ప్రొద్దుటూరు క్రైం : వైద్య పరీక్షల పేరుతో తమ పట్ల డాక్టర్ సాయిప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మౌలానా ఆజాద్ వీధులకు చెందిన మహిళలు ఆరోపించారు. బుధవారం పలువురు మహిళలు మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాతో కలసి ఆస్పత్రి వద్దకు వెళ్లారు. డాక్టర్ తీరును నిరసిస్తూ మహిళలు ఆయన పనిచేస్తున్న వసంతపేట అర్బన్ హెల్త్ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ముఖంపై కప్పుకున్న నఖాబ్ (ముసుగు)ను తీయమని చెబుతాడని, స్టెతస్కోప్‌తో పరీక్షించే క్రమంలో అనవసరంగా శరీర భాగాలను తడుముతాడని మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళలతో వారి భర్తలు కూడా వచ్చి ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. డాక్టర్‌ను వెంటనే తొలగించి మహిళా వైద్యురాలిని నియమించాలని వారు డిమాండు చేశారు. కొందరైతే నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లి నిలదీశారు.
నాకు అలాంటి అవసరం లేదు
నేను చాలా సీనియర్ డాక్టర్‌ను. మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాను. మెడికల్ కాలేజి విద్యార్థులకు నైతిక విలువలను బోధిస్తున్నాను. ఈ వయసులో నాకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఆస్పత్రికి వస్తున్న మహిళలు ఇంజక్షన్లు వేయాలని, యాంటిబయాటిక్స్ టాబ్లెట్స్ ఇవ్వాలని అడుగుతుం టారు. ఎక్కువగా ఇంజక్షన్లు, యాంటిబయాటిక్స్ వాడటం మంచిది కాదనే ఉద్దేశంతో వాటిని సిఫార్సు చేయను. ఈ ఉద్దేశంతోనే నాపై నిందలు వేస్తున్నారని డాక్టర్ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment