Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Papireddy Palli: YS Jagan Sri Sathya Sai District Tour Updates1
నేడు పాపిరెడ్డిపల్లికి వైఎస్‌ జగన్‌

శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరి స్తున్న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు.దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ సోమవారం పరిశీలించారు.

Telangana High Court Verdict In Dilsukhnagar Blasts Case Updates2
12 ఏళ్ల గాయం.. ఇవాళే తుది తీర్పు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్‌ అక్తర్, ఎజాజ్‌ షేక్, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

China React On Trump Tariffs 50 Percent Tariff Threats3
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్‌ టారిఫ్‌ డెడ్‌లైన్‌పై చైనా

వాషింగ్టన్‌: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన డెడ్‌ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ‌ చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్‌ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్‌ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్‌ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్‌ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్‌ టారిఫ్‌ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్‌ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

Pawan Kalyan Son Injured In Singapore4
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సింగపూర్‌ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్‌ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ ఉన్నారు. ఫోన్‌ కాల్‌ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్‌ వెళ్లనున్నారు.

Meerut Case Accused Found Pregnant During Health Check Up: Official5
మీరట్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి మరో కీలక విషయం

మీరట్‌: మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్‌, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్‌ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్‌ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్‌(25)తో ముస్కాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్‌ చేసింది.

WB job Scam: Cancer Survivor Soma Das Gets Mercy Of Apex Court6
ఎవరీ సోమాదాస్‌..? కోర్టులు ఆమె పోరాటాన్ని గౌరవించి మరీ..!

‘నేను బాగుంటే చాలు’ అనుకునే ఈ రోజుల్లో నలుగురి కోసం పోరాటానికి దిగడం మామూలు విషయం కాదు.పశ్చిమ బెంగాల్‌ టీచర్ల నియామకంలో అవక తవకలున్నాయని 25,752 ఉద్యోగాలని తొలగించింది సుప్రీంకోర్టు – ఒక్క ఉద్యోగం తప్ప. ఆ ఉద్యోగం సోమా దాస్‌ది. ఈ బెంగాలీ టీచర్‌ తనకు ఉద్యోగం రానందుకు పోరాడింది. ఉద్యోగం రాని వాళ్ల కోసం పోరాడింది. ఈలోపు కేన్సర్‌ వస్తే దానిపై పోరాడింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాటాన్ని గౌరవించి ఉద్యోగాన్ని నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఈ తీర్పు వల్ల కూడా ఎందరో రోడ్డున పడతారని పోరాటానికి సిద్ధమైంది సోమాదాస్‌. ఇలా ఎవరున్నారని?‘మళ్లీ కొత్త ఓరాటం చేయాలేమో’ అంది సోమా దాస్‌.మొన్నటి ఏప్రిల్‌ 3వ తేదీకి ముందు, తర్వాత ఆమె జీవితం ఒకేలా ఉంది. ఎందుకంటే ఆమె ఉద్యోగం పోలేదు. కాని ఆమెతోపాటు ఉద్యోగంలో చేరిన వారంతా సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తు తెలియని స్థితిలో పడ్డారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇలా వెలువడటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. నియామకాల్లో ప్రతిభ చూపి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినవారు ఉన్నారు. వారి లిస్ట్‌ ప్రభుత్వం దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకు ఆ లిస్టు ఇచ్చి వారి ఉద్యోగాలను కాపాడాల్సింది’ అందామె. ఈ గొడవ 2016 నుంచి మొదలైంది. వెస్ట్‌ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (డబ్యు.బి.ఎస్‌.ఎస్‌.సి.) 2016లో భారీగా పరీక్షలు నిర్వహించి స్కూల్, కాలేజీ స్థాయిలో చేసిన టీచింగ్, నాన్‌ టీచింగ్‌ నియామకాలు చేసింది. 25,725 మంది ఉద్యోగులు చేరారు. అయితే ఆనాటి నుంచి గొడవలు మొదలయ్యాయి. దొడ్డిదారిన చాలామంది ఉద్యోగాల్లో చేరారంటూ అర్హులైనవారు రోడ్డెక్కారు. నిరసనలు చేశారు. వారిలో సోమాదాస్‌ ముందు వరుసలో ఉంది. ‘నా పేరు మెరిట్‌ లిస్ట్‌లో ఉంది. కాని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నా బదులు ఎవరో దొంగ పద్ధతిలో చేరారు’ అని ఆమె కోల్‌కతా హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు నడుస్తుండగానే విపరీతంగా నిరసన ప్రదర్శనల్లో ముందు వరుసలో కనిపించింది. రోజుల తరబడి నిరాహార దీక్షల్లో కూచోవడం వల్ల ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో ఆమెకు కేన్సర్‌ వచ్చింది. అయినా సరే కేన్సర్‌తో పోరాడుతూనే తన కోసం, సాటి వారి కోసం పోరాటం చేసింది. ఇది కోల్‌కతా హైకోర్టు జడ్జి అభిజిత్‌ గంగోపాధ్యాయ్‌ దృష్టికి వచ్చి ఆయన ఆమెను కోర్టుకు పిలిపించారు. ‘ఇంకొక ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వానికి చెబుతాను. చేస్తావా?’ అని అడిగారు. ‘టీచర్‌ కావడం నా జీవిత లక్ష్యం’ అని కరాఖండీగా చెప్పింది సోమాదాస్‌. దాంతో 2022లో ఆమెకు బెంగాలి భాషను బోధించే టీచరుగా ఉద్యోగం వేయించారు జడ్జి. కాని అదే జడ్జి 2024, ఏప్రిల్‌ 12న మొత్తం నియామకాలు చెల్లవు అని తీర్పు చెప్పారు. కాని ఒక్క సోమాదాస్‌ ఉద్యోగం మాత్రం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు వెళితే న్యాయమూర్తులు దేబాంశు, మహమ్మద్‌ షబ్బార్‌ కూడా ‘నియామకాలు చెల్లవు. సోమాదాస్‌ ఉద్యోగం ఉంటుంది’ అని తీర్పు చెప్పారు. కేసు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయమూర్తులు సంజీవ్‌ఖన్నా, సంజయ్‌ కుమార్‌లు తీర్పు చెప్తూ ‘ఉద్యోగాలు చెల్లవు. కాని సోమాదాస్‌ ఉద్యోగం కొనసాగుతుంది’ అన్నారు.ఇంతమంది న్యాయమూర్తులు సోమాదాస్‌కు వెన్నంటి నిలిచి ఆమె ఉద్యోగం కాపాడటం చాలా అరుదు. దానికి కారణం సోమాదాస్‌ నిరుపేద కుటుంబం నుంచి రావడం, న్యాయం కోసం వెరవక పోరాడటం, ఆమె అర్హతలన్నీ సరిగ్గా ఉండటం, కేన్సర్‌ వచ్చినా దానిపై పోరాడుతూ ఉద్యోగం కోసం పోరాటాన్ని కొనసాగించడం.దీనిని బట్టి పోరాటం చేసే వారికి... న్యాయం కోసం ఎలుగెత్తే వారికి గౌరవం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ పని చేయడానికి చాలామంది వెరుస్తూ ఉంటారు. ‘నా ఉద్యోగం ఉందని సంతోషంగా ఏమీ లేను. ఇన్నాళ్లలో ఎంతోమంది ఈ ఉద్యోగాల వల్ల స్థిరపడ్డారు. ఇప్పుడు వారి ఉద్యోగాలు పోతే కుటుంబాలను ఎలా నడుపుతారు. వారి న్యాయం కోసం ఏదైనా చేయాలి’ అంది సోమా దాస్‌. నిజమే. దాదాపు ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలంటే దొడ్డిదారిన చేరిన వాళ్ల కంటే నిజమైన అర్హతలతో చేరినవారు కుదేలవుతారు. ‘త్వరలో ఏదో ఒక దారి దొరుకుతుంది. మేం పోరాడతాం’ అంటోంది సోమాదాస్‌.కొందరు అలా ఉంటారు మరి.

Vijay Mallya claims Indian banks recovered Rs 14131.6 crore 7
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’

న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులు తన ఆస్తులను అటాచ్‌ చేయడం ద్వారా తాను కట్టాల్సిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నాయని పరారీలో ఉన్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ చీఫ్‌ విజయ్‌ మాల్యా వ్యాఖ్యానించారు. ఇందుకు 2024–25 ఆర్థిక శాఖ వార్షిక నివేదికలోని గణాంకాలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో నేను రూ.6వేల కోట్లు బకాయి పడితే, భారతీయ బ్యాంకులు నా నుంచి రూ.14వేల కోట్లు వసూలు చేశాయి. ఇది నేను చెల్లించాల్సిన మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ’ అని విజయ్ మాల్యా అన్నారు. Finally against a DRT judgement debt of Rs 6203 crores, admitted recovery of Rs 14,131.8 crores which will be evidence in my UK Bankruptcy annulment application. Wonder what Banks will say in an English Court. pic.twitter.com/oRSMhm4nx2— Vijay Mallya (@TheVijayMallya) April 6, 2025ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రాబట్టిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ, మాల్యా కేసులో రూ. 14,131.8 కోట్లు రికవర్‌ అయ్యిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ నివేదికలో పేర్కొన్నట్లు మాల్యా వివరించారు. డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఆదేశించిన రూ. 6,203 కోట్ల రికవరీకి ఇది రెట్టింపు మొత్తం అని ఆయన చెప్పారు. తనను భారత్‌కు అప్పగించాలంటూ బ్రిటన్‌ కోర్టులో నడుస్తున్న కేసులో ఇది కీలక సాక్ష్యంగా ఉండబోతోందన్నారు.బ్యాంకులు దీన్ని ఏ విధంగా కోర్టులో సమర్థించుకుంటాయో చూడాలని వ్యాఖ్యానించారు. వివిధ బ్యాంకులకు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ. 9,000 కోట్లు బాకీపడిన కేసుకు సంబంధించి 2016 మార్చిలో మాల్యా బ్రిటన్‌కు పారిపోయారు. దీంతో మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణిస్తున్నారు. ఆయన్ను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Healthcare Services Halted in Network Hospitals Across Andhra Pradesh8
‘ఆరోగ్యశ్రీ’ ఆగిపోయింది!

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదమామిడిపల్లికి చెందిన పార్వతి భర్త సుబ్రహ్మణ్యానికి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆపరేషన్‌ అవసరమని వైద్యులు చెప్పడంతో పార్వతి తన భర్త సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని ఎంతో కష్టం మీద రూ.7 వేలకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు చూపి, తన భర్త ఆపరేషన్‌ విషయం తెలిపింది.ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడంలేదని, డబ్బులిస్తేనే చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలీక భర్తను తీసుకుని పార్వతి తిరిగి ఇంటికి బయల్దే రింది. తన భర్తకు ఆపరేషన్‌ చేయిద్దామని ఎంతో ఆశగా వచ్చానని, ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరైంది. రూ.వేలు, రూ.లక్షలు పెట్టి ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత తమకులేదని ఆవేదన చెందింది. సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యశ్రీ లేదు. ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించలేదు.. ఉచితంగా చికిత్సలు చేయలేం వెళ్లిపోండి..’ అన్న మాటలు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల దగ్గర సోమ­వారం వినిపించాయి. ఎంతో ఆశతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ శాపనార్థా­లు పెట్టారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బిల్లులు సుదీర్ఘ కాలంగా చెల్లించకపోవడం, బిల్లుల కోసం ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవ­డంతో సోమవారం నుంచి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెబాట పట్టాయి.‘బకాయిలు చెల్లించా­లని వైద్యశాఖ అధి­కా­రుల ను­ంచి సీఎం వరకూ అందరినీ కలి­సి పలు దఫాలుగా కోరాం.. ఇబ్బందులను వివరించాం. ప్రతినెలా రూ.330 కోట్ల మేర వైద్యసేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అందిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం నుంచి చెల్లింపులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. ఇప్పుడు బ్యాంకులు కూడా మాకు అప్పులు మంజూరు చేయడంలేదు. ఈ పరి­స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. గత్యంతరంలేని పరిస్థి­తుల్లో సేవ­లు నిలిపేస్తున్నాం. అర్థం చేసుకోండి’.. అంటూ నెట్‌­వర్క్‌ ఆస్పత్రుల వద్ద యాజమాన్యాలు పోస్టర్లు అతికించాయి.ఎన్ని రకాలుగా అడిగినా పట్టించుకోని సర్కారు..సోమవారం ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధి­­దా­­­రులను పథకం కింద యాజమాన్యాలు చేర్చుకోలేదు. నగదు రహిత సేవలు పూర్తిగా ఆపేశామని.. డబ్బులు కట్టి వైద్యసేవలు పొందాలని సూచించారు. దీంతో పేదరోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాస్తవానికి.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్‌ఎస్‌ కింద అన్ని రకాల వైద్యసేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపేశాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో చల­నం లేకపోవడంతో సోమవారం (ఏప్రిల్‌ 7) నుంచి వైద్య­సేవలు ఆపేస్తామని నెలరోజుల ముందే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తమ సమస్యలపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశా ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. బిలు­­్లలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం రూ.1,500 కోట్లు అయినా మంజూరు చేయకపోతే సేవలు కొనసాగించబోమని ప్ర­భు­­త్వానికి తేలి్చచెప్పారు. ఇన్ని రకాలుగా ఆస్ప­త్రుల యాజమాన్యాలు హెచ్చరించినా ప్ర­భు­త్వం పట్టించుకోకపోవడంతో చేసేదిలేక సమ్మె­లోకి వెళ్లా­రు. ఆరోగ్య­శ్రీ అమలును బీమా రూపంలో ప్రై­వే­ట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కట్టబెట్టడం కోస­ం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెల­గాటం ఆడుతోందని ప్రజలు మండిపడుతున్నా­రు.పేదలకు ఇబ్బందికరం.. నా కొడుకు ఐదేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చాం. ఆరోగ్యశ్రీ సేవలు బందయ్యాయని చెప్పారు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. కార్పొరేట్‌ వైద్య­సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్య­లు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోవడం పేదలకు ఇబ్బందికరం. – కె. సత్యవతి, జగన్నాథపురం, కాకినాడ గుండె నొప్పితో వస్తే ఉచిత సేవలు లేవన్నారు.. మూడ్రోజుల నుంచి ఆయాసం, గుండె నొప్పి­తో బాధపడుతున్నా. నంద్యాల పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఓ ప్రైవేటు ఆçస్పత్రికి వచ్చాం. నా భర్త సంజీవరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్‌ పరీక్షలు చేసి ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలన్నారు. అయితే, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పారు. ఉచితంగా వైద్యం చేసేందుకు వీలుపడదన్నారు. రూ.15 వేల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో అంత డబ్బులేక వెనుదిరిగాం. మాలాంటి పేదలకు పెద్ద జబ్బులు వస్తే ఎవరు దిక్కు? – మల్లేశ్వరి, నంద్యాలఆపరేషన్‌ చేస్తారో లేదో.. ప్రమాదవశాత్తు కుడి భుజం విరిగింది. ఆపరేషన్‌ కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రికి వచ్చాను. రిజి్రస్టేషన్‌లో పేరు రాసుకున్నారుగానీ డాక్టర్‌ అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆయన వస్తేనే ఆపరేషన్‌ గురించి మాట్లాడాలని అంటున్నారు. ఇప్పుడేదో సమ్మె అంటున్నారు. ఆపరేషన్‌ చేస్తారో లేదో అని ఆందోళనగా ఉంది. – కె. సత్యం, నిద్దాం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లాఆరోగ్యశ్రీ అంటేనే.. లేదు పొమ్మంటున్నారు.. మాది తిరుపతి కొర్లగుంట, నా భర్త భవన నిర్మాణ కారి్మకుడు. ఆయనకు కొంతకాలంగా ఛాతీలో నొప్పి వ­స్తోంది. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్లాం. ఆరోగ్య­శ్రీ కింద ఓపీలు ఇవ్వడంలేదు, వెళ్లిపొమ్మన్నారు. డ­బ్బు­లు కడితేనే ఓపీ ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఇంటికి వచ్చేశాం. అప్పు కోసం ప్రయతి్నస్తు­న్నాం. గత ప్రభుత్వంలో మా నాన్నకు గుండె ఆపరేషన్‌ చేయించాం. ఒక్క రూ­పాయి లేకుండా వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశా­రు. పైగా.. ఇంటికొచ్చిన మూడునెలలు పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఖర్చు­ల­కు ఇచ్చారు. – సావిత్రమ్మ, దినసరి కూలి, తిరుపతిసంజీవని’ ఊపిరి తీసిన చంద్రబాబు సర్కార్‌ఈ చిత్రం చూడండి.. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన మహబూబ్‌ సాబ్‌కు సుస్తీ చేసి ప్రాణం మీదకు వచ్చింది. ఫోన్‌ చేస్తే 108 కుయ్‌ కుయ్‌మని రాలేదు సరికదా! కనీసం పలకలేదు. దీంతో మహబూబ్‌ కుటుంబానికి ఏంచేయాలో పాలుపోలేదు. చంద్రబాబు పాలనలో 108ని నమ్ముకోవడం దండగని అర్థం చేసుకున్న ఆ కుటుంబం అప్పటికప్పుడు బాడుగకు ఓ ట్రాలీ మాట్లాడుకున్నారు. ఆ ట్రాలీకి దుప్పటి కప్పి.. అందులోనే మహబూబ్‌ను కడప రిమ్స్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు.దిగొచ్చిన ప్రభుత్వం..ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్తంభింపజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ‘ఆశ’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. పెండింగ్‌ బకాయిలు చెల్లింపుల కోసం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చారు. దీంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నామని ‘ఆశ’ అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సోమవారం రాత్రి పొద్దు­పో­యిన తరువాత వెల్లడించారు. ఈనెల 10 తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఇం­దులో పెండింగ్‌ బకాయిలు, భవిష్యత్‌ చెల్లింపు షెడ్యూల్, ప్యాకేజీ రివిజన్లు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు.

YS Jagan Questions To CM Chandrababu Naidu: Andhra pradesh9
జీఎస్‌డీపీపై ఇన్ని బోగస్‌ మాటలా బాబూ?

సాక్షి, అమరావతి: ‘‘గత ఆర్థిక సంవత్సరం (2024–­25)లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతం మాత్రమే నమోదైతే... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీ­యమేనా?’’ అని సీఎం చంద్రబాబును ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే.. మీ ప్రభుత్వ మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పి పుచ్చేందుకే జీఎస్‌డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవు­తుం­దని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రం విశ్వసనీయ­తను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపా­డేం­దుకు.. జీఎస్‌డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలి­కారు. ఈమేరకు సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో ఏమన్నారంటే..è చంద్రబాబూ..! మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. మీ అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ⇒ నాడు కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019–24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 13.57 శాతం మాత్రమే. అదే 2014–19లో కోవిడ్‌ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63 శాతంగా ఉంది. వీటిని బట్టి చూస్తే.. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించ దగ్గదన్నది స్పష్టమవుతోంది. ⇒ కోవిడ్‌ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019–24 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించింది. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, ఎంవోఎస్‌పీఐ నివేదికలే అందుకు నిదర్శనం. అయినప్పటికీ 2019–24లో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఉందని మీరు చెబుతున్నారు.⇒ మరోవైపు మీ పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైంది. కోవిడ్‌ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ.. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నే­తర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయక­పోతే.. మీ ప్రభుత్వం ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేది. మీ అసమర్థ పాలన.. అసంబద్ధ విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటంటే .. మీ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది.⇒ రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి మీ ప్రభుత్వం అన్ని ప్రయత్నా­లను చేస్తుండటం ఆందోళనకరం. రాష్ట్ర ఆర్థిక పనితీ­రును ఒక్కసారి పరిశీలిస్తే.. ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. అయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మీరు అబద్ధం చెబుతున్నారు.⇒ ఎంవోఎస్‌పీఐ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం ఈమేరకు పనితీరు కనబరుస్తున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం వెల్లడిస్తోంది. నిజానికి ఎంవోఎస్‌పీఐ విడుదల చేసే డేటాకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్‌ డేటానే మూలం. దీన్ని బట్టి చూస్తే.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా మరొకటి కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే. వాటిని ఎంవోఎస్‌పీఐ వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదు. ⇒ 2024–25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకూ 10.87 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2024–25లో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.48 శాతంగా అంచనా వేసింది. ఇది సమర్థనీయమే. ⇒ తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి 2025 వరకు 13.01 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు జీఎస్‌డీపీ వృద్ధి రేటు 9.69 శాతంగా అంచనా వేసింది. ఇది కూడా సమర్థనీయమే.⇒ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం మాత్రమే పెరిగితే.. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.21 శాతంగా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇది సమర్థనీ­యమైన­దేనా? పన్ను ఆదాయాల వృద్ధి రేటు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35 శాతం తగ్గింది. మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది. ⇒ గత సంవత్సరం మీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నందున.. ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు? ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు జీడీపీ వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఇది సముచితం. ఎందుకంటే, ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి.. ఇది వాస్తవ జీడీపీ వృద్ధి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది.

 IPL 2025: Royal Challengers Bangaloru beat Mumbai Indians by 12 runs10
RCB Vs MI: ఆర్‌సీబీ అదరహో

ముంబై విజయలక్ష్యం 222 పరుగులు... ఆర్‌సీబీ చక్కటి బౌలింగ్‌తో స్కోరు 99/4 వద్ద నిలిచింది. ముంబై గెలిచేందుకు 8 ఓవర్లలో 123 పరుగులు చేయడం అసాధ్యంగా అనిపించింది. అయితే అసాధారణ ఆటతో తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా పోరాడారు. కేవలం 34 బంతుల్లో 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్‌ చేసి బెంగళూరు చివరకు మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకుంది. అంతకుముందు కెప్టెన్‌ రజత్‌ పాటీదార్, విరాట్‌ కోహ్లి, జితేశ్‌ శర్మ దూకుడుతో బెంగళూరు ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. ముంబై: వాంఖెడే మైదానంలో పదేళ్ల తర్వాత ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. సోమవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్‌సీబీ 12 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రజత్‌ పాటీదార్‌ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... జితేశ్‌ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేయగా, హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. సమష్టి ప్రదర్శన... ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఫిల్‌ సాల్ట్‌ (4) వెనుదిరగ్గా... కోహ్లి, పడిక్కల్‌ కలిసి దూకుడుగా స్కోరుబోర్డును నడిపించారు. బౌల్ట్‌ ఓవర్లో వీరిద్దరు కలిసి 16 పరుగులు రాబట్టారు. చహర్‌ ఓవర్లో పడిక్కల్‌ వరుసగా 6, 6, 4 బాదగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 73 పరుగులకు చేరింది. చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి పడిక్కల్‌ వెనుదిరగడంతో 91 పరుగుల (52 బంతుల్లో) రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సాంట్నర్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో పాటీదార్‌ జోరు ప్రదర్శించాడు. హార్దిక్‌ ఒకే ఓవర్లో కోహ్లి, లివింగ్‌స్టోన్‌ (0)లను అవుట్‌ చేయగా, బౌల్ట్‌ ఓవర్లో ఆర్‌సీబీ బ్యాటర్లు పాటీదార్, జితేశ్‌ కలిసి 18 పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 169/4. ఆఖరి 4 ఓవర్లలో బెంగళూరు 52 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో 6, 4తో దూకుడుగా ఆటను మొదలు పెట్టిన రోహిత్‌ శర్మ (9 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్‌)... దయాళ్‌ తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. రికెల్టన్‌ (17), జాక్స్‌ (22) కూడా మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. బౌలర్‌ దయాళ్, కీపర్‌ జితేశ్‌ సమన్వయలోపంతో సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను అదే ఓవర్లో మరో రెండు బంతుల తర్వాత పెవిలియన్‌ పంపించి దయాళ్‌ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సుయాశ్‌ ఓవర్లో తిలక్‌ 2 ఫోర్లు, సిక్స్‌...హాజల్‌వుడ్‌ వేసిన తర్వాతి ఓవర్లో హార్దిక్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది విజయంపై ఆశలు రేపారు. గత మ్యాచ్‌లో ‘రిటైర్ట్‌ అవుట్‌’గా పంపించిన కసి తిలక్‌ బ్యాటింగ్‌లో కనిపించింది. తర్వాతి మూడు ఓవర్లలో కూడా ఈ జోరు కొనసాగి 43 పరుగులు వచ్చాయి. అయితే తిలక్‌ వికెట్‌తో ఆట మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) బౌల్ట్‌ 4; కోహ్లి (సి) నమన్‌ (బి) హార్దిక్‌ 67; పడిక్కల్‌ (సి) జాక్స్‌ (బి) పుతూర్‌ 37; పాటీదార్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 64; లివింగ్‌స్టోన్‌ (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 0; జితేశ్‌ (నాటౌట్‌) 40; డేవిడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–4, 2–95, 3–143, 4–144, 5–213. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–57–2, చహర్‌ 2–0–29–0, బుమ్రా 4–0–29–0, జాక్స్‌ 1–0–10–0, సాంట్నర్‌ 4–0–40–0, హార్దిక్‌ 4–0– 45–2, విఘ్నేశ్‌ 1–0–10–1. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) దయాళ్‌ 17; రికెల్టన్‌ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్‌ 17; జాక్స్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 22; సూర్యకుమార్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) దయాళ్‌ 28; తిలక్‌వర్మ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 56; హార్దిక్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) హాజల్‌వుడ్‌ 42; నమన్‌ ధీర్‌ (సి) దయాళ్‌ (బి) కృనాల్‌ 11; సాంట్నర్‌ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 8; దీపక్‌ చహర్‌ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 0; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–21, 2–38, 3–79, 4–99, 5–188, 6–194, 7–203, 8–203, 9–209. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–48–1, యశ్‌ దయాళ్‌ 4–0–46–2, హాజల్‌వుడ్‌ 4–0–37–2, సుయాశ్‌ శర్మ 4–0–32–0, కృనాల్‌ పాండ్యా 4–0–45–4.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement