Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Denies Anticipatory Bail To P Krishna Mohan Reddy and K Dhananjaya1
రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు

ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు..పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు.. పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తాం.థర్డ్‌ డిగ్రీ ఉపయోగించినా.. బెదిరించినా.. ఒత్తిడి చేసినా.. ప్రలోభపెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు, సహ నిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులను అనుసరిస్తోంది. పిటిషనర్లు, ఇతర సహ నిందితుల విషయంలో థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభపెట్టడం చెయ్యడానికి వీల్లేదు. సాక్షి, అమరావతి: ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, రాజకీయ దురుద్దేశాల కారణంతో.. నిందితులను కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయకుండా దర్యాప్తు అధికారిని నిరోధించలేమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్థివాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.\మద్యం వ్యవహారంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని చెబుతూ, వారి పిటిషన్లను కొట్టివేసింది. పిటిషనర్లపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదని ఏపీ సీఐడీ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదంది. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలని ఆదేశించింది. పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే, కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. సీఐడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారు మద్యం కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ పార్థివాలా ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ప్రభుత్వం మారగానే కేసు నమోదైందని వారు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ దర్యాప్తునకు పిటిషనర్లు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 13 గంటల చొప్పున వీరిని దర్యాప్తు అధికారి ప్రశి్నంచారన్నారు. ఎలాంటి అక్రమాల్లేవనీ సీసీఐ తేల్చింది... కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోందని.. కానీ, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తేల్చిందని అభిషేక్‌ మను సింఘ్వీ, వికాస్‌ సింగ్‌ పేర్కొన్నారు. సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో ఇప్పుడు చేస్తున్న ప్రతి ఆరోపణ.. గతంలో సీసీఐకి చేసిన ఫిర్యాదులో ఉన్నవేనని గుర్తు చేశారు. నాటి ఫిర్యాదును సీసీఐ క్షుణ్నంగా పరిశీలించి క్లీన్‌చిట్‌ ఇచ్చిందని వివరించారు.ఈ మేరకు సీసీఐ ఉత్తర్వులను వారు ధర్మాసనం ముందు ఉంచారు. అక్రమాలే లేవని తేలిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చేసిందని, రాజకీయ కక్ష సాధింపులకు ఈ కేసు ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసులో సాక్షులను సీఐడీ పలు రకాలుగా భయపెడుతోందన్నారు. కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇవ్వకుంటే నిందితులుగా చేర్చేందుకు కూడా వెనుకాడడం లేదని తెలిపారు. వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలు ఏమీ చూపడం లేదని నివేదించారు. పిటిషనర్లకు మద్యం వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, వారు కేవలం ప్రభుత్వ అధికారులుగా సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. ఇదే నేరం అంటూ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పారదర్శక విధానాన్ని పూర్తిగా మార్చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ, ఇదో భారీ కుంభకోణమన్నారు. గతంలో మద్యం కొనుగోళ్లు చాలా పారదర్శకంగా జరిగేవని, గత ప్రభుత్వ హయాంలో దానిని పూర్తిగా మార్చేశారన్నారు. కీలక స్థానాల్లో కావాల్సిన వ్యక్తులను నియమించుకున్నారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ దురుద్దేశాలను, ప్రాథమిక ఆధారాలను ఎలా సమతుల్యం చేస్తారని ప్రశ్నించింది. దీంతో ఇది విచారణకు స్వీకరించదగ్గ నేరమే కాదని వికాస్‌ సింగ్‌ సమాధానం ఇచ్చారు.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అలాగైతే ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేతకు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ పని కచి్చతంగా చేస్తామని వికాస్‌ తెలిపారు. సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... పిటిషనర్లు ప్రభుత్వాధికారులుగా పదవీ విరమణ చేశారని, వారు ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని అన్నారు. ఆ అవసరం కూడా వారికి లేదన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్‌ జప్తునకు ఆదేశాలు ఇవ్వొచ్చునన్నారు. అలాంటప్పుడు దేశం విడిచివెళ్లిపోతారన్న ఆందోళన అనవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఈసీఆర్‌ నమోదు చేసిందన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమంటూ పిటిషన్లు కొట్టేసింది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలుకు గోవిందప్పకు అనుమతి వికాట్‌ సంస్థ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ నేపథ్యంలో తాము దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ దవే సుప్రీంకోర్టుకు వివరించారు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌కు అనుమతి కోరగా.. ధర్మాసనం అనుమతిచ్చింది. బాలాజీ గోవిందప్ప రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం వెలువరించాలని కింది కోర్టు, హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సమయంలో దవే స్పందిస్తూ, ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే గోవిందప్పను అరెస్ట్‌ చేశారన్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదని, ఇలా అరెస్ట్‌ చేయడం తగదంటూ ఇదే కోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించాలంటూ సంబంధిత తీర్పు కాపీని ధర్మాసనం ముందు ఉంచారు. ఇప్పుడు ఈ అంశాలన్నీ అవసరం లేదని, తాము బాలాజీ గోవిందప్పకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేదని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు హెచ్చరికలు ఇవీ... రాష్ట్ర ప్రభుత్వానికి... ఏపీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేం. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలు ఉంటే, వాటికి న్యాయపరంగా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సీఐడీ అధికారులకు..పిటిషనర్లపై థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడానికి వీల్లేదు. ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదు. దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా కొనసాగించాలి.రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై... పిటిషనర్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకుంటే, కింది కోర్టులు కేసు పూర్వాపరాల ఆధారంగా విచారించి తగిన నిర్ణయం వెలువరించాలి. విచారణ సమయంలో న్యాయవాదులు ఉండాలనుకుంటే, ఆ అభ్యర్థనతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించాలి.

Pak PM Shahbaz Sharif Key Comments With India War2
భారత్‌తో మూడుసార్లు యుద్ధం.. పాక్‌ ప్రధాని కీలక ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్‌ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమపై భారత్‌ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్‌ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్‌ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్‌ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్‌ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్‌ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్‌ దార్‌ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్‌ చేశారు. కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్‌ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.

Rasi Phalalu: Daily Horoscope On 17-05-2025 In Telugu3
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.పంచమి రా.2.41 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పూర్వాషాఢ ప.3.09 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: రా.11.22 నుండి 1.00 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ఉ.10.04 నుండి 11.36 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.21.మేషం: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.వృషభం: బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.మిథునం: మిత్రుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పురోగతి.కర్కాటకం: ఆస్తులు కొనుగోలు చేస్తారు. యుక్తితో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.సింహం: సోదరుల నుండి ఒత్తిడులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కన్య: సన్నిహితులతో మాటపట్టింపులు. శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ధనుస్సు: సన్నిహితుల నుండి సాయం అందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్నివ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.మకరం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.మీనం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.

US tax on outward remittances to pinch Indians sending money home4
ట్రంప్‌ మరో పిడుగు

మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్‌లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్‌ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు తమ మాతృదేశాలకు పంపే మొత్తాల ()లపై 5 శాతం పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుదారులతో పాటు హెచ్‌–1బీ, ఎఫ్‌–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్‌ దీనికి ‘వన్‌ బిగ్, బ్యూటిఫుల్‌ బిల్‌’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్‌లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. మనోళ్లకు పెద్ద దెబ్బ అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్‌కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్‌లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్‌ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు. రెమిటెన్స్‌ పన్ను దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్‌ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్‌పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.జీవనాధారంపై దెబ్బ రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్‌ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్‌ ఎస్టేట్, బ్యాంకింగ్‌ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.రెమిటెన్సుల్లో భారతే టాప్‌ → ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్‌కే. → 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్‌ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు. → అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్‌ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే. → ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది! అక్రమ పన్నే! రెమిటెన్స్‌ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్‌ సభ్యులు కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

IPL 2025 to resume on May 175
IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్‌ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్‌ కౌన్సిల్‌ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతుంది. లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్‌ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు (క్వాలిఫయర్‌–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2, ఫైనల్‌) కలిపి మొత్తం ఈ సీజన్‌లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్‌ 3న ఫైనల్‌ జరుగుతుంది. ముస్తఫిజుర్, డుప్లెసిస్‌ రెడీ... ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్‌ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్‌ డుప్లెసిస్‌ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్‌ మిగిలిన లీగ్‌ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం వెళ్లిపోతాడు.ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్‌ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్‌ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్‌ డేవిడ్‌లతో ఆర్‌సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్‌ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్‌ విషయంలో పంజాబ్‌ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్‌ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్‌ కమిన్స్‌ మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం! గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ... సీజన్‌లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్‌ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్‌ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్‌ చాన్స్‌ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్‌ నిలుస్తుంది.

Miss World Contestants Visit Mahabubanagar Pillalamarri Tree6
ఏంట్రీ.. 700 ఏళ్లా..?

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, హైదరాబాద్‌/శంకర్‌పల్లి: రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీదారులు శుక్రవారం పలు పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలను సందర్శించి సందడి చేశారు. పోటీదారుల్లోని ఒక బృందం శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రఖ్యాత పిల్లల మర్రిని సందర్శించింది. మరికొందరు హైదరాబాద్‌ శివార్లలోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌తోపాటు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల మర్రికి ఫిదా: పాలమూరులోని ప్రఖ్యాత పిల్లలమర్రి వృక్షాన్ని చూసి మిస్‌ వరల్డ్‌ పోటీదారులు ఫిదా అ య్యారు. మహా వృక్ష చరిత్ర, పునరుజ్జీవం గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోటీదారుల్లో గ్రూప్‌–2లో ని 23 మంది శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చారిత్రక పిల్లలమర్రి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. వీరికి బంజారాల నృత్యాలు, డోలు వాయిద్యాల మధ్య కలెక్టర్‌ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘన స్వా గతం పలికారు. ఈ సందర్భంగా నమస్కారం తెలంగాణ, తెలంగాణ.. జరూర్‌ ఆనా అంటూ సుందరీమణులు నినాదా లు చేశారు. ముందుగా 16వ శతాబ్దానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం పురావస్తు ప్రదర్శనశాలకు చేరుకుని చారిత్రక శిల్పాలు, పురాతన కళాఖండాలను తిలకించారు.ప్రత్యేక గైడ్‌ శివనాగిరెడ్డి వాటి విశిష్టతను వివరించారు. ఆ తర్వాత పిల్లల మర్రి మహావృక్షాన్ని సందర్శించారు. దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తరించిన 700 సంవత్సరాల వయసు కలిగిన మహావృక్షం మానులు, ప్రకృతి అందాలను చూసి మైమరచిపోయారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బోనాలు, బతుకమ్మ ఆటపాటలు విదేశీ వనితలను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీదారులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ముచ్చటించారు. పోటీదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు చేనేత కారి్మకులు తయారు చేసిన చేనేత పట్టు వ్రస్తాలు అందజేశారు. మనసు దోచుకున్న ఎక్స్‌పీరియం.. హైదరాబాద్‌ శివారులోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌ను మిస్‌ వరల్డ్‌ పోటీదారులు సందర్శించి సందడి చేశారు. మిస్‌ వరల్డ్‌ –2024 విజేత క్రిస్టినా పిషో్కవాతోపాటు అమెరికా ఖండ ఓషియానా విభాగంలోని దేశాలకు చెందిన 23 మంది ఇందులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా పోటీదారులు ఉత్సాహంగా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో గ్రీన్‌ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక జీవవైవిధ్యం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి అధికారులు వారికి వివరించారు. చిన్నారులతో కలిసి పోటీదారులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మిస్‌ కెనడా ఎమ్మా మోరిసన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది. నా తల్లిదండ్రులను త్వరలో హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ అందాలను చూపిస్తా’అని తెలిపారు. మిస్‌ యూఎస్‌ అథెనా క్రాస్బీ.. ‘భూమిని రక్షించడం మన బాధ్యత. ఎక్స్‌పీరియం, సృజనాత్మక డిజైన్‌తో ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించవచ్చో చూపిస్తుంది’అని పేర్కొన్నారు. ‘మా దేశంలో కూడా ఇలాంటి పర్యావరణ అద్భుతాలను సృష్టించాలని ఉంది’అని మిస్‌ బ్రెజిల్‌ జెస్సికా పెడ్రోసో తెలిపారు. కుటుంబ ఆరోగ్యం మహిళ చేతిలోనే.. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా, ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా, వృత్తి నిపుణురాలిగా, నాయకురాలిగా మహిళలు ప్రపంచంలో అనేక పాత్రలు పోషిస్తున్నారని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా అన్నారు. శుక్రవారం మిస్‌ వరల్డ్‌ పోటీదారులు ఏఐజీ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఫలితంగా కుటుంబం, సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గొప్ప వైద్యులు, శాస్త్రవేత్తలు గుండె, మెదడు, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలపై మాత్రమే దృష్టి సారించేవారని.. ఇప్పుడు ఆ కోణం మారిందని అన్నారు.

 Farmers Protest At Grain purchasing Center: Telangana7
సారీ.. నో లారీ!

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: ఓవైపు నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్‌లో వచ్చిన అధిక దిగుబడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. నెల రోజులుగా కొనుగోళ్లు సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా జిల్లా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. 10 నుంచి 20 రోజుల పాటు ఎదురు చూసినా వడ్ల బస్తాలను కాంటా వేయడం లేదని రైతులు వాపోతున్నారు.కొన్న ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, రైతులు సొంతంగా ట్రాక్టర్‌లో తీసుకెళ్తామంటే హమాలీలు లేరని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ధాన్యం రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మరిపెడ మండలంలోని ఓ రైతు 600 బస్తాలకు కాంటా వేయించిన తర్వాత లారీలు లేవనే సాకుతో కేంద్రంలోనే వదిలేశారు. ఇప్పటికే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచగా.. మరోవైపు ముంచుకొస్తున్న వానాకాలం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సుమారు 10 ఎల్‌ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 51.39 ఎల్‌ఎంటీల కొనుగోలు రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్‌లో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపుగా 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో 70.13 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాగా శుక్రవారం వరకు తెరిచిన రాష్ట్రంలోని 8,353 కొనుగోలు కేంద్రాలకు 55.73 ఎల్‌ఎంటీలధాన్యం వచ్చిందని, 51.39 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని సేకరించామని, 49.87 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆలస్యంగా వరి సాగు చేసిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ మొదలైన జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కోతలు పూర్తి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల్ని చూస్తే అర్ధమవుతుంది. ఎందుకు ఆలస్యం? కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నా వడ్ల బస్తాలకు నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ఎందుకంటే.. లారీలు లేవు, హమాలీల కొరత ఉందని నిర్వాహకులు చెపుతున్నారు. లారీలు లేకపోతే ట్రాక్టర్‌తో రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్తామన్నా కూడా హమాలీల కొరత పేరు చెపుతూ కాంటా వేయడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని అనేక మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా సుమారు 20 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.వాస్తవానికి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే లారీల సరఫరా కాంట్రాక్టును జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసి, ప్రణాళికాబద్ధంగా కేంద్రాల నుంచి మిల్లులకు వడ్ల బస్తాలను తరలించాల్సి ఉంది. కానీ ఈసారి ప్రణాళిక తప్పిందని అధికారులే అంగీకరిస్తున్నారు. హమాలీల విషయంలోనూ ఇదే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం రావొచ్చనే అంచనాను బట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్‌ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి లారీలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండటాన్ని బట్టి చూస్తే లారీల కొరత ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇక హమాలీలు ఎక్కువ కూలీ లభించే మక్కజొన్న, ఇతర పంటల కొనుగోళ్ల వద్దకు వెళ్లడం, ఉపాధి హామీ పనులకు వెళుతుండడం వల్ల ధాన్యం కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది. కాంటా వేసిన తర్వాత రైతు బాధ్యత ఎలా? ⇒ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కాంటా వేసేంత వరకే రైతు బాధ్యత. కాంటా వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. కానీ మిల్లరు ధాన్యం బస్తాలను దించుకునేంత వరకు రైతుదే బాధ్యత అన్నట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.భయపెడుతున్న ముందస్తు రుతు పవనాలు ⇒ గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఎన్నో రెట్లు ఎక్కువని ప్రభుత్వం చెపుతోంది. అదే సమయంలో ఈసారి గతంలో కన్నా కొంత ముందుగా నాట్లు వేయడం, సన్న రకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కోతలు ముందే వచ్చాయి. రైతుల అదృష్టం కొద్దీ ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ముందుగానే ప్రారంభం కావడంతో ఇప్పటివరకు 51.39 ఎల్‌ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 4.34 ఎల్‌ఎంటీల ధాన్యం కాంటా వేయకుండా ఉందని పౌరసరఫరాల శాఖే చెబుతోంది. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ఇంకా సుమారు లక్షన్నర మెట్రిక్‌ టన్నుల ధాన్యం తరలించ లేదని స్పష్టం చేస్తోంది.అయితే మొత్తంగా సుమారు 10 ఎల్‌ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని అంచనా. కాగా అకాల వర్షాలు రైతులను ప్రతిరోజూ భయపెడుతున్నాయి. భారీ వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తడిచిన ధాన్యం ఆరితే కానీ రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. తాజాగా.. రుతు పవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే వార్తలతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. లారీలు, హమాలీలను అందుబాటు ఉంచడం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దొడ్డు ధాన్యమే ఎక్కువ..సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో 6,58,486 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 51.39 ఎల్‌ఎంటీల ధాన్యంలో దొడ్డు రకం 34.02 ఎల్‌ఎంటీలు కాగా, సన్నాలు 17.37 ఎల్‌ఎంటీలు ఉన్నాయి. సన్నాలు 30 ఎల్‌ఎంటీల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట , వనపర్తి మొదలైన జిల్లాల్లో పండించిన మేలు రకం సన్న ధాన్యాన్ని రైతులు అధిక ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నాలు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తప్ప రేషన్‌ దుకాణాలకు ఇవ్వాల్సిన సన్న బియ్యానికి సరిపోవని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు.. యాసంగిలో ధాన్యం సేకరణ అంచనా : 70.13 ఎల్‌ఎంటీ ఇప్పటివరకు సేకరించిన ధాన్యం : 51.39 ఎల్‌ఎంటీ ఇందులో దొడ్డు రకం (5,44,543 రైతులు) : 34.02 ఎల్‌ఎంటీ సన్న రకం (2,25,215 రైతులు) : 17.37 ఎల్‌ఎంటీ కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.11,913.05 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం : రూ.8,511.42 కోట్లు సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్‌ : రూ.868.61 కోట్లు వర్షం వస్తే ఎట్లా..? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే లారీలు, హమాలీల కొరత, స్థానిక మిల్లుల ట్యాగింగ్‌లో జాప్యంతో పలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్‌కు చెందిన గంగవ్వ నాలుగెకరాల్లో పండిన ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులవుతున్నా వడ్లు కాంటా కాలేదు. వర్షాల భయంతో ధాన్యంపై కవర్లు కప్పి పడిగాపులు పడుతోంది. జైపూర్‌ మండలం పౌనూరుకు చెందిన జాడి బాపు నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదు. దీంతో వర్షం వస్తే నష్టపోతానని ఆందోళన చెందుతున్నాడు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతో 2 నుంచి 5 కిలోలకు పైగా కోత పెడుతున్నారని చెన్నూరు మండలం కిష్టంపేట, ఎల్లక్కపేట తదితర చోట్ల రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసినా.. లారీలు లేక..మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినా, లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు. అకాల వర్షాలకు దాదాపు 800 బస్తాల ధాన్యం తడిసింది. దీంతో సంచుల్లోంచి మొలకలు ఇలా బయటకు వచ్చాయి. 20 రోజులైనా కాంటా కాలేదు.. నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెబుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంటా పెడతారా అని ఎదురుచూస్తున్నా. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలి. – కొల్లి తిప్పారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Naga Chaitanya is playing the role of treasure hunter in NC248
నిధి అన్వేషణలో అర్జున్‌ 

‘తండేల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్‌సీ 24’ (వర్కింగ్‌ టైటిల్‌). కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్‌ డైరెక్టర్‌ నాగేంద్ర వేసిన గుహ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో అర్జున్‌ అనే ట్రెజర్‌ హంటర్‌గా కనిపిస్తాను. నాగేంద్రగారు గుహని అద్భుతంగా తీర్చిదిద్దారు’’ అని తెలిపారు. ‘‘ఈ గుహలో తీస్తున్న సీన్స్‌ సినిమాలో 20 నిమిషాలకు పైగా ఉంటాయి’’ అన్నారు కార్తీక్‌ వర్మ. ‘‘ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ‘‘ప్రేక్షకులకు ఒరిజినల్‌ సినిమాటిక్‌ అనుభూతినిచ్చేందుకు గుహ సెట్‌ వేసి, సీన్స్‌ తీస్తున్నాం’’ అని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ చెప్పారు. ‘‘ప్రేక్షకులకు సెట్‌ అనే భావన కలగకుండా50 రోజులు కష్టపడి ఈ సెట్‌ని సహజంగా తీర్చిదిద్దాం’’ అని నాగేంద్ర పేర్కొన్నారు. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ పాల్గొన్నారు.

Another Case Filed On Vallabhaneni Vamshi: Andhra pradesh9
బెయిల్‌..రిమాండ్‌..ఆపై మరో కేసు

విజయవాడలీగల్‌ /నూజివీడు/గన్నవరం : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం ఆయనపై ఇప్పటికే పదికిపైగా తప్పుడు కేసులు నమోదు చేసింది. వీటిల్లో కొన్ని కేసుల్లో బెయిల్‌ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి ఎక్కడ బయటికి వచ్చేస్తారోననే అక్కసుతో మరిన్ని కేసులను తెరమీదకు తీసుకువస్తూ వేధిస్తోంది. అయినా న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాటం సాగిస్తోన్న వంశీమోహన్‌ ఒక్కో సమస్య సాలెగూడును ఛేదించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం అటు విజయవాడ, ఇటు నూజివీడు కోర్టుల్లో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు గుట్టుచప్పుడు కాకుండా నమోదైన కేసే ఇందుకు అద్దం పడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడికేసులో బెయిల్‌ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఎ71గా ఉన్న మాజీ శాసనసభ్యులు వల్లభ­నేని వంశీమోహన్‌కు 12వ అదనపు జిల్లా న్యాయస్థా­నం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో విజయ­వాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా వున్న వంశీ త­రపున దేవి సత్యశ్రీ,, ప్రాసిక్యూషన్‌ తరపున స్పె­ష­ల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కళ్యాణి వాదనలు వినిపించా­­­రు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ష­ర­­­­­తులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఇదే కే­సు­లో ఎ81గా ఉన్న లక్ష్మీపతికీ బెయిల్‌ మంజూరైంది. రెండువారాల రిమాండ్‌ వల్లభనేని వంశీకి నూజివీడులోని రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు శుక్రవారం 14 రోజుల రిమాండ్‌ విధించింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారని నమోదైన కేసుపై హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు వంశీతో పాటు ఇదే కేసులో ఉన్న ఓలుపల్లి మోహన రంగారావులను నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికీ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.శ్రావణి రిమాండ్‌ విధించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఏ10 కాగా, ఓలుపల్లి మోహన రంగారావు ఏ7గా ఉన్నారు. అనంతరం వంశీని పోలీసులు విజయవాడలోని జిల్లా సబ్‌జైలుకు తరలించారు. వంశీ న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ వేయగా, దానిపై విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. తాజాగా మరో కేసు..ఆపై గోప్యత తాజాగా గ్రావెల్‌ తవ్వకాల్లో అక్రమాలకు పాల్ప­డ్డారంటూ మైనింగ్‌ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై వల్లభనేని వంశీమోహన్‌తో పాటు ఇంకొంత మందిపై గన్నవరం పోలీసులు గురువారం మరొక అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తుండడం గమనార్హం. వివరాలిలా వున్నాయి. గత ప్రభు­త్వ హయాంలో జరిగిన గ్రావెల్‌ తవ్వకాలపై మూ­డు నెలలు క్రితం సమర్పించిన నివేదిక ఆధా­రంగా ఆ శాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇందులో ప్రధాన నిందితులుగా వల్లభనేని వంశీమోహన్‌ను చేర్చారు.ఆయనతోపాటు ఓలుపల్లి మోహన్‌రంగా, పడమట సురేశ్, కైలే శివకుమార్‌తో పాటు మరో 10 మందిపై పోలీసులు నాన్‌­బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ ఆరోపణలు, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్‌ రావ­డంతో వంశీ మోహన్‌ బయటకు వస్తారనే సమయంలో తాజాగా మైనింగ్‌ కేసును బనాయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది.

Miss World South Sudan Calls For An End To Forced Child Marriage10
స్వేచ్ఛగా ..    రెక్కలు విప్పేలా...

అమ్మాయిలకు చదువు కాదుకదా.. కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించే వెసులుబాటు కూడా లేని చోట అందాల పోటీలంటే ఆనందంగా సాగనంపుతారా? పంపరు! అయోమ్‌ టీటో మతీజ్‌కు కూడా తీవ్ర నిరసన ఎదురైంది! అయినా వెనకడుగు వేయకుండా అందాల పోటీలకు అటెండ్‌ అయింది.. మిస్‌ సౌత్‌ సుడాన్‌గా కిరీటం ధరించి మిస్‌ వరల్డ్‌కి పోటీపడ్డానికి హైదరాబాద్‌ చేరుకుంది. తన దేశ పరిస్థితులు, వ్యక్తిగత వివరాలు, తన లక్ష్యం వగైరా ఆమె మాటల్లోనే...‘‘లా చదివాను. లీగల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. సౌత్‌ సుడాన్‌లో పుట్టాను. కానీ అక్కడి రాజకీయ అనిశ్చితి వల్ల మా అమ్మ మమ్మల్ని తీసుకుని కెనడాకు వలస వచ్చేసింది. అందుకే నేను అక్కడే పెరిగాను. మా నాన్న, ఆయన తరపు, అమ్మ తరపు బంధువులంతా సౌత్‌ సుడాన్‌లోనే ఉండిపోయారు. మా అమ్మ కెనడాలో టీచర్‌గా ట్రైన్‌ అయ్యి, మా సొంత దేశంలోని పిల్లలకు మంచి స్కూల్‌ను ఏర్పాటు చేయడానికి తిరిగి సుడాన్‌ వచ్చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2019లో నేను మా కుటుంబాన్ని చూడ్డానికి నా సొంత దేశానికి వెళ్లాను. ఎమోషనలే కాదు.. కొంచెం షాక్‌ కూడా అయ్యాను. కెనడాలో నేను ఆస్వాదించిన జీవితం, సౌత్‌ సుడాన్‌లో మా వాళ్లంతా అనుభవిస్తున్న జీవితాన్ని బేరీజు వేసుకుని. అప్పుడే డిసైడ్‌ చేసుకున్నాను నా దేశ ప్రజలకూ ఉన్నత ప్రమాణాల జీవితం అందేలా కృషి చేయాలని! కోవిడ్‌ తర్వాత వచ్చేశాను. సర్వీస్‌ మొదలుపెట్టాను. నా బ్యూటీ విత్‌ పర్పస్‌ అదే!అందాల పోటీలకు వ్యతిరేకంఅందాల పోటీల పట్ల సౌత్‌ సుడాన్‌లో చాలా వ్యతిరేకత ఉంది. నేను మిస్‌ సౌత్‌ సుడాన్‌ పాజెంట్‌లో పాల్గొంటున్నప్పుడు, ఇప్పుడు కూడా నిరసన ఎదురైంది. కానీ నా దృష్టిలో ఈ పోటీలు స్కిన్‌ షో కాదు. వైవిధ్యమైన సంస్కృతులు, భాషలు, జీవనశైలులను పరిశీలించే, అధ్యయనం చేసే అవకాశాన్నిచ్చే వేదిక. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సర్దుబాటు, సహనాన్ని నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా నా సామాజిక బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించేందుకు తోడ్పడతాయి. అందుకే నిరసనను ఎదుర్కొని మరీ ఈ పోటీకి వచ్చాను. అంతేకాదు ఈ పోటీలు ఒకరినొకరు తెలుసుకుని, అర్థం చేసుకుని, ఒకరికొకరు సాయం అందించుకునే స్ఫూర్తినీ పంచుతాయి. మహిళలకు అలాంటి స్ఫూర్తి, ప్రేరణ అవసరం. దానికి అందాల పోటీలే కావాలా అంటారేమో! స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయి.. అది స్త్రీల సహజ లక్షణమనే అభిప్రాయమూ అంతే లోతుగా నాటుకుపోయింది. దాన్ని అబద్ధమని నిరూపిస్తున్నాయి ఈ పోటీలు! కొన్ని దేశాల పేర్లే తెలియవు నేనీ కంటెస్ట్‌కి వచ్చేదాకా! అందుకే పట్టుబట్టి మరీ ఈ పోటీకి వచ్చాను. ఇక్కడి వైవిధ్యత, ఆధ్యాత్మికత నన్ను చాలా ఇన్‌స్పైర్‌ చేశాయి. ఈ దేశంలోని వాళ్లను చూస్తే నాకు ఫారినర్స్‌గా అనిపించరు. మా వాళ్లలాగే అనిపిస్తారు. ఎప్పుడో ఎక్కడో తప్పిపోయి.. ఇప్పుడు కలుసుకుంటున్నామేమో అనిపిస్తోంది! తెలంగాణ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడి ఎడ్యుకేషన్, మెడికల్‌ కేర్‌ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచ ప్రమాణాలతో పోటీపడుతున్నాయి. సౌత్‌ సుడాన్‌ యువత తమ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కే వస్తోంది. మా దేశంలోని చాలామంది ప్రజలు ఆరోగ్య అవసరాల కోసం ఇక్కడి హాస్పిటల్స్‌నే ఆశ్రయిస్తున్నారు.బాల్య వివాహాలు.. బలవంతపు పెళ్లిళ్లుప్రపంచంలోని అనేక దేశాల్లాగే సౌత్‌ సుడాన్‌లోనూ పురుషాధిపత్యమే! కొడుకుకేప్రాధాన్యం. అమ్మాయికి వ్యక్తిగత శుభ్రత విషయంలోనూ ఆర్థికపరమైన వెసులుబాటు ఉండదు. బాల్యవివాహాలు, బలంతపు పెళ్లిళ్లు కామన్‌. ఇక చదువుకునే అవకాశమెక్కడిది? నేను ఇక్కడిదాకా రాగలిగాను అంటే మా అమ్మే కారణం. మమ్మల్ని ఆమె కెనడా గనుక తీసుకువెళ్లకపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో (ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు). నాకింకా గుర్తు.. ఆమె లగేజ్‌ సర్దుతుంటే ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’ అని అడిగాను. ‘మీరు స్వేచ్ఛగా మీకు నచ్చింది చదువుకునే చాన్స్‌ ఉన్నచోటికి’ అని చెప్పింది! మేం నలుగురు అక్కచెల్లెళ్లం. మాకొక తమ్ముడు. అందరినీ సింగిల్‌ పేరెంట్‌గానే పెంచింది అమ్మ. ఎలాంటి అవకాశాల కోసం అమ్మ మమ్మల్ని కెనడాకు తీసుకెళ్లిందో అలాంటి అవకాశాలనే సౌత్‌ సుడాన్‌లోని అమ్మాయిలకూ కల్పిస్తోంది తాను నడిపిస్తున్న స్కూల్‌ ద్వారా! ఆమె చేస్తున్న ఆ సర్వీస్‌కి నేనూ శాయశక్తుల సాయపడుతున్నాను. మా దేశంలోని యంగ్‌ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్ల కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్లకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. సాధికారతకు, సామాజిక బాధ్యతకు ఐకాన్స్‌గా ఉండి, తర్వాత తరాలను ఇన్‌స్పైర్‌ చేసేలా వాళ్లను తీర్చిదిద్దాలి. ఇదంత సులువైన జర్నీ కాదు. అయినా ప్రయత్నం వీడను!’’ అంటూ తన జర్నీ గురించి చెప్పారు మిస్‌ సౌత్‌ సూడాన్‌.మా దేశంలోని యంగ్‌ గర్ల్స్‌కి నేను మెంటర్‌గా ఉండాలి! వాళ్లు కలలను సాకారం చేసుకునేలా నేను తోడ్పడాలి. వాళ్ళకు రెక్కలున్నాయనే విషయాన్ని గ్రహించేలా చేయాలి. – సరస్వతి రమఫొటో: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement