
ప్రతీకాత్మక చిత్రం
అవును.. మన సూర్యుడు నిద్దరోతున్నాడు
ఒకటి కాదు.. రెండు కాదు..
ఏకంగా పదహారు రోజులుగా నిద్రలోనే జోగుతున్నాడు..
ఈ నిద్ర అయస్కాంత తుపానులకు దారితీయొచ్చు..
ఉపగ్రహాల పనితీరు దెబ్బతినేందుకు కారణం కావొచ్చు!అదే జరిగితే.. ఇంటర్నెట్ కట్! విమాన ప్రయాణాలు బంద్!
ముందు సూర్యుడు నిద్రపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం. సన్‌స్పాట్స్ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? సూర్యుడిపై నిత్యం పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతుంటాయి. వీటి కారణంగా ఆయా ప్రాంతాల్లో నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటినే సన్‌స్పాట్స్ అంటారు. ఈ సన్‌స్పాట్స్ అన్నివేళల్లో ఒకే తీరుగా ఉండవు. ఓ క్రమపద్ధతి ఉంటుంది. 11 ఏళ్ల పాటు సన్‌స్పాట్స్ సంఖ్య పెరుగుతుంటుంటే ఆ తర్వాతి 11 ఏళ్లు తగ్గుతూ వస్తాయి. ఈ హెచ్చుతగ్గులను సోలార్ మ్యాక్సిమమ్, మినిమమ్ అని పిలుస్తారు. ప్రస్తుతం సోలార్ మ్యాక్సిమమ్ దశ ముగిసి, మినిమం దశకు చేరుకుంది. అయితే రికార్డులను పరిశీలిస్తే సోలార్ మినిమంలో కూడా అప్పుడప్పుడూ కొన్ని సన్‌స్పాట్స్ ఏర్పడుతుంటాయట. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిత్యం సూర్యుడిపై కన్నేసి ఉంచే నాసా విభాగం సోహో (సోలార్ అండ్ హీలియోస్పెరిక్ అబ్జర్వేటరీ)ని పరిశీలిస్తే.. సూర్యుడిపై గత 16 రోజులుగా ఒక్క సన్‌స్పాట్ కూడా నమోదు కాలేదని తెలుస్తోంది.
భూ వాతావరణానికి చల్లదనం..
సోలార్ మ్యాక్సిమమ్ సమయంలో సూర్యుడిపై రోజుకు వంద నుంచి రెండు వందల సన్‌స్పాట్స్ కూడా ఏర్పడతాయని రికార్డులు చెబుతున్నాయి. ఈ సన్‌స్పాట్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే.. ఒక్కోటి మన గురుగ్రహమంత సైజులో కూడా ఉండొచ్చు. సోలార్ మినిమం సమయంలో సూర్యుడి వాతావరణంపై దీర్ఘకాలంపాటు ఉండిపోయే రంధ్రాలు (కరోనల్ హోల్స్) పడతాయని.. ఖగోళ కిరణాలు కూడా ఎక్కువగా వెలువడతాయని నాసా చెబుతోంది. ఈ ఖాళీల నుంచి బాగా ఉత్తేజితమైన కణాలు బయటపడి.. మనవైపు దూసుకొస్తాయి. ఫలితంగా అయస్కాంత తుపానులు చెలరేగి ఉపగ్రహాలు.. విద్యుత్తు గ్రిడ్‌లకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఈ సౌర తుపానుల కారణంగా భూ వాతావరణంలో మార్పులు వచ్చి.. మెరుపులు ఎక్కువగా కనిపిస్తాయి.
అదే సమయంలో మబ్బులు ఏర్పడటం కూడా పెరుగుతుంది. 16 రోజులుగా సన్‌స్పాట్స్ లేకపోవడం సోలార్ మినిమం వచ్చేసిందనేందుకు సూచికగా చూడాలని అంటోంది. ఈ దశ దాటిన తర్వాత మళ్లీ మరింత బలమైన సన్‌స్పాట్స్ ఏర్పడతాయని వివరించింది. సోలార్ మినిమం దశలో భూవాతావరణం చల్లబడటం. 1650–1710 మధ్యకాలంలో సోలార్ మినిమం ఏర్పడినప్పుడు భూమి మినీ మంచుయుగాన్ని చవిచూసిందని భూ ఉత్తరార్ధ గోళంలోని హిమనీనదాలు గణనీయంగా విస్తరించగా.. చాలాదేశాలు మంచులో కూరుకుపోయాయని రికార్డులు చెబుతున్నాయి. 2014లో సూర్యుడు సోలార్ మ్యాక్సిమమ్ దశలో ఉండగా.. అత్యధిక సంఖ్యలో సన్‌స్పాట్స్ కనిపించాయి. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉన్నాయి.
గురుత్వశక్తుల కలయిక కారణం?
ప్రతి 11 ఏళ్లకోసారి సోలార్ మ్యాక్సిమమ్, మినిమం ఏర్పడటానికి కారణమేంటన్న విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఇటీవల జర్మన్ శాస్త్రవేత్తలు కొందరు చేసిన పరిశోధన ప్రకారం.. భూమి, బుధ గ్రహాలతో పాటు గురుగ్రహపు గురుత్వ శక్తులన్నీ ప్రభావం చూపడం వల్ల ఈ సౌరచక్రం ఏర్పడుతుంది. సుమారు 11.07 ఏళ్లకు ఒకసారి ఈ గ్రహాలన్నీ సూర్యుడిపై ప్రభావం చూపేంత దగ్గరకు వస్తుంటాయని అంచనా. సూర్యుడిపై ఉండే ప్లాస్మా ఒక్క మిల్లీమీటర్ స్థాన చలనం చెందినా.. దాని ప్రభావం పెద్దస్థాయిలో ఉండే సన్‌స్పాట్స్ ఏర్పడటంలో తేడా వస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment