డేర్‌ డెవిల్స్‌..ఈ లేడీ రైడర్స్‌! | women bike riders special story | Sakshi
Sakshi News home page

డేర్‌ డెవిల్స్‌..ఈ లేడీ రైడర్స్‌!

Published Tue, Feb 13 2018 9:27 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

women bike riders special story - Sakshi

సాహసం మా పథం: బైక్‌లపై దేశం సరిహద్దులు దాటుతూ మయన్మార్‌ ప్రయాణిస్తున్న తొలి మహిళా రైడర్లు జయ, శిల్ప, ప్రియా, శాంతి

బైక్‌.. మగాడి వాహనం! పురుషుడి దర్పానికి ప్రతిరూపం!! రఫ్‌గాఉండే బండి ఎక్కి రివ్వున దూసుకుపోవడం మగానుభావుడిమనో నిబ్బరానికి నిదర్శనం!!!.. ఏ ప్రకటన చూసినా ఇంతే కదూ.ఏ మూవీకి వెళ్లినా ఇదే ముద్ర కదూ.. బుల్‌ వంటి బైక్‌ మగువకు బహుదూరం కదూ! కాదూ కాదని నిరూపించారు ఆ నలుగురు లేడీ రైడర్స్‌.పొగరుబోతు బైక్‌ కొమ్ములు వంచే సత్తా ఇంతికీ ఉందని చాలెంజింగ్‌గా
రుజువు చేశారు. బైక్‌ ఎక్కి బలాదూర్‌గా తిరిగి తామూ దమ్మున్నవాళ్లమేనని దుమ్ము రేపేట్టు చూపారు. అంతేనా.. అంతే అయితే.. అక్కడితోఆగితే... వారు ఈ జనరేషన్‌ జవ్వనులెందుకవుతారు? అందుకే..
తొలిసారిగా బైక్‌లపై దేశ సరిహద్దులు దాటుతున్నారు. హైదరాబాద్‌లోబయల్దేరి వేల కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్‌ మీదుగా మయన్మార్‌..అక్కడి నుంచి లావోస్‌ వెళ్లి భారత కీర్తి పతాకను ఉత్తేజంతో ఎగరేయాలనిసంకల్పించారు. ఈ దేశపు ఆడబిడ్డలు దమ్ములో, ధైర్యంలో టాప్‌ గేర్‌లోఉంటారని సగర్వంగా రుజువు చేయదలచుకున్నారు. ఆ నలుగురూమార్గమధ్యంలో విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.

విశాఖ స్పోర్ట్స్‌: జయ.. పియా.. శిల్పా.. శాంతి. ఎందరో అమ్మాయిల్లా సాధారణ వనితలే. మామూలు కుటుంబాల నుంచి వచ్చి.. బరువు బాధ్యతలు మోసి.. మెప్పు పొందిన మామూలు మగువలే. అయితే.. అది తమకు సరైన గుర్తింపు కాదనుకున్నారు వాళ్లు. థింక్‌ డిఫరెంట్‌ అనుకున్నారు ఎవరికి వాళ్లు. ఏదో చేయాలన్న తపన నడిపిస్తే.. తమలో అంతర్లీనంగా ఉన్న సత్తాకు పదును పెట్టి శభాష్‌ అనిపించుకోవాలన్న ఆరాటం కెరటంలా ఉరకలేస్తే.. కొత్త బాట పట్టాలని సంకల్పించుకున్నారు. అడ్డుగోడలు పడగొట్టి, పాత భావాల బూజు పక్కన పెట్టి ఉరకలేశారు.. ఇప్పుడు ఆ నలుగురూ.. మగాళ్లే వారేవా అనే విధంగా మయన్మార్‌ వైపు బైక్‌లపై దూసుకుపోతున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా బైక్‌లపై సరిహద్దులు దాటిన మగువలన్న ఖ్యాతిని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

పాతకు పాతరేసి.. : స్కూటీనో.. స్కూటరెట్‌నో.. అమ్మాయిలకు బెస్ట్‌. అంతకుమించి హెవీ వెహికిల్‌ ఆడాళ్లకెందుకూ.. అనేది సమాజంతో స్థిరపడ్డ ఓ ఫినామినా. దాన్ని వారు భరించలేరన్న ‘జాలి’(!) ఫీలింగ్‌ కూడా ఉంది. దీన్ని తుడిచిపెట్టాలన్న సంకల్పంతో బైక్‌లపై చక్కర్లు కొట్టడం మొదలెట్టారు ఈ నలుగురూ. హైదరాబాద్‌లో పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా.. అర్థరాత్రి.. అపరాత్రి అన్న భయం లేకుండా బైక్‌లెక్కి దూసుకుపోయారు. అయితే అంతా భయపడేట్టు ఎక్కడా తమకు ‘అవాంఛనీయ’ పరిణామాలు ఎదురు కాలేదని నవ్వుతూ చెప్పారు వీరు. ఈ ప్రయాణాల తర్వాత ఇంతకన్నా భిన్నమైనదేదో చేయాలన్న పట్టుదల కలిగిందని, దాంతో సరిహద్దులు దాటే సంకల్పానికి బీజం పడిందని చెప్పారు.

విభిన్న జీవనాలు : ‘మేం నలుగురం వేరు వేరు వృత్తుల్లో స్థిరపడ్డాం. అయితే నలుగురిలో కామన్‌గా ఉన్నది బైక్‌లంటే వ్యామోహం. దూరాలు తరించాలన్న సంకల్పం. ఈ ఉత్సాహం మమ్మల్ని సాహస యాత్ర బాట పట్టించింది. ఈనెల 11న మా యాత్ర మొదలైంది. 18న మా బృందం మయన్మార్‌ చేరుకోనుంది. మార్చి 24న స్వస్థలాలకు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.’ అన్నారు టీం కెప్టెన్‌ జయభారతి. మొత్తంగా పదిహేడు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని, హైదరాబాద్‌లో ప్రారంభమైన యాత్ర అమరావతి మీదుగా సాగుతోందని సోమవారం విశాఖ చేరుకున్న సందర్భంగా ఆమె తెలిపారు. భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన స్దలాలను బయటి దేశాల వారికి పరిచయం చేయడమే లక్ష్యంగా పయనిస్తున్నట్టు తెలిపారు. 

వైజాగ్‌.. బ్యూటిఫుల్‌ : ‘హైదరాబాద్‌లో చారిత్రాత్మక కట్టడాలున్నాయి.  కాని విశాఖలో సహజసిద్ధమైన సాగరతీరం ఉంది. 25 కిలోమీటర్ల మేర సాగరతీరం వెంట రహదారి ఉంది.  బైక్‌ రైడ్‌ ఈదారిలో చాలా బాగుంది. భారత్‌లో యునెస్కొ గుర్తింపు పొందిన స్థలాలు 35 ఉన్నాయనే విషయం చాలా మందికి తెలీదు. మా యాత్రలో యునెస్కొ గుర్తింపు పొందిన 19 స్థలాలు దర్శిస్తాం. అక్కడ వారికి భారత్‌ దేశ గొప్పతనాన్ని వివరిస్తాం’ అని వీరు చెప్పారు. ఒక్కొక్కరూ తమ మనోభావాలను ఇలా పంచుకున్నారు.

శిక్షకులూ వీరే
సరదాగా వారికి బైక్‌ రైడింగ్‌ చేయడం హాబీ అనుకున్న ఈ నలుగురూ కొంత కాలానికి శిక్షకులుగా మారారు. ప్రతి శనివారం హైదరాబాద్‌లో విద్యార్థినులకు బైక్‌ నడపడంలో శిక్షణ ఇచ్చారు. తొలుత 20మందికి శిక్షణఇస్తే చాలనుకున్నారు.  తొలి ఏడాదిలోనే 200 మంది అమ్మాయిలకు శిక్షణ నిచ్చారు. గడిచిన ఐదేళ్ళలో ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.  ఎనిమిది శనివారాల పాటు ఇలా శిక్షణ ఇచ్చారు. ఆత్మ రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు.

నాన్న స్ఫూర్తి
మన దేశ సౌందర్యం గురించి బయటి ప్రపంచానికి తెలియాలి. అందుకే ఈ యాత్ర. ఇలా విదేశానికి బైక్‌పైనే వెళ్లాలని అనుకోవడానికి నా తండ్రి స్ఫూర్తి.  1979లో నా తండ్రి ఇలానే బైక్‌పై పారిస్‌ వెళ్లారు.  ఇప్పుడు నా సహచరులతో బైక్‌పై బయలుదేరాను.  నాకు ఇద్దరు చిన్నపిల్లలు న్నారు.  వారు ప్రోత్సహిస్తేనే ఈ యాత్రకు పూనుకున్నాను. –పియా బహదూర్‌

ఎక్కడైనా నో ప్రాబ్లమ్‌
బైక్‌పై ప్రయాణం ఓ అనుభూతి.  బైక్‌ రైడింగ్‌ అనేది మహిళలకు సేఫ్‌ కాదనడం సరికాదు.  ఈశాన్య రాష్ట్రాలలోనూ ప్రయాణం చేశాను. ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదు. అమ్మాయిలకు చాలా
అవకాశాలున్నాయి. భయం వీడాలి.  అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. రెండు సార్లు దేశంలోని నలుమూలలకు ప్రయాణం చేశాను. – శిల్పా బాలకృష్ణన్‌

ఇదో కొత్త అనుభూతి..
వృత్తి రీత్యా పోలీస్‌ను. సాహసయాత్ర చేయడం...బైక్‌పై దూసుకుపోవడం ఎంతో ఇష్టం. నలుగురం కలిసి బైక్‌పై ప్రయాణం చేయాలని కొన్ని నెలలుగా అనుకుంటూ ప్రణాళిక తీర్చిదిద్దాం.  భారత ఉప ఖండంలో సాహసయాత్ర చేయడం గొప్ప అనుభూతి.  అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెడితే అన్ని సుసాధ్యమే అని చెప్పడమే మా లక్ష్యం. – శాంతి

ఆత్మ విశ్వాసం ముఖ్యం
‘మగువలు బైక్‌పై వెళ్లడం అంతా సేఫ్‌ కాదు అనడం తగదు. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే నో ప్రాబ్లమ్‌. గత ఐదేళ్ళుగా హైదరాబాద్‌లో రాత్రి సయితం బైక్‌పైనే విహరించి మేం దీనిని నిరూపించాం.  వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌నయినా బైక్‌పై ట్రావెల్‌ అంటే చాలా ఇష్టం.  ఆ ఇష్టంతోనే గతంలో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బైక్‌ యాత్ర చేశాం.  ప్రస్తుతం దేశం దాటి మయన్మార్, కంబోడియా, «బంగ్లాదేశ్, లావోస్‌ వెళ్ళేందుకు పదిహేడు వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాం.   – టీమ్‌ లీడర్‌జయభారతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement