Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Its a major victory for WB government employees BJP1
‘ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం’

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆ రాష్ట్ర బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పట్నుంచో మమతా ప్రభుత్వం నాన్చుతూ వస్తున్న పెండింగ్ డీఏను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విజయంగా బీజేపీ పేర్కొంది. ఈరోజు(శుక్రవారం) దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగుల 25 శాతం డీఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.దీనిపై వెస్ట్ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధి అమిత​ మాలవియా మాట్లాడుతూ.. ‘ ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయం. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా మమతా సర్కారు దీన్ని పట్టించుకోవడం లేదు. 17 వాయిదాలు, విచారణలో ఆటంకాల తర్వాత సుప్రీంకోర్టుల చివరకు తన తీర్పును వెల్లడించడం హర్షించదగ్గ విషయం. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు, బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. ఇది ఒక మైలురాయి లాంటి తీర్పు’ అని పేర్కొన్నారు.కాగా, 2022, మే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

YSRCP Provided Financial Assistance To Family Of Jawan Murali Nayak2
వీరజవాన్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం.. రూ.25 లక్షల చెక్కు అందజేత

శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీ నాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్‌ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్‌ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మురళీనాయక్‌ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్‌ సార్‌ వచ్చారు.. లేచి సెల్యూట్‌ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్‌ నాయక్‌ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్‌ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్‌ దేశం రుణపడి ఉంటుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Their air defence systems no match for Indias BrahMos3
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’

వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

Acb Court Granted Bail To Vallabhaneni Vamsi4
వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరు

సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌ మంజూరైంది. ఏసీబీ కోర్టు.. వంశీకి బెయిల్‌ ఇచ్చింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.కాగా, వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు.. 14 రోజుల రిమాండ్‌ను విధించింది. హనుమాన్‌ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్‌తో వంశీకి రిమాండ్‌ విధించింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులతో అధికార కూటమి ప్రభుత్వం వేధింపుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయటంతో గత 90 రోజులకుపైగా వంశీ విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్‌ చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్‌ మంజూరు చేయటంతో తాజాగా హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారంట్‌ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.

Google New Feature Makes Stolen Phones Useless5
గూగుల్‌ కొత్త ఫీచర్‌.. కొట్టేసిన ఫోన్‌ పనిచేయదు!

ఫోన్ల చోరీకి చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్‌డేట్‌లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్‌ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్‌లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్‌ పోలీస్’ అనే వెబ్‌సైట్‌ నివేదిక తెలిపింది.గూగుల్‌ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్‌పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్‌పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్‌ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్‌ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్‌ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్‌ ఫోన్‌ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను నమోదు చేసే వరకు ఫోన్‌ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్‌ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Ravi Shastri Weaves Rohit Sharmas Perfect Test Swan Song6
నేను కోచ్‌గా ఉండుంటే.. రోహిత్‌కు అలా జ‌రిగేది కాదు: రవిశాస్త్రి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఇటీవ‌లే త‌న 12 ఏళ్ల టెస్టు కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. రోహిత్ శ‌ర్మ త‌న రిటైర్మెంట్‌కు ముందు టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా, ఆట‌గాడిగా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్ చేతిలో భార‌త్ తొలిసారి టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావ‌డం, ఆస్ట్రేలియాతో బీజీటీలో చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌కు దూరం కావ‌డం వంటివి రోహిత్‌ను మాన‌సికంగా దెబ్బ‌తీశాయ‌నే చెప్పుకోవాలి. రోహిత్ త‌న కెరీర్‌లో చివ‌రి టెస్టు మ్యాచ్ మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ త‌ర్వాత బీజీటీలోని ఆఖ‌రి మ్యాచ్ నుంచి హిట్ మ్యాన్ స్వ‌చ్ఛందంగా తానంతట త‌నే త‌ప్పుకున్నాడు. దీంతో క‌నీసం ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రోహిత్ త‌న కెరీర్‌ను ముగించాడు. ఈ క్ర‌మంలో భార‌త మాజీ హెడ్‌కోచ్ ర‌విశాస్త్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను కోచ్‌గా ఉండుంటే, సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడేవాడ‌ని ర‌విశాస్త్రి వెల్ల‌డించాడు."ఐపీఎల్‌-2025 సీజ‌న్ టాస్ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ ప్రాక్టీస్ చేస్తుండ‌గా చాలాసార్లు చూశాను. కానీ ఆ స‌మ‌యంలో అత‌డితో మాట్లాడటానికి తగినంత సమయం దొర‌క‌లేదు. ఓసారి మాత్రం అత‌డి ద‌గ్గ‌రకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడాను. నేను కోచ్‌గా ఉండుంటే సిడ్నీ టెస్టు(బీజీటీలో ఆఖరి టెస్టు)లో ఆడకుండా ఉండేవాడివి కాదు అని చెప్పా. సిరీస్ అప్ప‌టికి ఇంకా ముగియ‌లేదు కాబ‌ట్టి క‌చ్చితంగా మిమ్మల్ని ఆడించేవాడిని. ఎందుకంటే 2-1తో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు ముందుంజ‌లో ఉన్నా, నేను వెన‌క‌డుగు వేసే వ్య‌క్తిని కాదు. ఆఖ‌రి టెస్టు మ్యాచ్ 30-40 ప‌రుగుల తేడాతో సాగింది. సిడ్నీ పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది. రోహిత్ ఫామ్‌లో ఉన్న లేక‌పోయానా జ‌ట్టులో క‌చ్చితంగా ఉండాల్సిందే.ఎందుకంటే అత‌డు మ్యాచ్ విన్న‌ర్‌. సరిగ్గా ఇదే విష‌యం రోహిత్ కూడా చెప్పాను. ఒక‌వేళ రోహిత్ ఆ మ్యాచ్‌లో ఆడి అక్క‌డ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు జ‌ట్టును న‌డిపించి ఉంటే సిరీస్ స‌మ‌మయ్యేది. అయితే ప్ర‌తీ కోచ్‌కు వేర్వేరు స్టైల్స్ ఉంటాయి. ఇది నా శైలి. కేవ‌లం నా ఆలోచిన విధానాన్ని మాత్ర‌మే రోహిత్‌కు తెలియ‌జేశాను. ఎప్ప‌టి నుంచో ఇది నా మ‌న‌సులో ఉంది. ఎట్టకేలకు అత‌డికి తెలియ‌జేశాను" అని ఐసీసీ రివ్యూలో ర‌విశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు బట్టి చూస్తే ప్రస్తుత భారత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌కు పరోక్షంగా కౌంటరిచ్చినట్లు అన్పిస్తోంది. గంభీర్‌తో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లికి విభేదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ​క్రమంలో రో-కో టెస్టులకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Alekhya Chitti Pickles Ramya At Tollywood Movie Event7
టాలీవుడ్‌ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్‌లో సందడి!

గత కొద్దిరోజులుగా 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కాసారిగా వీళ్లు స్టార్స్ అయిపోయారు. పచ్చళ్ల బిజినెస్‌ మూతపడినప్పటికీ వీరికి ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఓ కస్టమర్‌తో వీరి సంభాషణ వైరల్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరి మాట్లాడిన డైలాగ్స్‌పై మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి.ఇదంతా పక్కనపెడితే అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరైన రమ్య సడన్‌లో సినిమా ఈవెంట్‌లో కనిపించింది. టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లోనే రమ్య సందడి చేసింది. వేదికపై మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌ పక్కనే కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం రమ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఈవెంట్‌కు రమ్య హాజరు కావడంపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. పచ్చళ్ల బిజినెస్‌తో ఫేమస్ అయి.. ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసిందా అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా సెలబ్రిటీ అయిపోయారా? అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఏదేమైనా రమ్య టాలీవుడ్‌ మూవీ ఈవెంట్‌లో కనిపించడంతో మరోసారి అలేఖ్య చిట్టి పికిల్స్ టాపిక్ తెరపైకి వచ్చింది. మరి అందరూ ఊహించినట్లుగానే రమ్య ఈ సినిమాలో నటించిందా? లేదా అన్నది తెలియాలంటే ఆమె దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్‌ సిస్టర్స్‌లలో ఒకరికి తప్పుకుండా బిగ్‌బాస్‌లోకి ఛాన్స్‌ వస్తుందని నెట్టింట వైరలైంది. కానీ, రమ్యకు ఛాన్స్‌ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపించింది. మోడ్రన్‌ డ్రెస్‌లతో ఆమె రీల్స్‌ ఎక్కువగా ట్రెండ్‌ అవుతుంటాయి కూడా.. గతంలో జియోహాట్‌స్టార్‌లో పికిల్స్‌కు సంబంధించిన ఒక సీన్‌ను వారు షేర్‌ చేశారు. ప్రభాస్‌ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్‌బాస్‌ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్‌బాస్‌కు రావచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. View this post on Instagram A post shared by Ramya moksha kancharla 👻🌸 (@ramyagopalkancharla)

BJLP Leader Maheswar Reddy On Congress Govt8
‘సీఎంకు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు’

హైదరాబాద్: రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి వర్గం అసంతృప్తిగా ఉందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ రోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ లో భాగంగా మాట్టాడుతూ.. ‘ సీఎం రేవంత్ కు, డిప్యూటీ సీఎంకు మధ్య విబేధాలు ఉన్నాయి. అందుకే సీఎం కామెంట్స్ ను మంత్రులు ఎవరూ సమర్థించలేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది. రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు బాధపడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణను సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు సైతం వ్యతిరేకంగా ఉంటారని సీఎం రేవంత్ భావన. అందుకే గందరగోళ నివేదికలు హైకమాండ్ కి పంపి అడ్డుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కడ బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తుందోనని జగన్నాటకం ఆడుతున్నారు. రేవంత్ లోపాలు, తప్పిదాలు అన్ని హైకమాండ్ దగ్గర ఉన్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే సీఎంను మార్చాలని హైకమాండ్ ఎదురుచూస్తోంది’ అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Defence Minister Rajnath Singh Visits Bhuj Airbase, Meets Air Warriors9
‘ట్రైలర్‌ మాత్రమే చూశారు.. పాక్‌ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’

గాంధీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్‌ మాత్రమే చూశారు. పాక్‌ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌ ఎయిర్‌ బేస్‌లో ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ వారియర్స్‌తో రాజ్‌నాథ్‌ భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్‌ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్‌ విజయానికి ఎయిర్‌బేస్‌ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్‌లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్‌ దాటకుండానే పాక్‌ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్‌ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్‌ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజహార్‌కు పాక్‌ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ ఫండింగ్‌ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్‌ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025

women aftey wing a hyderabad woman doctor experience  impress you10
హ్యాట్సాఫ్‌.. పోలీస్‌.. ఇంట్రస్టింగ్‌ స్టోరీ

అబిడ్స్‌: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్‌ ఉమెన్‌ పోలీస్‌ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్‌ జోన్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్‌స్పెక్టర్‌ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్‌ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్‌స్టేన్‌కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement