ఆపద సమయంలో క్షణాల్లో ఆదుకునే 108, ఇంటి ముంగిటకు వెళ్లి వైద్యసేవలందించే 104 వాహనాలు ఇప్పుడు మృత్యు రథాలుగా మారాయి. ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో నిర్వహణ భారంగామారింది. ఎక్కడ ఆగిపోతాయో తెలియదు. ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో అంచనా వేయలేని పరిస్థితి. పాతవాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా.. కాలం చెల్లిన వాటినే బలవంతంగా రోడ్లపైకి వదులుతున్నారు. ఫిట్‌నెస్ లేదని వాటిలో పనిచేసే సిబ్బంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా నడిపిస్తూ నిండు ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే కుయ్.. కుయ్.. మంటూ సంఘటన స్థలానికి చేరుకునే ప్రాణప్రదాయని 108 వాహనం. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది చనిపోతుంటే వారిలో సకాలంలో వైద్యం అందక చనిపోతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉందని అధ్యయనాలనుబట్టి తెలుసుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. జనం ప్రాణాలు నిలబెట్టడం కోసం 108 వాహన సేవలను అందుబాటులోకి తెచ్చారు.
సేవలు విరివిగా అందించి మన్ననలు అందుకున్నారు. నేటి పాలకుల స్వార్థం కారణంగా వాహన సేవలు ఆపదలో ఉన్నవారికి దూరమవుతున్నాయి. ఇంటి ముంగిటకే వచ్చి వైద్యసేవలందించేందుకు 104ను ప్రారంభించారు. ఈ వాహనాల పరిస్థితీ అంతే. మరమ్మతులకు గురైన వాహనాలనే తిప్పుతూ ఆపదలో ఉన్నవారిని.. అందులో పనిచేసే సిబ్బంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు.
ఫిట్‌నెస్ లేకుండానే...
బలిజిపేట మండలం మిర్తివలస గ్రామ సమీపంలోని శివాలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 104 వాహనం డ్రైవర్ మహేష్‌తో పాటు, ఎనిమిది నెలల నిండు గర్భిణిగా ఉన్న స్టాఫ్‌నర్స్ నెమలి సంతోషికుమారి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అదే 104 వాహనంలో వారిరువురూ ఎంతో మందికి ప్రాణం పోసి ఉంటారు. గర్భిణులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి మాతృమూర్తుల దీవెనలందుకున్నారు. వారి వరకూ వచ్చే సరికి అదే వాహనం మృత్యురథమైంది. కనికరం లేని విధి కాటు వేసిందని తప్పించుకుంటే అది కచ్ఛితంగా పాపమే అవుతుంది. ఎందుకంటే.. ఈ రెండు నిండు జీవితాలను బలితీసుకుంది కేవలం పాలకుల నిర్లక్ష్యం. కొందరి స్వార్థం. దానికి నిదర్శనం జిల్లాలోని çపదిహేడు 104 వాహనాలు, ఇరవై ఎనిమిది 108 వాహనాలకు పాతబడిపోయినా, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకపోయినా వాటినే నడుపుతున్నారు.
ప్రాధాన్యం ఉన్నా...
చంద్రన్న సంచార చికిత్స (104) వాహనాలను సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచుతుంటారు. వాహనం గ్రామానికి వెళ్లినప్పుడు అందులో స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్టు, డ్రైవర్, ఏఎన్‌ఎం, సంబంధిత పీహెచ్‌సీ వైద్యుడు, ల్యాబ్‌టెక్నీషియన్ వెళ్తారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. ఇంతటి ప్రాధాన్యంగల వాహనాల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఏ వాహనం అయినా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (ఎఫ్‌సీ), బీమా (ఇన్సూరెన్స్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) ఉంటేనే రోడ్డుపై తిప్పాలి. కానీ, చంద్రన్న సంచార వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోయినా రోడ్డుపై తిప్పేస్తున్నారు. అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారంటూ 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌కు గత నెల 23నే ఫిర్యాదు చేశారు. వారెవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారేగనుక అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు ఈ రెండు ప్రాణాలతో పాటు భూమిమీదకు రాకుండానే పసిగుడ్డు చితికిపోయేది కాదు.
అవును.. ఫిట్‌నెస్ లేదు..
జిల్లాలో ఉన్న 104 (చంద్రన్న సంచార చికిత్స) వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేని మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం.
–బి.సూర్యారావు, 104 సేవల మేనేజర్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment