
జనంతపురం
‘అనంత’లో వైఎస్ జగన్ ఐదో విడత రైతుభరోసాయాత్ర చివరిరోజు ఆదివారం కదిరి ఆర్‌అండ్‌బీ....
► ప్రజాస్వామ్య పరిరక్షణ సభకు పోటెత్తిన జనం
► ప్రకాశ్‌ను హత్య చేసేందుకు యత్నించడం దారుణం: జగన్
► అనంత’లో ముగిసిన ఐదో విడత రైతుభరోసా యాత్ర
► యాత్రలో అలజడి సృష్టించేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులు
► అనంత’ ఆదరణను జీవితంలో మరవలేనని చెప్పిన జననేత
► విజయవంతం చేసిన ప్రజలకు జిల్లా అధ్యక్షుడు కృతజ్ఞతలు.
అధికార అండతో రెచ్చిపోయి తమపై టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు.. వారికే వత్తాసు పలుకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీసుల తీరుతో విసిగివేసారిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జిల్లా ప్రజలు ఏకమై పిడికిలి బిగించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సభకు వేలాదిగా పోటెత్తారు. రాప్తాడుతో పాటు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనంతో నగర వీధులు కిక్కిరిశాయి. సప్తగిరి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకూ జనసంద్రమైన రోడ్లతో నగరవాసులంతా ఇది అనంతపురమా? జనంతపురమా? అని చర్చించుకున్నారు.
సాక్షిప్రతినిధి, అనంతపురం:- ‘అనంత’లో వైఎస్ జగన్ ఐదో విడత రైతుభరోసాయాత్ర చివరిరోజు ఆదివారం కదిరి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఓబుళదేవర చెరువు మండలం వడ్డివారిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఓడీసీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుండి నల్లమాడ, ముదిగుబ్బ, బతల్తపల్లి మీదుగా అనంతపురానికి చేరుకున్నారు. ఓడీసీతో పాటు మూడు మండలాల్లో కూడా ప్రజలు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురానికి చేరుకున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల వేధింపులకు నిరసనగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణసభ’ పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ కార్యకర్తలు, వేధిం పులకు గురవుతున్న ప్రజలు తరలివచ్చారు. నగరంతో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి కూడా తరలివచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తూ టీడీపీ నేతల అరాచకాలు తీవ్రమవుతున్నాయని, వీటికి ప్రభుత్వం, పోలీసులు సహకరిస్తున్నారని విమర్శిం చారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళితే ఆయనపైనే హత్యాయత్నానికి పాల్పడడాన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలన్నారు.
అలజడి సృష్టించేందుకు యత్నం
రైతు భరోసాయాత్రలో జగన్‌కు జనాదరణను చూసి ఓర్వలేక అధికారపార్టీనేతలు అలజడి సృష్టించేందుకు యత్నించారు. యాడికి, పెద్దపప్పూరులో ధర్నాలు చేశారు. కదిరిలో కూడా జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశా రు. అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై భౌతికదాడులకు దిగారు. చంద్రమోహన్‌రెడ్డి అనే కార్యకర్తను హతమార్చేందుకు కత్తితో పొడిచారు. అయితే ప్రజాభిమానం ముందు ఇవేం నిలవలేదు. చివరకు ప్రజలు జగన్‌కు రక్షణగా నిలిచేందుకు వేలాదిగా తరలివచ్చారు. యాత్రలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వెంకట్రామిరెడ్డి, తిప్పేస్వామి, ఉషాశ్రీచరణ్, వీఆర్ రామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శింగనమల నేత ఆలూరి సాంబశివారెడ్డి, సీఈసీ సభ్యుడు సిద్ధారెడ్డి, నేతలు చవ్వా రాజశేఖరరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, నదీమ్ అహ్మద్, మీసాల రంగన్న, రంగంపేట గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
అనంత వాసులకు కృతజ్ఞతలు
ఐదో విడత రైతో భరోసా యాత్రను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఐదు విడతల యాత్రలూ విజయవంతంగా సాగాయన్నారు. ఐదో విడతలో టీడీపీనేతలు అరాచకాలు సృష్టించేందుకు యత్నించినా ప్రజలే ముందుండి నడిపించారన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందన్నారు.
హంద్రీ-నీవా నీటిని అడిగినందుకే దాడులు
మహానేత వైఎస్ హంద్రీ-నీవా ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉంది. అయితే జిల్లాలో ఆయకట్టు రద్దు చేసి కృష్ణా జలాలను కుప్పం తరలించే కుట్ర జరుగుతోంది. దీనిపై ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో నష్టపోయే రైతాంగానికి అవగాహన కల్పించే కార్యక్రమాలకు పూనుకున్నాం. అసలు విషయం పూర్తిగా ప్రజల్లోకి వెళ్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించే దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ హయాంలో శాంతిభద్రతల సమస్యే లేదు. ఈ రోజు దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. పోలీసులు మీ మాట వింటున్నారని కేసులు బనాయిస్తే ఖబడ్దార్. అరాచక పాలన ఎన్నో రోజులు సాగదు. - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త
కుమారుడిని కట్టడి చేసుకోలేని స్థితి
మంత్రి పరిటాల సునీత తన కుమారుడిని కట్టడి చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక మహిళకు మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందవచ్చు. హంద్రీ-నీవా నీటి విషయంలో నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై ప్రకాష్‌రెడ్డి అవగాహన కల్పించేందుకు పూనుకున్నారు. అయితే మంత్రి తనయుడు ఆయా గ్రామాలకు వెళ్లి అడ్డుకోవాలంటూ కార్యకర్తలకు సూచించాడు. ఈ విషయం మంత్రికి తెలీదా? కాలం ఎప్పుడూ ఇలానే ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
- తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి , రాప్తాడు నియోజకవర్గ నాయకుడు