
మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే గుర్తొచ్చేది మాస్, కామెడీ. తనదైన మాస్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ తోనే ఆయన ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి రవితేజ 75వ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 28 గా నిర్మిస్తోంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో "ధమాకా"తో బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అలాగే "ధమాకా" విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

జూన్ 11వ తేదీన ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమంతో మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కి శ్రీలీల క్లాప్ కొట్టగా, భాను బోగవరపు దర్శకత్వం వహించారు. నేటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.