Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Telangana Assembly Budget Session 2025: March 13th Assembly News Updates1
స్పీకర్‌పై జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఉద్దేశించి మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు శాసనసభలో అలజడి రేపాయి. ప్రతిపక్షంగా తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ బీఆర్‌ఎస్‌ స్పీకర్‌పై ఆరోపణలకు దిగగా.. బీఆర్‌ఎస్‌ సభ్యులు దళిత స్పీకర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల ఆందోళనలతో గందరగోళం నెలకొనగా సభ కాసేపు వాయిదా పడింది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానం చర్చ సందర్భంగా మాజీ మంత్రులు వర్సెస్‌ మంత్రులుగా వ్యవహారం నడిచింది. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గవర్నర్‌ ప్రసంగంపై సెటైర్లు వేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి కోమటిెడ్డి వెంకట్ రెడ్డి అడ్డు పడి వాస్తవాలు మాట్లాడాలని జగదీష్‌రెడ్డికి సూచించారు. ఆ వెంటనే తలసాని జోక్యం చేసుకుని కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. సభలో సభ్యులందరికీ సమాన నిబంధనలు ఉంటాయని అన్నారు. ఈలోపు.. మంత్రి శ్రీధర్ బాబు - బీఆర్ఎస్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీధర్ బాబు ప్రసంగానికి బీఆర్‌ఎస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్ సభ్యులు వ్యంగంగా నవ్వారు కాబట్టే అధికారం కోల్పోయారని శ్రీధర్‌ బాబు సెటైర్లు వేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒకానొక తరుణంలో పరిస్థితి చేజారిపోతుండడంతో స్పీకర్‌ ప్రసాద్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను అవమానం ఇచ్చే విధంగా బీఆర్‌ఎస్‌ ప్రవర్తించవద్దు. స్పీకర్ తీరును సభ్యులు ప్రశ్నించొద్దు’’ అని స్పీకర్‌ ప్రసాద్‌ అనడంతో జగదీశ్‌ రెడ్డి లేచారు. స్పీకర్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ వ్యాఖ్యలను ఖండించిన జగదీశ్ రెడ్డి.. ‘‘మీరు ఈ సభకు పెద్ద మనిషి మాత్రమేనని, ఈ సభ అందరిదని, మీ ఒక్కరికే సొంతం కాదు’’ అని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు.జగదీష్ రెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. పోటీగా బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పొడియం దగ్గరగా వెళ్లారు. సభను ఆర్డర్‌లో పెట్టాలని, ప్రతిపక్ష పార్టీకి కనీస గౌరవం ఇవ్వరా? అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో.. దళిత స్పీకర్‌ను అవమానించిన జగదీష్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌కు దిగింది. ఈ ఆందోళనలతో సభ వేడెక్కగా.. కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ప్రకటించారు.

Court: State Vs A Nobody Movie Review In Telugu2
Court Movie Review: నాని ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్‌ పురుషోత్తమన్‌ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2023హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్‌’. ‘‘కోర్ట్‌’ నచ్చకపోతే నా ‘హిట్‌ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్‌ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్‌ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుఖలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త తేడా దుస్తులు ధరించిన సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబు చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపట్టాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్‌’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్‌ యూజ్‌ చేస్తున్నారు? ఇలాంటి పవర్‌ఫుల్‌ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఎం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్‌ జగదీష్‌.దర్శకుడు ఎంచుకున్న టాపిక్‌ చాలా సెన్సిబుల్‌. ఎక్కడ అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్‌ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్‌ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్‌ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్‌ దాము(హర్ష వర్ధన్‌) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అవన్ని అబద్దాలని తేలిపోతాయని తెలిసినా..తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఎమోషనల్‌ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌ లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదలను ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్‌ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్‌, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 Gudivada Amarnath Strong Counter To Vijayasai Reddy Kotary Comments3
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?

విశాఖపట్నం, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్‌సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్‌ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్‌సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్‌సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్‌(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇప్పటిదాకా కాలేదు. జగన్‌ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్‌ అన్నారు.

Mitchell Starc Comments After Team India Champions Trophy 2025 Victory4
ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ ఒక్కటే అలా చేయగలదు.. రాహుల్‌ను ఎంత పొగిడినా తక్కువే: స్టార్క్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజయానంతరం టీమిండియాపై ఆసీస్‌ స్పీడ్‌గన్‌ మిచెల్‌ స్టార్క్‌ ప్రశంసల వర్షం​ కురిపించాడు. వ్యక్తిగత కారణాల చేత ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్క్‌.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత క్రికెట్‌ను, టీమిండియా కీలక సభ్యుడు కేఎల్‌ రాహుల్‌ను ఆకాశానికెత్తాడు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం భారత్‌ ఒక్కటే ఒకే రోజు మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించగలదని అన్నాడు. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాపై.. వన్డేల్లో ఇంగ్లండ్‌పై.. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించినా భారత జట్లు గట్టి పోటీ ఇవ్వగలవని కితాబునిచ్చాడు. భారత్‌ మినహా ప్రపంచ క్రికెట్‌లో ఏ దేశానికి ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించే సత్తా లేదని కొనియాడాడు.కేఎల్‌ రాహుల్‌ను ఆకాశానికెత్తిన స్టార్క్‌మిచెల్‌ స్టార్క్‌ టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో రాహుల్‌ ప్రదర్శనలు అద్భుతమని కొనియాడాడు. టీమిండియాకు రాహుల్‌ మిస్టర్‌ ఫి​క్సిట్‌ లాంటి వాడని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం అతను ఏమైన చేయగలడని కొనియాడాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లో, ఆరో స్థానంలో, వికెట్‌ కీపింగ్‌ బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా.. ఇలా ఏ పాత్రలో అయినా రాహుల్‌ ఒదిగిపోగలడని కితాబిచ్చాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు రాహుల్‌ తన ఐదో స్థానాన్ని అక్షర్‌ పటేల్‌కు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతాలు చేశాడని అన్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా గెలుపుకు రాహుల్‌ ప్రధాన కారకుడని పేర్కొన్నాడు. రాహుల్‌ లాంటి మల్టీ టాలెంటెడ్‌ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మిచెల్‌ స్టార్క్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. స్టార్క్‌ను గతేడాది మెగా వేలంలో ఢిల్లీ రూ. 11.75 కోట్లు సొంతం చేసుకుంది. అంతకుముందు ఏడాది (2024) స్టార్క్‌ కేకేఆర్‌కు ఆడాడు. ఆ సీజన్‌ వేలంలో కేకేఆర్‌ స్టార్క్‌కు రికార్డు ధర (రూ. 24.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇది మూడో అ‍త్యధిక ధర. ఐపీఎల్‌లో అత్యధిక ధర పొందిన ఆటగాడి రికార్డు రిషబ్‌ పంత్‌ పేరిట ఉంది. పంత్‌ను ఈ సీజన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 27 కోట్లు చెల్లించి సొంతం​ చేసుకుంది. ఇదే సీజన్‌ వేలంలో ఐపీఎల్‌లో రెండో అత్యధిక ధర కూడా నమోదైంది. పంజాబ్‌ కింగ్స్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు రూ. 26.75 కోట్లు చెల్లించింది.ఐపీఎల్‌లో టాప్‌-5 పెయిడ్‌ ప్లేయర్స్‌రిషబ్‌ పంత్‌- 27 కోట్లు (లక్నో, 2025)శ్రేయస్‌ అయ్యర్‌- 26.75 కోట్లు (పంజాబ్‌, 2025)మిచెల్‌ స్టార్క్‌- 24.75 కోట్లు (కేకేఆర్‌, 2024)వెంకటేశ్‌ అయ్యర్‌- 23.75 కోట్లు (కేకేఆర్‌, 2025)పాట్‌ కమిన్స్‌- 20.50 కోట్లు (సన్‌రైజర్స్‌, 2024)2025 ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్‌ డుప్లెసిస్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, అషుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్‌, దర్శన్‌ నల్కండే, అజయ్‌ జాదవ్‌ మండల్‌, త్రిపురణ విజయ్‌, అక్షర్‌ పటేల్‌, మన్వంత్‌ కుమార్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అభిషేక్‌ పోరెల్‌, డొనొవన్‌ ఫెరియెరా, కేఎల్‌ రాహుల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దుష్మంత చమీరా, మిచెల్‌ స్టార్క్‌, మోహిత్‌ శర్మ, టి నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌

BJP MLA Raja Singh Sensational Comments on Party Leaders And Revanth5
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్‌ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్‌ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్‌ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్‌ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్‌ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్‌ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్‌గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు.

KSR Comment On CBN Lokesh Fear Over BJP Modi6
బాబుగారూ.. భయపడుతున్నారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చెప్పిన విషయాలు గమనించదగినవే. తన సీనియారిటీని కూడా పక్కనబెట్టి ఆయన ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవలి ఎన్నికలకు ఎలాగోలా కష్టపడి మోదీని, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభించింది. బీజేపీ వారి వద్ద భయం, భయంగా గడపాల్సిన పరిస్థితిలో బాబు ఉన్నారేమో అన్న అనుమానం రాజకీయ వర్గాలలో కలుగుతోంది. .. బీజేపీ అభ్యర్ధిగా ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడడం ఒక ఉదాహరణ. బీజేపీ సీనియర్‌ నాయకుడు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబుకు షాక్ వంటిదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను తానే నిర్ణయిస్తాననే దశ నుంచి.. తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వారి ఎంపికను మౌనంగా ఆమోదించే దుస్థితిలో చంద్రబాబు పడ్డారని సొంత పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ జుట్టు బీజేపీ చేతిలో ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందర్భం అయినా కాకపోయినా మోదీని పొగడడం, బీజేపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని పలువురు భావిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు పలుమార్లు బీజేపీని తీవ్రంగా విమర్శించారు. మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకోసం ఆయన ఎన్ని పాట్లు పడింది తెలుసు. 1996, 1998 లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తీవ్రంగా విమర్శించారు ఈయన. ఆ రోజుల్లో వామపక్షాలతో పొత్తులో ఉన్నారు. 1998 లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీకి సరిగ్గా 12 సీట్లు తక్కువ అవడం, బీజేపీ వారు ఈయన్ని సంప్రదించడం, వెంటనే కనీసం మిత్రపక్షాలతో కూడా చెప్పకుండా ఎగిరి గంతేసినట్లు మద్దతు ఇచ్చేశారు. దాంతో 1999లో లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడానికి అవకాశం వచ్చింది. ఇక.. కార్గిల్ యుద్ద వాతావరణం, వాజ్‌పేయిపై ఏర్పడిన సానుభూతి చంద్రబాబుకు కలిసి వచ్చాయి. 👉తదుపరి ఒక దశలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవడానికి సిద్దమైనట్లు కనిపించారు. గుజరాత్ మారణకాండ, మత హింసకు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు భావించారు. బీజేపీ నాయకత్వం మోదీని తప్పిస్తోందన్న సమాచారాన్ని నమ్మి ఆయనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మోదీని హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వనని హెచ్చరించారు. కానీ బీజేపీ తన వైఖరి మార్చుకునేసరికి ఈయన ఇరకాటంలో పడ్డారు. బీజేపీని వదలుకోవడానికి సిద్ద పడలేదు. పార్లమెంటులో ఓటింగ్ సమయానికి టీడీపీ ఎంపీలు లేకుండా వెళ్లిపోయారు. 2004లో బీజేపీతో కలిసి పోటీచేసినా ఓటమి చెందారు. ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని ప్రకటించారు. 👉కట్‌ చేస్తే.. 2009లో వామపక్షాలతోపాటు బీీఆర్‌ఎస్‌(అప్పటి టీఆర్‌ఎస్‌)తో పొత్తు పెట్టుకున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాంతో పంథా మార్చుకుని 2014 నాటికి మోదీకి దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆరోజుల్లో వైఎస్సార్‌సీపీతో పొత్తుకు బీజేపీ యత్నించినా, జగన్ ఒప్పుకోకపోవడం కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది. మొత్తం మీద కలిసి పోటీ చేయడం, జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా మద్దతుఇవ్వడం, అధికారంలోకి రావడం జరిగింది. 2018 నాటికి బీజేపీతో మళ్లీ విబేధించారు. 👉 2019 ఎన్నికలలో బీజేపీ గెలవకపోవచ్చని, మోదీ మళ్లీ ప్రధాని కారని నమ్మినట్లు చెబుతారు. దాంతో ఆయన బీజేపీపైన, మోడీపైన చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. మోదీని టెర్రరిస్టులతో పోల్చారు. వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ మోదీ భార్యను ఏలుకోలేని వాడని, ముస్లింలను బతకనివ్వడని ఇలా పలు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దాంతో ఏపీలో ఒంటరిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మోదీ తిరిగి ప్రధాని అవడంతో వెంటనే ప్లేట్ తిరగేశారు. బీజేపీకి దగ్గరవడానికి అన్ని వ్యూహాలు అమలు చేశారు. ముందుగా పవన్ కల్యాణ్‌ను ప్రయోగించారని అంటారు. 👉పవన్ తొలుత బీజేపీకి దగ్గరై, తదుపరి టీడీపీని కలపడానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు. బీజేపీతో టీడీపీని కలపడానికి తాను బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా ప్రకటించారు.ఈసారి కూడా వైసీపీతో స్నేహం చేయడానికి బీజేపీ ముందుకు వచ్చినా, జగన్ సిద్దపడలేదు.అది చంద్రబాబుకు కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అండ, ఎన్నికల కమిషన్ అనుకూల ధోరణి, సూపర్ సిక్స్ హామీలు తదితర కారణాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోదీని పొగుడుతున్న తీరు కాస్త ఆశ్చర్యం అనిపించినా, గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఇది మామూలే అని భావిస్తుంటారు. 👉ఒకప్పుడు తానే మోదీకన్నా సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నానని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే మోదీ వరసగా గెలుస్తూ వస్తూ అధికారం నిలబెట్టుకున్నారట. గతంలో సీబీఐ, ఈడి వంటి వాటిని మోదీ ప్రయోగిస్తున్నారని ఆరోపించే వారు. బహుశా దాని ద్వారానే మోదీ అధికారం నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం కలిగిందేమో తెలియదు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ఏపీలో పోలీసులతో వైసీపీ వారిపై అడ్డగోలు కేసులు పెట్టించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయి. మనం మంచి పనులు చేయడంతో పాటు ప్రజలకు సరిగా చెప్పాలని ఆయన అంటున్నారు. 1995 నుంచి చంద్రబాబు వాడుకుంటున్న విధంగా మీడియాను మరెవరైనా వాడుకోగలిగారా? అయినా తను ఓడిపోయినప్పుడు ప్రచారం సరిగా లేదని అంటున్నారు. చంద్రబాబు ప్రజలకు విపరీతమైన హామీలు ఇవ్వడంతో పాటు పొత్తుల వ్యూహాలలో సఫలం అయినప్పుడు గెలిచారు. హామీలు నెరవేర్చక ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడినప్పుడు ఓటమి చెందారు. కాకపోతే ఆ విషయం చెప్పరు. 2004, 2019లలో ఓటమికి ప్రచార లోపమే కారణం అంటున్న చంద్రబాబు 2009లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో చెప్పలేదు. 👉2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బాగా పనిచేయబట్టి,ఆయన ప్రజలకు బాగా చెప్పగలిగినందువల్లే గెలిచారని అనుకోవాలా? 2024లో జగన్ ఓటమికి కూడా అదే కారణం అని ఎందుకకు అనుకోరాదు? పైగా టీడీపీ జగన్ టైమ్ లో చెప్పినన్ని అబద్దాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేసిన అసత్య ప్రచారాలు, వదంతులు అన్ని చూస్తే అది ఒక ప్రపంచ రికార్డు అవుతుందేమో! ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఎగనామం పెట్టడం జరుగుతుంటున్నది సర్వత్రా ఉన్న భావన. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ తదితర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీకి బాగా అప్రతిష్ట వచ్చిందన్న సంగతి జనం మర్చిపోవాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. మోడీ వల్ల దేశం బాగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు తెలిపారు. మరి గతంలో అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడింది ఎప్పుడూ వివరణ కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. జనాభా నియంత్రణ వద్దని చెబుతూ ఏకంగా యూపీ, బీహారు రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని అనడం మరీ విడ్డూరంగా ఉంది. గతంలో ఆ రెండు రాష్ట్రాలు సరిగా పనిచేయక దేశానికి నష్టం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతోందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు. 👉కొత్త డిలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతున్నప్పటికి ఆయన ఆ మాట అనలేకపోతున్నారు. వైసీపీ సభ్యులొకరు కేంద్రంలో టీడీపీపైనే ప్రభుత్వం ఆధారపడినప్పటికీ అని ఆయా అంశాలు ప్రస్తావిస్తుండగా, లోకేష్ జోక్యం చేసుకుని అలా చెప్పవద్దని, తాము బేషరతుగా కేంద్రంలోని ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. లోకేష్ కూడా అలా మాట్లాడారంటే.. బీజేపీ అంటే వీరు భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్ని సంకేతాలు అవుతాయి. ఒకప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందనే విమర్శను పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పెద్ద ఎత్తున చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం వైఖరి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇస్తున్నదో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వాగ్దానాల అమలుకన్నా, ప్రత్యర్ధులను వేధించి, జైళ్లలో పెట్టి అధికారాన్ని కొనసాగించాలన్న లక్ష్యం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు మరింత అప్రతిష్ట పాలవుతారు తప్ప ప్రయోజనం ఉండదు. అధికారం అనే పొర కళ్లను వాళ్లను కప్పేసి ఉంటుంది కనుక ఆ హితోక్తి వారి చెవికి ఎక్కకపోవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Holi 2025 colourful celebrations in trendy and fashion outfit7
Holi 2025 : ఎపుడూ వైట్‌ డ్రెస్సేనా? కలర్‌ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!

హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్‌ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి కదా.. కాబట్టి కలర్‌ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్‌ కన్సెల్టెంట్‌ సుమన్‌ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్‌.. బ్లాక్‌ని సెంటరాఫ్‌ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్‌’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్‌ బ్లాకింగ్‌ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్‌ కలర్‌ కాంబినేషన్‌ స్టైల్‌. మామూలు వైట్‌ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్‌ కాంబినేషన్‌లతో లుక్‌కి ఎక్స్‌ట్రా గ్లామర్‌ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్‌ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్‌ కలర్స్‌ మిక్స్‌ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. కొన్ని కలర్‌ కాంబినేషన్స్‌.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్‌ కాంబినేషన్‌ చాలా కీలకం. పింక్‌–ఆరేంజ్‌ హోలీకి చాలా ఎనర్జిటిక్‌ కలర్‌ కాంబినేషన్‌ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్‌ వంటి బ్రైట్‌ షేడ్స్‌ ట్రెడిషనల్‌ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్‌ కూడా ట్రెండీ లుక్‌ అందిస్తాయి. వైట్‌–రేసింగ్‌ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్‌. పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్‌–కంఫర్ట్‌ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్‌ లేదా లినెన్‌ ఫ్యాబ్రిక్స్‌ ఎంచుకోవడం మంచిది. బ్రైట్‌ టాప్‌ + లైట్‌ బాటమ్‌ – లేదా ఆపోజిట్‌ కలర్‌ బ్లాక్‌ డ్రెస్సింగ్‌ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్‌ కుర్తాస్, ఫ్యూజన్‌ ధోతి ప్యాంట్స్‌ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్‌లో ఫుల్‌ ఫన్‌ కోసం బెస్ట్‌ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్‌ బెస్ట్‌. సన్‌గ్లాసెస్, వాటర్‌ ప్రూఫ్‌ మేకప్‌ – హోలీ ఎఫెక్ట్స్‌ స్టైలిష్‌గా హ్యాండిల్‌ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్‌ డ్రెస్సింగ్‌ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్‌ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్‌ ధరిస్తే అన్‌ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్‌ ధరిస్తే జారిపడే చాన్స్‌ ఎక్కువ. మేకప్, హెయిర్‌ ప్రొటెక్షన్‌ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్‌ టచ్‌.. ఈ హోలీలో బ్లాక్‌ కలర్‌తో మ్యాజిక్‌ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు.

Karnataka Ranya Rao gold case Update Over Investigation8
యూట్యూబ్‌ చూసి నేర్చుకున్నా: రన్యా రావు

బెంగళూరు: దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రావు బెయిల్‌ అర్జీపై తీర్పును బెంగళూరులోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక కోర్టు 14వ తేదీకి రిజర్వు చేసింది. ఇక రన్యా బంగారం దందాలో కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఈ కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో రన్యా రావు..‘దుబాయ్‌ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదు. స్మగ్లింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలన్నది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా’ అంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. అయితే, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో రన్యా రావు తండ్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.తరుణ్‌ మాస్టర్‌ మైండ్‌ దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయడం, తిరిగి రావడం ఎలా అనే అన్ని వివరాలను నటి రన్య స్నేహితుడు, పారిశ్రామికవేత్త కుమారుడు తరుణ్‌రాజు మార్గదర్శకం చేసినట్లు డీఆర్‌ఐ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పట్టుబడిన తరుణ్‌రాజును విచారిస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే రన్యాతో నిరంతరం సంప్రదించేవాడు. అతడు చెప్పినట్లు ఆమె నడుచుకునేది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే కొరియర్‌గా ఆమెను వాడుకున్నాడని డీఆర్‌ఐ భావిస్తోంది. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపారు. కొన్నేళ్లుగా రన్యారావుతో తరుణ్‌రాజు ఆత్మీయంగా ఉంటున్నాడు. అతనికి దుబాయ్‌లో కొందరు పారిశ్రామికవేత్తలు బాగా తెలుసు. భారీగా ధన సంపాదన ఆశతో బంగారం స్మగ్లింగ్‌లో నిమగ్నమయ్యాడు. అతనిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో రన్యా స్నేహితుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సమగ్ర విచారణ జరగాలి: మంత్రి లక్ష్మి నటి రన్యా రావు బంగారం కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ తెలిపారు. ఈ కేసులో ఓ ప్రముఖ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలపై బుధవారం విధానసౌధలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. గ్యారంటీ పథకాలను కమిటీల గొడవపై స్పందిస్తూ ఆ కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు అర్థం లేదన్నారు. తమ పథకాలను పోలిన స్కీములను అమలు చేసిన కొన్ని బీజేపీ ప్రభుత్వాలు రెండు నెలల తరువాత రద్దు చేశాయని ఆరోపించారు.

Today Gold and Silver Price 13th March 20259
హోలీకి ముందే.. అమాంతం పెరిగిన బంగారం రేటు

బంగారం ధరలు వరుసగా పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తోంది. రెండో రోజు (మార్చి 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 600 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,500 వద్ద నిలిచాయి. నిన్న రూ.450, రూ.490 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ.700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 550, రూ. 600 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,580 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 81,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,730 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 550, రూ. 600 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.1,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,1000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Russia Demands For Talks With US On Ukraine Deal10
అమెరికాకు పుతిన్‌ డిమాండ్స్‌.. రష్యాకు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌

వాష్టింగన్‌/మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన​్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో డీల్‌ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్‌కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వైట్‌హౌస్‌ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ మాత్రం కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

Advertisement

వీడియోలు

Advertisement