
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బిహార్‌లోని ΄పాట్నాలో నిర్వహించారు. ఈ వేడుకలో ‘పుష్ప: ది రూల్’ సినిమా తెలుగు, హిందీ ట్రైలర్స్‌ను విడుదల చేశారు.

‘పుష్ప అంటే పేరు కాదు... పుష్ప అంటే బ్రాండ్, శ్రీవల్లి నా పెళ్లాం... పెళ్లాం మాట మొగుడు యింటే ఎట్టా ఉంటదో పెపంచానికి చూపిస్తా, ΄ార్టీ ఉంది పుష్పా, పుష్ప అంటే నేషనల్ అనుకుంటి రా... ఇంటర్‌నేషనల్’ అనే డైలాగ్స్ తెలుగు వెర్షన్ ట్రైలర్‌లో ఉన్నాయి.

అల్లు అర్జున్ మాట్లాడుతూ..‘‘పాట్నాలో ‘పుష్ప: ది రూల్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. తొలిసారి బిహార్ వచ్చాను. ‘పుష్ప’ తగ్గేదేలే... కానీ మీ ప్రేమకు తగ్గుతున్నాడు. ‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? కాదు... వైల్డ్ ఫైర్. నా హిందీ భాష కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మన్నించండి. డిసెంబరు 5న ఈ సినిమాను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు.



ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన బిహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ సేన సాహెబ్ మాట్లాడుతూ– ‘‘పుష్ప: ది రూల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బిహార్‌లోని పాట్నాలో నిర్వహించడం సంతోషంగా ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారిగారి తరఫున ఈ యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఎవరైనా మా రాష్ట్రానికి అతిథిగా విచ్చేసినప్పుడు వారికి మా ప్రేమానురాగాలు చూపించడంలో ముందుంటాం. ఈ ఈవెంట్ ఇలా విజయవంతంగా జరగడానికి తోడ్పడుతున్న పోలీసులు, అభిమానులు, ప్రజలు... వీళ్లందరూ కళను, కళాకారులను సపోర్ట్ చేసేవారు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

‘‘అల్లు అర్జున్‌గారి హార్డ్‌వర్క్, సుకుమార్‌గారి విజన్ వల్లే ‘పుష్ప: ది రూల్’ సినిమా సాధ్యమైంది. ఆంధ్రాలో మేం కొన్ని ఈవెంట్స్ చేశాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో జనాన్ని చూడలేదు. చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు నవీన్ ఎర్నేని.

‘‘పాట్నాలోని ప్రజల నుంచి వస్తున్న స్పందన మాకు సంతోషాన్నిస్తోంది. పది సంవత్సరాలుగా ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నాం. ఈ స్థాయిలో ప్రజలు రావడం ఇదే. ఇది వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్’’ అని వెల్లడించారు వై. రవిశంకర్.

‘పుష్ప 2’ కాస్త ఆలస్యమైంది. కానీ ప్రేక్షకులందర్నీ అలరిస్తుంది’’ అన్నారు రష్మికా మందన్నా.






































