Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Frauds1
కంచం లాగేశారు! : వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకా­లను రద్దు చేశాడు. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్‌ ఇచ్చినవి అన్నీ కొనసాగు­తాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మ­బ­లి­కారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు. తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారు­ణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్ర­బాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గురు­వారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశ­మ­య్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్ర­బాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరు­ద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.సూపర్‌ సిక్స్‌ గాలికి.. దారుణ వంచనచంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీ­లైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరి­పో­యాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామను­కున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతు­న్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లా­డికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగే­శాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకా­లను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు. బాబుకు సింగిల్‌ డిజిటే..ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.వ్యవస్థలన్నీ నిర్వీర్యం..⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్‌మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్‌ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్‌ బోర్డింగ్‌ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్‌ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్‌ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్‌ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.ఎక్కడ చూసినా మాఫియాలే..ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగు­తు­న్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభు­త్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడు­స్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజక­వర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు. ⇒ మనం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్‌ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాంకుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Heavy Rain, Dust Storm In Delhi NCR2
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. స్తంభించిన విమాన సర్వీసులు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షం, దుమ్ము బీభత్సం సృష్టించాయి. జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం తెల్లవారు జామున వాతావరణంలో అకస్మాత్తుగా మార్పుల కారణంగా పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025దేశ రాజధానిలో శుక్రవారం తెల్లవారు జామున వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులు, దుమ్ము తుఫాను, భారీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులు కారణంగా పలు ప్రాంతాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్‌ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025ఢిల్లీకి వెళ్లే, బయలుదేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్‌లో పేర్కొంది.

Rasi Phalalu: Daily Horoscope On 02-05-2025 In Telugu3
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం.. అప్రయత్న కార్యసిద్ధి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.పంచమి ప.2.40 వరకు, తదుపరి షష్ఠి; నక్షత్రం: ఆరుద్ర రా.6.19 వరకు, తదుపరి పునర్వసు; వర్జ్యం: లేదు; దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.12 వరకు; అమృత ఘడియలు: ఉ.8.44 నుండి 10.15 వరకుసూర్యోదయం : 5.38సూర్యాస్తమయం : 6.15రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకుశ్రీ శంకర జయంతి. మేషం... పనులు ముందుకు సాగవు. ధనవ్యయం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. బంధువులతో విభేదాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం.వృషభం... కార్యజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం. అదనపు ఆదాయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.మిథునం.... కొత్త బాధ్యతలు తలకెత్తుకుంటారు. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.కర్కాటకం... చిన్ననాటి మిత్రులను కలుస్తారు. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కొత్త్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శనం. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. .సింహం.... ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలం. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. శుభవర్తమానాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు అధిగమిస్తారు.కన్య....... కుటుంబసమస్యలు. వివాదాలు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. మానసిక ఆశాంతి. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిభారం.తుల..... అనుకోని ధనవ్యయం. కొన్ని బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిళ్లు.వృశ్చికం.... ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు. శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.ధనుస్సు... ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీ సత్తా చాటుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి. బంధువుల నుంచి సహాయం. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు.మకరం.... కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.కుంభం... పనుల్లో అవాంతరాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మీనం... కొత్త పనులు చేపడతారు. ఆలయాల దర్శనాలు. కీలక సమాచారం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Prime Minister Modi to visit Amaravati today4
నేడు అమరావతికి ప్రధాని మోదీ

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాలొ­్గ­ంటారు. ఇందుకోసం శుక్రవారం మధ్యా­హ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడిలోని సభా ప్రాంగణానికి వెళ్తారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయ­­ంత్రం 4.55 గంటలకు గన్న­వరం చేరుకొని.. తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. భారీ భద్రత.. ప్రధాని పర్యటనకు పోలీ­సు­లు భారీ భద్రతా ఏర్పా­ట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్‌ బలగా­లను మోహ­రించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించారు. అమరావతి­లోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గా­ల­ను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప్రధాని పర్యటన సందర్భంగా శుక్రవారం ఉద­యం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుంటూరు వరకు వాహనాలను జాతీయ రహదారిపై అనుమతించరు. కాగా, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గురువారం సభా ప్రాంగణంలోని ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. జనంతో వచ్చే ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్‌చార్జిగా పెట్టినట్లు తెలిపారు. ప్రతి 25 బస్సులకు ఒక అధికారిని ప్రత్యేక ఇన్‌చార్జిగా నియమించామన్నారు. ప్రజలకు బస్సుల్లో అల్పాహారం, తాగునీరు, మధ్యాహ్న భోజనం, సభా ప్రాంగణం వద్ద రాత్రి భోజనం అందించనున్నట్లు చెప్పారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, ప్రధాని పర్యటన ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కె.విజయానంద్‌ పరిశీలించారు.

Marco Rubio calls India and Pakistan in effort to defuse crisis over Kashmir attack5
ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే

న్యూయార్క్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, పాకిస్తాన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌లతో వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌.జైశంకర్‌తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్‌ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌.జైశంకర్‌ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. భారత్‌కు పాక్‌ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్‌కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్‌ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్‌ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్‌ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్‌సెత్‌ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.

Mukesh Ambani 100 billion vision for India entertainment sector6
వినోద రంగం@ 100 బిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: వచ్చే పదేళ్లలో దేశీ మీడియా, వినోద పరిశ్రమ మూడు రెట్లు పెరిగి, 100 బిలియన్‌ డాలర్లకు చేరనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. దీనితో లక్షల కొద్దీ ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇతర రంగాలూ ప్రయోజనాలను పొందుతాయని వేవ్స్‌ 2025 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. డిజిటల్‌ సాంకేతికతతో కథలను ఆసక్తికరంగా చెప్పే విశిష్ట సామర్థ్యాలు భారత్‌కి సొంతమని అంబానీ వివరించారు. మనకు సాటిలేదు..ప్రపంచంలో సంక్షోభం, అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో స్ఫూర్తివంతమైన మన కథలు భవిష్యత్తుపై ఆశాభావం కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. వేల కొద్దీ సంవత్సరాలుగా మన పురాణేతిహాసాలు సౌభ్రాతృత్వం, సాహసం, ప్రకృతిపై ప్రేమను చాటి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను గెలుచుకున్నాయని అంబానీ వివరించారు. ఈ విషయంలో మరే దేశమూ మనకు సాటిరాదన్నారు. ముక్కలు చెక్కలవుతున్న ప్రపంచాన్ని తిరిగి బాగుచేయడానికి మన కథలను ఆత్మవిశ్వాసంతో మరోసారి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి సంతాపం తెలిపారు. 90 దేశాల నుంచి 10,000 మంది పైగా ప్రతినిధులు వేవ్స్‌ సదస్సులో పాల్గొంటున్నారు.

Oscars: PM Narendra Modi Superb Words About SS Rajamouli7
భారత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మారుతోంది

‘‘కంటెంట్‌ క్రియేటర్స్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్‌ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్‌ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్‌ అనేవి ఆరెంజ్‌ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్‌ ఎకానమీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్‌ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ‘వేవ్స్‌’లో ఆమిర్‌ ఖాన్, నాగార్జున, ఫర్హాన్‌ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్‌ కుమార్‌ రావు, కబీర్‌ బేడీ, అనుపమ్‌ ఖేర్, అనిల్‌ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్‌ ప్రముఖులు పాల్గొన్నారు.‘కనెక్టింగ్‌ క్రియేటర్స్, కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్‌ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్‌’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్‌’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్‌ ఇన్‌ ఇండియా, క్రియేట్‌ ఫర్‌ ది వరల్డ్‌ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్‌ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆస్కార్‌ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్‌ కపూర్‌ చిత్రాలు పాపులర్‌. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అంటే సత్యజిత్‌ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్‌ అనగానే ఏఆర్‌ రెహమాన్, రాజమౌళి (‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్‌ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్‌ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్‌ చక్రవర్తిగారు, స్టంట్స్‌ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి‘ది జర్నీ: ఫ్రమ్‌ అవుట్‌సైడర్‌ టు రూలర్‌’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్‌ ఖాన్, నటి దీపికా పదుకోన్‌ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్‌ షారుక్‌ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్‌. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్‌ ఉండాలి.అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్‌ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్‌. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్‌. దీపికా పదుకోన్‌ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.‘వేవ్స్‌’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్‌ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్‌ ఖోస్లా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సలీల్‌ చౌదరిల పోస్టల్‌ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు.⇒ ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ స్వయంగా ఈ మాట అంటున్నారు. ‘వేవ్స్‌’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్‌ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్‌ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్‌ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్‌ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు. అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్‌ నా జీవితంలో పెద్ద గిఫ్ట్‌’’ అని అల్లు అర్జున్‌ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్‌లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్‌ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు. ‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్‌ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్‌ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్‌ ΄్యాడ్‌ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్‌ ΄్యాడ్‌ వేవ్స్‌’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Mumbai Indians beat Rajasthan by 100 runs8
ముంబై ‘సిక్సర్‌’ రాజస్తాన్‌ ‘అవుట్‌’

ఐపీఎల్‌–2025లో ‘ప్లే ఆఫ్స్‌’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్‌ రాయల్స్‌ నిలిచింది. సీజన్‌లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్‌–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్‌’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్‌... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్‌ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.జైపూర్‌: ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికెల్టన్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అదే జోరును కొనసాగించారు. రికెల్టన్, రోహిత్‌ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్‌ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ మేనేజ్‌మెంట్‌ ‘పింక్‌ ప్రామిస్‌’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్‌’ కిట్‌ ధరించగా... బ్యాటర్‌ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు. టాప్‌–4 విధ్వంసం... ముంబై బ్యాటింగ్‌ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్‌... ఆర్చర్‌ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్‌ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్‌ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్‌ ముగించాడు. టపటపా... ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్‌ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్‌ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్‌ కావడంతో రాయల్స్‌ పతనం మొదలైంది. బౌల్ట్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్‌ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్‌ తర్వాతి ఓవర్లో నితీశ్‌ రాణా (9) అవుట్‌ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్‌ (16), హెట్‌మైర్‌ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్‌ జురేల్‌ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్‌ కుప్పకూలింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (బి) తీక్షణ 61; రోహిత్‌ (సి) జైస్వాల్‌ (బి) పరాగ్‌ 53; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 48; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్‌ 4–0–39–0, పరాగ్‌ 2–0–12–1. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) బౌల్ట్‌ 13; వైభవ్‌ (సి) జాక్స్‌ (బి) చహర్‌ 0; నితీశ్‌ రాణా (సి) తిలక్‌ (బి) బౌల్ట్‌ 9; పరాగ్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 16; జురేల్‌ (సి అండ్‌ బి) కరణ్‌ శర్మ 11; హెట్‌మైర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 0; శుభమ్‌ దూబే (సి) బౌల్ట్‌ (బి) పాండ్యా 15; ఆర్చర్‌ (సి) బుమ్రా (బి) బౌల్ట్‌ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్‌ శర్మ 2; కార్తికేయ (సి) చహర్‌ (బి) కరణ్‌ శర్మ 2; మధ్వాల్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 2–0–13–1, బౌల్ట్‌ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్‌ 3–0–29–0, హార్దిక్‌ పాండ్యా 1–0–2–1, కరణ్‌ శర్మ 4–0–23–3. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X హైదరాబాద్‌ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Star heroes are busy with Shootings in this Summer9
జోరుగా హుషారుగా...

సమ్మర్‌ హాలిడేస్‌ లేవా గురూ అని ఏ సినిమా సెలబ్రిటీని అడిగినా... వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం ఇవ్వాలంటే మేం హాలిడేస్‌ తీసుకోకూడదు గురూ అంటారు. ఎండలు మండిపోతున్నాయి కదా అంటే... నో ప్రాబ్లమ్‌ అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎండలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. ఎంచక్కా హాలిడే తీసుకుని కూల్‌ కూల్‌గా ఉండే విదేశాలు చుట్టి రావొచ్చు. కానీ... మండే ఎండలను లెక్క చేయకుండా హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు కొందరు హీరోలు. ఆ స్టార్స్‌ చేస్తున్న సినిమాల విశేషాలు తెలుసుకుందాం.జన్వాడలో ఆటా పాటా హీరో మహేశ్‌బాబు ఆడిపాడుతున్నారట. అది కూడా ఓ భారీ సెట్‌లో. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా కోసమే. మహేశ్‌బాబు, డైరెక్టర్‌ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్‌ ఆయ్యారు. ఆయన లుక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అమేజాన్‌ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్‌ సమీపంలోని జన్వాడలో దాదాపు 550 మందితో ప్రత్యేకంగా సెట్‌ వేశారు మేకర్స్‌. ఈ సెట్‌లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ఓ భారీ పాటని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌ ల్యూమినియం ఫ్యాక్టరీలో, రెండో షెడ్యూల్‌ని ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. తాజాగా జన్వాడలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో మూడవ షెడ్యూల్‌లో భాగంగా పాట చిత్రీకరణని గ్రాండ్‌గా జరుపుతున్నారట. ఈ సెట్స్, ఈ సాంగ్‌ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్‌. ఈ పాట షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. మహేశ్‌ బాబు–రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషలో రూపొందుతోన్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.ముచ్చింతల్‌లో జాతర హీరో రవితేజ జాతరలో సందడి చేస్తున్నారు. సందడంటే మామాలు సందడి కాదు... ఓ రేంజ్‌లో భారీగా అన్నమాట. మరి... ఆయన సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘మాస్‌ జాతర’ సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’. ‘సామజ వరగమన’ మూవీ ఫేమ్‌ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్‌ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ పీరియాడికల్‌ స్టోరీతో అరకు అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని టాక్‌.ఇటీవల అరకులో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసిన యూనిట్‌ తాజాగా హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో చిత్రీకరణ జరపుకుంటోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో రవితేజతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట భాను భోగవరపు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ‘సామజవరగమన’ లాంటి హిట్‌ సినిమా తర్వాత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండటం, ‘ధమాకా’ సినిమాతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన రవితేజ, శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తుండటం, ‘ధమాకా’ సినిమాకి సూపర్‌ హిట్‌ సంగీతం అందించిన భీమ్స్‌ సిసిరోలియో–రవితేజ కాంబో రిపీట్‌ అవుతుండటంతో ‘మాస్‌ ధమాకా’పై భారీ అంచనాలున్నాయి. గుహల్లో పరిశోధన హీరో నాగచైతన్య గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు. జనరల్‌గా పురావస్తు శాఖ అధికారులు పరిశోధన జరుపుతుంటారు. మరి... నాగచైతన్య ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంటే ఆయన నటిస్తున్న తాజా సినిమా కోసం అన్నమాట. ‘తండేల్‌’ మూవీ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు నాగ చైతన్య. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) మూవీ తీసి, బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు డైరెక్టర్‌ కార్తీక్‌ దండు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్‌ థ్రిల్లర్‌ మూవీ రూపొందుతోంది.‘ఎన్‌సీ 24’ అనే వర్కింగ్‌ టైటిల్‌లో సినిమాని బాపినీడు సమర్పణలో సుకుమార్‌ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో (ఏడెకరాలు) జరుగుతోంది. మిస్టిక్‌ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ కోసం గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రత్యేకమైన సెట్స్‌ వేశారని టాక్‌. ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్‌తో కనిపిస్తారని ఇటీవల విడుదలైన స్పెషల్‌ వీడియో గ్లింప్స్‌ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఆయన కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు కూడా. ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో ఓ మైలురాయిలా ఉంటుందని చిత్రయూనిట్‌ ప్రకటించింది. సెట్‌లో స్పెషల్‌ సాంగ్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడి పాడుతున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. అది కూడా ప్రత్యేకమైన పాట కోసం. ఈ ఆటా పాటా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌) కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఏక్‌ మినీ కథ’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రితికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది.ఇండో కొరియన్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక్కడ వేసిన ఓ సెట్‌లో ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారట మేకర్స్‌. ఈ పాటలో వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్‌ దక్షా నగార్కర్‌ నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని కోకాపేట సమీపంలో చిరంజీవి–రామ్‌చరణ్‌ నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా షూటింగ్‌ కోసం వేసిన ఓ ప్రత్యేకమైన సెట్‌లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్‌.ముచ్చింతల్‌లో లెనిన్‌ అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు అఖిల్‌. ఏప్రిల్‌ 8న అఖిల్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన ‘లెనిన్ ’ టైటిల్‌ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్‌ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏజెంట్‌’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్‌ అనంతరం అఖిల్‌ నటిస్తున్న చిత్రం ‘లెనిన్‌’.తుక్కుగూడలో సంబరాలుహీరో సాయిదుర్గా తేజ్‌ తుక్కుగూడలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత గ్రాండ్‌గా చేశారు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్‌ 25 వరకూ వేచి చూడాల్సిందే. 2023లో విడుదలైన ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై ‘హను–మాన్‌’ (2024) వంటి పాన్‌ ఇండి యన్‌ హిట్‌ అందుకున్న కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ జరుపుతున్నారు మేకర్స్‌. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు) సెప్టెంబర్‌ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాచుపల్లిలో తెలుసు కదా!‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌’ వంటి హిట్‌ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్‌కి ఏ మాత్రం తగ్గకుండా వినోదాత్మకంగా, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట నీరజ కోన. స్టైలిస్ట్‌గా తానేంటో నిరూపించుకున్న నీరజ దర్శకురాలిగా ఏ స్థాయి హిట్‌ అందుకుంటారో వేచి చూడాలి. శంషాబాద్‌లో సూపర్‌ యోధబాలనటుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా పరిచయమై, హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా నటించిన రెండో చిత్రం ‘హను–మాన్‌’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్‌ అందుకుంది. ‘హను–మాన్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత తేజ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.రితికా నాయక్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్‌ యోధగా కనిపించనున్నారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఓ షెడ్యూల్‌లో తేజపై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోందట. తేజ సజ్జాతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్‌ ఘట్టమనేని.పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్‌ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్‌ మోహన్‌

Sakshi Guest Column On nation united in fight against terrorism10
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం

పహల్‌గామ్‌ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్‌ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్‌ పోస్టు మూసేశారు. పాక్‌ హైకమిషన్‌ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. ‘‘భారత రిపబ్లిక్‌తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్‌!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.యుద్ధం వస్తే సిద్ధమే!రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా? పహల్‌గామ్‌లో పాక్‌ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్‌ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్‌ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్‌’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్‌’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్‌ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.‘ఒక్క దేశం’గా నిలబడదాం!ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్‌ నేషన్‌’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్‌ నేషన్‌’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’1948 జనవరి 30న ‘తీస్‌ జనవరి మార్గ్‌’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్‌ 22న పహల్‌గామ్‌ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్‌లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. పహల్‌గామ్‌ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. గొప్ప భారతీయుడైన లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్‌’ నినాదానికి ‘జై ఇన్సాన్‌’ (ఇన్సాన్‌ అంటే మానవ్‌) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్‌గామ్‌ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement