూచీకత్తు లేకుండా కింగ్‌ఫిషర్‌కు రూ. 9,000 కోట్ల అప్పు ఎలా ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు అటార్నీ జనరల్ ఇచ్చిన జవాబు ఆశ్చర్యం కలిగిస్తుంది. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌నూ, దాని గుడ్‌విల్‌నూ, కంపెనీకి ఉన్న విమానాలు తదితరాలను చూసి ఈ రుణాలిచ్చారన్నది ఆయన సమాధానం. మూలనబడిన విమానాల విలువ సంగతలా ఉంచి ఒకప్పుడు రూ. 4,111 కోట్ల విలువ కలిగిన కింగ్‌ఫిషర్ సంస్థ తాజా విలువ రూ. 6 కోట్లు మాత్రమే! బ్రాండ్, గుడ్‌విల్ లాంటి విలువలు నిలకడైనవి కాదు. కంపెనీ పనితీరును, దాని సామర్థ్యాన్నిబట్టి అవి నిర్ణయమవుతాయి. అలా చూసినా కింగ్‌ఫిషర్ కీర్తిప్రతిష్టలు ఎప్పుడో దిగజారాయి.

 విజయ్ మాల్యా అదృశ్యం విషయమై అటు బ్యాంకులూ, ఇటు కేంద్ర ప్రభుత్వమూ అమాయకత్వాన్ని నటిస్తున్నాయి. చిత్రమేమంటే తమ పాలనా కాలంలో ఆయనకు అన్నివిధాలా సాయపడిన కాంగ్రెస్ సైతం ఏమీ ఎరగనట్టు పార్లమెంటులో ఆవేశపడిపోతోంది. వ్యాపారవేత్తగా, రాజ్యసభ సభ్యుడిగా అందరికీ తెలిసి ఉన్న మాల్యా రహస్యంగా దేశం విడిచివెళ్లారంటే నమ్మశక్యం అనిపించదు. నిరుడు ఫిబ్రవరిలో స్వచ్ఛంద సంస్థ గ్రీన్‌పీస్‌కు చెందిన ప్రియా పిళ్లై లండన్‌లో జరిగే సదస్సు కోసం విమానం ఎక్కబోతుండగా వెనక్కి పంపేసిన మన భద్రతా యంత్రాంగానికి మాల్యా గురించి తెలియదనుకోవాలా? కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న లలిత్ మోదీ ఇప్పటికే విదేశాలకు చెక్కేసి మన ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాడు. విజయ్ మాల్యాకు ఆయన ఆదర్శమైనట్టున్నాడు. ఇలాంటి ఉదంతాలు మన వ్యవస్థలోని డొల్లతనాన్ని పట్టిచూపుతాయి. మన ఆర్ధిక సంస్థలు, ప్రభుత్వాల పరువు తీస్తాయి. విజయ్‌మాల్యాకు వెసులుబాటు కల్పించినవారికిది తట్టలేదా?
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement