జంగారెడ్డిగూడెం పేరంపేట వెళ్లే రోడ్డులో మొక్కజొన్న తోట చుట్టూ ఏర్పాటు చేసిన కరెంటు తీగ
పొలాల మాటున విద్యుత్ కంచెలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలకాలంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు తమ పొలాల్లోకి ప్రవేశించే పందులు, ఎలుగులు(ఎలుగుబంట్లు) మట్టు పెట్టేందుకు పొలం చుట్టూ జీఏ వైరుతో పెన్సింగ్ ఏర్పాటు చేసి కరెంట్ పెడుతున్నారు. పందుల మాట ఎలా ఉన్నా ఈ విధానం వల్ల ఏకంగా మనుషుల ప్రాణాలే గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా
రైతులు గుట్టుచప్పుడు కాకుండా పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార యంత్రాంగం నిఘా పెట్టి నియంత్రణ చేయకుంటే మున్ముందు ఈ విధానం ప్రాణాలకే ముప్పు.
పశ్చిమగోదావరి: జిల్లాలో ఇటీవలకాలంలో పందులు తమ పొలాల్లో చొరబడకుండా రైతులు తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. కంటికి కనిపించని రీతిలో ఈ తీగలు ఉండటంతో పొలాల వెంబడి నడిచి వెళ్లేవారు గుర్తించలేక మృత్యువాత పడుతున్నారు. ఈ విధానం తొలుత డెల్టా ప్రాంతం నుంచి ప్రారంభమై నేడు ఏజెన్సీ, మెట్ట ప్రాంతానికి సైతం పాకింది.
సరఫరా ఆపకుంటే ప్రాణాలు గాల్లోకే..
పందులు, ఎలుగుల నివారణ కోసం రైతులు జీఏ వైరును అమర్చి విద్యుత్ మోటారు స్విచ్ బోర్డు నుంచి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయమే సరఫరా నిలుపుదల చేస్తూ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని అనేక మంది సాటి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం మరచినా విద్యుత్ తీగలే యమపాశాలుగా మారే అవకాశం ఉంది. సరదాగా పొలాలకు వెళ్లే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ తీగలను గమనించకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన కర్నూర్ జిల్లా సంజామల మండలం మిక్కినేని పల్లెలో అడవి పందుల నివారణ కోసం పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి షేక్ సుకుర్ బాషా, ప్రవల్లిక అనే ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విద్యుత్ కంచెల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం
రైతులు పొలాల్లో తీగలతో కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా రైతులు ఈ విధానానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
–సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment