ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..
ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళతాం. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలే కాకుండా అణగారిన వర్గాలు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు మేలు చేకూరుస్తాం. నవరత్నాలతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తాం. మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండానే రుణాలిప్పిస్తాం. వైఎస్సార్ దుల్హన్ పథకం ద్వారా వివాహం చేసుకోబోయే ప్రతి జంటకు రూ.లక్ష సాయంగా అందజేస్తాం.
సాక్షి కడప /కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం.. కొద్దిరోజులకే ఒకేసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలను ఎంపిక చేశారు. అందులో ముస్లిం మైనార్టీ వర్గాల కోటాలో సౌమ్యుడు, పార్టీ కోసం నిరంతరం పనిచేసే సైనికుడు, సేవాభావం కలిగి మంచి నాయకుడిగా పేరున్న కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌బాషాకు మంత్రి వర్గంలో మైనార్టీశాఖను అప్పగిస్తూనే మరోపక్క డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో.. ఇన్నేళ్ల చరిత్రలో ఏ పార్టీ నాయకుడు చేయని విధంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టారు. ఇది అపురూపఘట్టం. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న సీఎం వైఎస్ జగన్...మంత్రి వర్గంతోపాటు డిప్యూటీ సీఎంల నియామకంలోనూ సామాజిక వర్గ సమతుల్యతను పాటించి ప్రజల్లో తిరుగులేని నేతగా ఆవిర్భవించారు. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే అంజద్‌బాషా కూడా పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తూ నేడు ఉన్నత స్థానమైన డిప్యూటీ సీఎం హోదాలోకి వెళ్లడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ముస్లిం మైనార్టీల సంక్షేమంతోపాటు జిల్లా అభివృద్ధికి పాటుపడటం.. వక్ఫ్ ఆక్రమిత ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక చర్యలు.. పేదలకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు.. ఇతర అనేక అంశాలపై ఆయన ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారిగా కడపకు వచ్చిన ఆయన రోడ్లు భవనాలశాఖ అతిథి గృహంలో సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
జూన్ 8వ తేది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అ«ధ్యాయంగా చెప్పవచ్చు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో యావత్ ముస్లిం సమాజం గర్వపడుతోంది. మనవాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడని చిన్న పెద్ద, తర తమ బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు నాకు ఘన స్వాగతం పలకడం అదృష్టంగా భావిస్తున్నాను. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి...ఎందరో ముఖ్యమంత్రులయ్యారు. ముస్లిం మైనార్టీ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుని అవసరం తీరాక వదిలేశాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే ముస్లిం వర్గాలకు పెద్దపీట వేసి నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ కల్పించి లక్షలాది మంది నిరుపేదలను ఉన్నత చదవులు చదివించారు.
వైఎస్‌ఆర్ బాటలో పయనించే వైఎస్ జగన్ రెండు అడుగులు ముందుకేసి ముస్లింలను విద్యపరంగానే కాకుండా సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడానికి 2019 ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. వారిలో నలుగురు విజయం సాధించారు. ఒక్క హిందూపురంలో మాత్రమే ఓడిపోయారు. ఇటీవల రంజాన్ మాసం సందర్భంగా గుంటూరు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. పరాజయం పొందిన ఇక్బాల్‌కు కూడా ఎమ్మెల్సీని ప్రకటించి ముస్లిం వర్గాల్లో సంతోషాన్ని నింపారు. మరో వారం రోజులకే ముస్లిం వర్గానికి చెందిన నన్ను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో ముస్లిం మైనార్టీల ఆనందానికి అవధుల్లేవు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి..
ప్రత్యేకంగా జిల్లాలో వైఎస్సార్ హయాంలో అభివృద్ధి పరుగులు తీసినా.. తర్వాత ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈ పదేళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలోనే చేసి చూపించడానికి ప్రయత్నిస్తాం. జిల్లా కేంద్రమైన కడప నగరంలో తాగునీటి సమస్యను శాశ్వితంగా పరిష్కరించడానికి సోమశిల బ్యాక్ వాటర్ స్కీమ్‌ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయిస్తాం. తద్వారా 24 గంటలు తాగునీరు అందిస్తాం. భూగర్భ డ్రైనేజీ పథకం, బుగ్గవంక సుందరీకరణ, అప్రోచ్‌రోడ్లు, ట్రాఫిక్ సమస్య, రోడ్ల విస్తరణ వంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించి కడప నగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు కృషి చేస్తాం. యోగి వేమన యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. జిల్లాలో అనేక పరిశ్రమలు, ఇతర అనేక రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రిమ్స్ ఆస్పత్రిని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతాం. అత్యున్నత వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతాం.’ అని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా వివరించారు.
ఉక్కు పరిశ్రమ నెలకొల్పి ఉపాధి కల్పిస్తాం..
జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం. ఏళ్ల తరబడి వెనుకబాటు తనానికి గురైన జిల్లా వైఎస్సార్ హయాంలో అభివృద్ధి పరుగులు తీసింది. ఆయన మరణానంతరం ఆ అభివృద్ధి అంతా ఆగిపోయింది. సుమారు పదేళ్లుగా ప్రభుత్వాలు ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. చివరికి చంద్రబాబు సర్కార్ కూడా జిల్లా పట్ల పక్షపాతం చూపింది. ఒక్క పరిశ్రమను కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. విభజన సమయంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యమైన పాలన అందించారు. తమ ప్రభుత్వంలో ఆరు నెలల్లోనే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి మూడేళ్లలో ఉత్పత్తిని ప్రారంభిస్తాం. రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒక ఉపాధి విప్లవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. ప్రత్యేకంగా సీఎం వైఎస్ జగన్ పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ఉన్నారు. వరుస కరువుతో ఐదేళ్లుగా జిల్లా రైతాంగం అల్లాడిపోయింది. వైఎస్సార్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే విధంగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. జీఎన్‌ఎస్‌ఎస్, హంద్రీ–నీవా, గండికోట, సర్వరాయసాగర్‌తోపాటు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి నీటితో నింపుతాం. వైఎస్సార్ హయాంలో పనులన్నీ స్పీడుగా జరిగినా తర్వాతి ప్రభుత్వాలు ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment