నరసాపురం : ఉప్పుసాగు కష్టాల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. ఉప్పు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం, నాయకులు చెప్పుకొచ్చిన మాటలు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉప్పుసాగును తీరంలో రైతులు క్రమేణా తగ్గించేస్తున్నారు. ఒకప్పుడు నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరగ్రామాల్లో ఎక్కడ చూసినా ఉప్పుమడులు కనిపించేవి. ప్రస్తుతం అవన్నీ వనామీ చెరువులుగా మారిపోయాయి. పండించిన ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు లాంటి సదుపాయాలు, గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉంటే ఉప్పు పండించడానికి తీరం రైతులు ఇప్పటికీ సిద్ధమే. అయితే అలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఉప్పుపంట ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్రం తీరప్రాంతం విస్తరించి ఉంది. తీర గ్రామాల్లోని అనేకమంది ఉప్పు సాగు చేస్తుంటారు. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో ఉప్పుపంట సాగు జరుగుతుంది. సుమారు 10 వేల కుటుంబాల వారు ఉప్పు పంటనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా మత్స్యకారులే కావడం మరో విశేషం.
కష్టంతో కూడిన సాగు
వేట మాదిరిగానే ఉప్పు సాగు కూడా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా ఉప్పు సాగు మండే ఎండల్లో చేయాలి. చిన్న చిన్న మడులను ఏర్పా టు చేసి సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులను కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. ఇక సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఇలా తయారైన ఉప్పును విక్రయించేటప్పుడు మాత్రం ఉప్పు రైతులకు సరైన ఆదాయం అందని పరిస్థితి. ఒక్కో ఎకరానికి రూ.15,000 నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతూ ఉంటుంది. తీరా 60 రోజుల పాటు శ్రమించి ఉప్పు పండించిన రైతులకు పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
రైతులకు దన్ను ఇవ్వని ప్రభుత్వం
పండించిన ఉప్పును రైతులు ఆరుబయటే కుప్పలుగా పోసి ఉంచుతారు. దీంతో పంటకు రక్షణ ఉండదు. ఆకస్మాత్తుగా వర్షాలు పడినా, తుపానులు వంటి విపత్తులు వచ్చినా మొత్తం వర్షార్పణం అవ్వాల్సిందే. జిల్లాలో ఉప్పు నిల్వకు ఎక్కడా గోదాములు లేకపోవడంతో పండించిన ఉప్పును అప్పటికప్పుడు రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో దళారులు రైతులను అయినకాడికి దోచుకుంటున్నారు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా కూడా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా నష్టపరిహారం రాదు. ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు ఉండవు. రైతులు ఎన్నోసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తూర్పుతాళ్లు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆమె స్వయంగా ఉప్పుసాగు ప్రాంతాలను సందర్శించారు. తీరంలో ఉప్పుసాగును అభివృద్ధి చేస్తామని, ఉప్పుసాగును అంతర్జాతీయ ప్రమాణాలతో సాగించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. తరువాత కాలంలో ఆమె ప్రాతినిధ్యం వేరే రాష్ట్రానికి మారడం, ఆ తరువాత రక్షణ మంత్రిగా ఆమె బాధ్యతలు మరింత పెరగడంతో ఇటువైపు దృష్టి సారించలేదు. ఇక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరంలో ఉప్పుసాగుకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామని, గిడ్డంగులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తరువాత ఆ ఊసేలేదు.
ఒకప్పుడు 25 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలోని తీరగ్రామాల్లో ఒకప్పుడు 25 వేల ఎకరాల పైనే ఉప్పుసాగు జరిగేది. వేలాది మంది ఉపాధి పొందేవారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో సాగును విరమించారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో మాత్రమే సాగులో ఉంది. మొగల్తూరు మండలంలో దాదాపుగా ఉప్పుమడులన్నీ రొయ్యలు, చేపలు చెరువులుగా మారిపోయాయి. నరసాపురం మండలంలో కూడా సాగు తగ్గిపోతుంది. ప్రస్తుతం దళారులు రైతుల వద్ద బస్తా రూ.100కు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్‌లో బస్తా ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతుండటం గమనార్హం.
గిట్టుబాటు ధర లేదు
ప్రస్తుతం ఉప్పు సాగు సీజన్ మొదలవుతుంది. కానీ ఇదివరకటి హడావుడిలేదు. నాతోటి వారు చాలామంది ఈ ఏడాది సాగు చేయడంలేదు. ఏటా వరుస నష్టాల కారణంగా సాగు విరమించారు. భూమిని రొయ్యల చెరువుకు లీజుకిచ్చారు. నేను కూడా వచ్చే ఏడాది సాగు చేయను. – మైల వెంకటేశ్వరరావు, పీఎం లంక, నరసాపురం మండలం
దళారులు చెప్పిందే ధర
పండించిన ఉప్పు మొత్తం ఆరుబయటే పోసుకోవాలి. గిడ్డంగులు ఏమీ లేవు. దీంతో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు తుపాను పడుతుందోనని భయం. అందుకే దళారులు ఎంత అంటే అంతకు అమ్ముకోవాలి. పంటకు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వవు. దీంతో సాగు నుంచి విరమిస్తున్నాం. – తిరుమారని కుశరాజు, తూర్పుతాళ్లు, నరసాపురం మండలం
ప్రత్యేక పంటగా గుర్తించాలి
ఉప్పు సాగు అనేది మనకు ప్రత్యేకం. దీనిని ప్రత్యేక పంటగా గుర్తిం చాలి. రుణసదుపాయం, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. ఆక్వా దెబ్బతో ఇప్పటికే వరి పొలాలు కనుమరుగవుతున్నాయి. ఉప్పుమడులు కూడా చెరువుగా మారిపోతున్నాయి. ఇది ప్రమాదం. – డాక్టర్ ఎస్.నాగభూషణం, సర్వోదయ రైతు సంఘం నేత
Comments
Please login to add a commentAdd a comment