A1 Express Movie
-
A1 Express: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ ఆటగాడుగా నటించిన చిత్రం "ఏ1 ఎక్స్‌ప్రెస్". లావణ్య త్రిపాఠి హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో అలవోకగా హిట్లు కొట్టిన సందీప్‌కు ఈ మధ్య చేసిన ఏ సినిమాలు కూడా విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో నష్టాలను చవిచూడక తప్పలేదు. మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించింది. మే 1 నుంచి సన్ నెక్స్ట్ యాప్‌లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీంతో థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసే అవకాశం ఉంది. ఇదిలా వెంటు థియేటర్లో సరిగా ఆడని సినిమాలు ఓటీటీలో హిట్టు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనైనా సక్సెస్‌ను సాధిస్తుందేమో చూడాలంటున్నారు సినీ ప్రేమికులు. All set to watch the match? A1 express is premiering on May 1st on #SUNNXT Download the SUN NXT app and get ready to enjoy this blockbuster Telugu movie!@sundeepkishan #LavanyaTripathi @hiphoptamizha #DirectorDennisJeevanKanukolanu #A1ExpressOnSUNNXT #MoviesOnSUNNXT pic.twitter.com/AVb8SNYGoT — SUN NXT (@sunnxt) April 28, 2021 చదవండి: A1 Express Review: సందీప్ కిషన్ ‘స్పోర్ట్స్ డ్రామా’ -
నాకీ సినిమా జీవితాంతం గుర్తుంటుంది
‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ఇంటర్వెల్ బ్యాంగ్ రజనీకాంత్ గారి ‘బాషా’ స్థాయిలో ఉందని అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల స్పందన మాకొక ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త కంటెంట్‌తో సినిమాలు చేయవచ్చనే నమ్మకం పెరిగింది. మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు లాభాలతో హ్యాపీగా ఉన్నాం అని చెబుతున్నారు. జీవితాంతం నాకీ సినిమా గుర్తుంటుంది’’ అన్నారు. ‘‘నా ఫస్ట్ మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు డెన్నిస్ జీవన్. ‘‘మా సినిమా పంపిణీదారులందరూ ఫోన్ చేసి, ‘సేఫ్ అయ్యాం, సంతోషంగా ఉన్నాం’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఒక ప్రేక్షకుడిగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ లాంటి మంచి సినిమా చూసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు కోన వెంకట్. -
‘ఏ1 ఎక్స్ ప్రెస్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏ1 ఎక్స్ ప్రెస్ జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, రావు రమేష్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, సత్యా, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాతలు : టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను సంగీతం : హిప్ హాప్ తమిళ ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్ సినిమాటోగ్రఫీ : కెవిన్ రాజ్ విడుదల తేది : మార్చి 05, 2021 టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్ కొద్ది కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. చాలా కాలం తర్వాత ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో, ఆతర్వాత తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ చవిచూశాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్.. ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ట్రై చేయడం, సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ఆడియో కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? లావణ్య త్రిపాఠి గ్లామర్ ఈ సినిమాకు ఎంత వరకు తోడైంది? సందీప్ కిషన్ కెరీర్ లో 25వ చిత్రంగా వచ్చిన ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ యానాం షాట్స్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడ ఉన్న చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌కి ఒక చరిత్ర ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఏడాది కనీసం ఇద్దరైనా జాతీయ జట్టుకు ఎంపికవుతుంటారు. హాకీ కోచ్ మురళీ (మురళీ శర్మ) అక్కడి పేద క్రీడాకారులకు ఉచితంగా కోచింగ్ ఇస్తుంటారు. చిట్టిబాబు గ్రౌండ్ అంటే కోచ్ మురళితో పాటు అక్కడి ప్రజలకు కూడా గుడితో సమానం. అలాంటి గ్రౌండ్‌పై ఓ కంపెనీ కన్ను పడుతుంది. ఆ స్థలంలో మెడికల్ ల్యాబ్‌ని కట్టాలనుకుంటారు. ఇందుకోసం క్రీడాశాఖ మంత్రి రావు రమేశ్(రావు రమేశ్)కి లంచం ఇస్తారు కంపెనీ యజమానులు. దీంతో తన అధికారాన్ని ఉపయోగించిన మంత్రి ఆ క్లబ్‌ని అండర్ ఫర్ఫార్మింగ్ లిస్ట్‌లో వేస్తాడు. మరోవైపు.. నేషనల్ లెవల్ టోర్నమెంట్ గెలిస్తే.. తమ గ్రౌండ్ దక్కించుకోవచ్చని భావించిన కోచ్ మురళి.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. కట్ చేస్తే... హైదరాబాద్ నుంచి యానాం బంధువుల ఇంటికి వచ్చిన సందీప్(సందీప్ కిషన్) తొలి చూపులోనే హాకీ ప్లేయర్ లావణ్య(లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడిపోతాడు. ఆమెకు సహాయం చేసే క్రమంలో హాకీ ఆడతాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా హాకీ గేమ్‌ని అద్భుతంగా ఆడిన సందీప్‌ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. అతని ప్లాష్‌బ్యాక్ విని షాకవుతారు. అసలు సందీప్ ఎవరు? అతను హాకీ గేమ్‌ని అంత అద్భుతంగా ఎలా ఆడాడు? చిట్టిబాబు గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కోచ్ మరళికి సందీప్ ఎలా సహాయపడ్డాడు? చివరకి చిట్టిబాబు గ్రౌండ్ ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ. నటీనటులు నేషనల్ హాకీ ప్లేయర్ సందీప్ పాత్రలో సందీప్ కిషన్ ఒదిగిపోయాడు. ఈ పాత్ర కోసం సందీప్ కిషన్ పడ్డ కష్టం ప్రతీ సీన్లో కనిపిస్తుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా సందీప్ కిషన్ అవలీలగా నటించేశాడు. ఇక హాకీ క్రీడాకారిణిగా త్రిపాఠి తన పరిధి మేరకు ఆకట్టుకుంది. టామ్ బాయ్ రోల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తర్వాత బాగా పండిన పాత్ర మురళీ శర్మది. హాకీ కోచ్ పాత్రలొ ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఒక నిజాయతీగల కోచ్‌కు గేమ్‌పై, గ్రౌండ్‌పై ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమాలో మరళీ శర్మ పాత్ర తెలియజేస్తుంది. ఇక క్రీడాశాఖ మంత్రిగా రావు రమేశ్ జీవించేశాడు. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో, స్వార్థం కోసం ప్రజల మధ్య ఎలా చిచ్చు పెట్టిస్తారో కళ్లకుగట్టారు. హీరో స్నేహితులుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఆకట్టుకున్నారురు. నిడివి తక్కువే అయినా.. వీరిద్దరి పాత్రే సినిమాకు కీలకం. హీరో స్నేహితుడిగా సత్య తనదైన శైలిలో నవ్వించేశాడు. మహేశ్ విట్టా, పొసాని కృష్ణమురళి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్యం ఉన్న సినిమాలో తెలుగులో చాలానే వచ్చాయి. ఒక్కడు, సై తో పాటు ఇటీవల విడుదలయిన ‘చెక్’ సినిమా కూడా ఆ నేపథ్యంలో తెరకెక్కిందే. అయితే ఏ1 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఏంటంటే.. హాకీ క్రీడా నేపథ్యంలో సౌత్ ఇండియాలోనే వచ్చిన మొదటి సినిమా ఇది. తొలి సినిమాతోనే ఈ ప్రయోగం చేశాడు దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను. ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్ నుంచి అసలు కథని చూపించాడు. మన దేశంలో ఒక క్రీడాకారుడికి జరుగుతున్న అన్యాయంతో పాటు స్నేహం గొప్పతనాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకే సఫలం అయ్యాడని చెప్పొచ్చు. హీరో ప్లాష్‌బ్యాక్‌లో వచ్చిన సీన్లలో నాటకీయత ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే హీరో స్నేహితులులు హాకీ జట్టుకు ఎంపికకాకపోవడానికి చూపించిన కారణాలు కూడా అంత కన్విన్స్‌గా అనిపించవు. గేమ్ కంటే లోకల్ పాలిటిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన భావన కలుగుతుంది. ఇక ప్రత్యర్థి హాకీ టీం కోచ్ రోల్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండదు. అతని స్థానంలో ఒక ఫేమస్ నటుడిని తీసుకొని ఉంటే రెండు టీమ్స్ మధ్య జరిగే పోటీ సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా ఉండేవి. అయితే, సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది. సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ మర్చిపోయి హాకీ ఫైనల్ మ్యాచ్‌ని తిలకిస్తున్న భావన కలుగుతుంది. ఇక సినిమాకు ప్రధాన బలం హిప్ హాప్ తమిళ సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకుడికి ఉత్కంఠను పెంచుతాడు. కెవిన్ రాజ్ సినిమటోగ్రాఫి బాగుంది. గ్రౌండ్ విజివల్స్ సినిమాకే హైలెట్. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ సంగీతం సినిమా చివరి 20 నిమిషాలు మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్ రొటీన్ స్టోరీ ప్రత్యర్థి హాకీ టీం కోచ్ బలంగా లేకపోవడం - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమా చేయడం నా అదృష్టం
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద ్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్ , దయా పన్నెం నిర్మించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ నేడు రిలీజవుతోంది. సందీప్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశభక్తితో కూడిన స్పోర్ట్స్ సినిమాలను ఇండియన్స్ అందరూ చూస్తారు. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. వరంగల్‌లో ఉండే రాకేష్ అనే వ్యక్తి కొంతమందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ సరైన సౌకర్యాలు లేవు. వారికి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు సినిమా లాభాల్లో కొంత పిల్లల చదువు కోసం వినియోగిస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో మంచి ప్రయత్నం చేశాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
సక్సెస్ అయితేనే మాట్లాడతారు: సందీప్ కిషన్
‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత హాకీ క్రీడను ఎక్కువమంది ఇష్టపడతారా? అంటే అది నేను చెప్పలేను. ‘చెక్ దే’ సినిమా తర్వాత హాకీ గురించి, ‘ఒక్కడు’ సినిమా తర్వాత కబడ్డీ గురించి, ‘సై’ సినిమా సమయంలో రగ్బీ గురించి చెప్పుకున్నారు. కానీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా కొందరిలోనైనా ఓ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్ కిషన్ . డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా రూపొందిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు... ► నా కెరీర్లో 25వ చిత్రం ఇది. కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాను. కొత్త దర్శకుడు జీవన్ తో ఇలాంటి స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడం రిస్క్ అనిపించలేదు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. ► స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే ఎక్కువ కష్టపడాలి. ఈ సినిమా కోసం ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. హాకీ ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్ కోసం మ్యాచ్‌లు చూశాను. ► ఏ రంగంలోనైనా ప్రతిభకు, కష్టానికి ఒక్కోసారి విలువ, గుర్తింపు ఉండవు. సక్సెస్ అయితేనే మాట్లాడతారు. కానీ మన వంతుగా మనం వంద శాతం కష్టపడాలి. ప్రొడక్షన్స్ అనేది క్రియేటివ్ జాబ్. ప్రస్తుతం నా ప్రొడక్షన్ లో ‘వివాహ భోజనంబు’ సినిమా చేస్తున్నాం. ‘రౌడీ బేబీ’, మహేశ్ కోనేరు నిర్మాణంలో ఒక సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్లో మరో సినిమాలో పాత్రపోషణ చేస్తున్నాను. -
ప్రపంచం ఎదురుచూస్తోంది
‘‘తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా ఎదురు చూస్తున్నాం’ అని లాక్డౌన్ సమయంలో దుబాయ్‌కి చెందిన ఓ నిర్మాత అన్నారు.. అంటే మన తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రతి యాక్టర్‌కీ ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది. సందీప్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని హీరో రామ్ అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డెన్నిస్ జీవన్ మాట్లాడుతూ– ‘‘కథ వినగానే సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఎవరికీ అవకాశాలు రావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. ఆ టైమ్‌లో అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్లు... గొప్పవాళ్లు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ 25వ సినిమా మా బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. -
ఎ1 ఎక్స్‌ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
లిప్‌లాక్ సీన్‌కు ఓకే చెప్పిన లావణ్య?
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఉత్తరాది భామ లావణ్యా త్రిపాఠి. ఇప్పటి వరకు దాదాపు 16 చిత్రాల్లో నటించినప్పటికీ ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావేవి ఆమెకు పెద్దగా విజయాన్ని చేకూర్చలేదు. అయితే భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా ఈ భామ మంచి గుర్తింపు పొందింది. చివరగా నటించిన అర్జున్ సురవరం సినిమా కూడా కాస్తా పరవాలేదనిపించింది. ఇక ప్రస్తుతం లావణ్య ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా) విడుదలకు రెడీగా ఉన్నాయి. చదవండి: హాకీ ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో లావణ్యా త్రిపాఠి ఫిమేల్ లీడ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్లో.. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ కనిపిస్తున్నారు. అతడి ప్రేమికురాలిగా లావణ్య కూడా హాకీ ప్లేయర్ కావడం విశేషం. కాగా ఈ ట్రైలర్లో ఓ చోట లావణ్య.. సందీప్‌ను లిప్‌లాప్ చేస్తున్నట్లు దృశ్యం ఒకటి ఉంది. అయితే గ్లామర్ షో చేయడం నచ్చదని చెప్పే లావణ్య ఈ సారి తన హద్దులు చెరిపేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధపడిందా అని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి : ఆటగాళ్లకు కనీస గౌరవం లేదు: హీరో ఇప్పటికే గ్లామరస్ లుక్‌లో కనిపించిన లావణ్య.. ట్రైలర్లో లిప్‌లాక్ సీన్ లాంటి సన్నివేశం కనిపిస్తుండటంతో సిల్వర్ స్క్రీన్‌పై ఈ భామ నిజంగానే ముద్దు సీన్లో నటించిందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి లావణ్య తన పాత్ర కోసం హద్దులు చెరిపేసుకుందా..? లేదా? అనేది తెలియాలంటే సినిమాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. మరోవైపు కార్తికేయ హీరోగా నటిస్తోన్న చావు కబురు చల్లగా చిత్రంలో ఇలాంటి సీన్లు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక లావణ్య నటించిన ఏ 1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. -
ఆటగాళ్లకు కనీస గౌరవం లేదు: హీరో
హీరో సందీప్ కిషన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్. తెలుగులో హాకీ మీద వస్తున్న తొలి చిత్రమిదేనని హీరో గతంలోనే ప్రకటించగా ఇందులో 'సింగిల్ కింగులం' పాట యువతచెవుల్లో ఇప్పటికీ మోగుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. వందేమాతరం అన్న నినాదంతో మొదలైన ఈ ట్రైలర్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ ప్రపంచ హాకీ కప్ గెలిచిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ప్రభుత్వం హాకీని జాతీయ క్రీడగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక ఈ సారి కప్పు మనమే కొడుతున్నామని ట్రైలర్లో రావు రమేష్ ధీమాగా చెప్తున్నాడు. ఆ కప్పు కొట్టే సత్తా హీరోకు ఒక్కడికే ఉన్నట్లుగా అతడి ఎంట్రీ చూపించారు. (చదవండి: రవితేజ గురించి ఈ నిజాలు తెలుసా?) అయితే కప్పు మాత్రమే కాదు, తనకు తప్పనిపిస్తే మనుషులను కూడా కొడతానని నిరూపిస్తున్నాడు సందీప్ కిషన్. సింగిల్ కింగులం.. అని పాడిన హీరో లావణ్య త్రిపాఠి అంటే ఇంట్రస్ట్ లేదంటూనే ఆమెతో ముద్దుల్లో మునిగిపోయాడు. మరోవైపు ఆటగాళ్లకు ఈ దేశంలో కనీస గౌరవం లేకుండా పోయిందని బాధను వెళ్లగక్కుతూనే, స్పోర్ట్స్ ఎప్పుడో బిజినెస్‌గా మారిపోయిందన్న చేదునిజాన్ని చెప్పుకొచ్చాడు. ఎలాగైనా గెలవాలన్న కసి హీరోలో కనిపిస్తుండగా అతడిని ఓడించాలని చూస్తున్నట్లున్నాడు రావు రమేష్. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారో? సినిమా రిలీజైతే కానీ చెప్పలేం. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. హిప్హాప్ తమిజ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 12 రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం (చదవండి: ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?) -
ఏ1 ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టేదప్పుడే!
'ప్రస్థానం'తో వెండితెర మీద ప్రయాణాన్ని మొదలు పెట్టిన హీరో సందీప్ కిషన్. వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నా సరైన హిట్లు పడటం లేదు. దీంతో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదేనని ఆయన గతంలోనే ప్రకటించాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్లో ఎయిట్ ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని, మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించాడు హీరో. (చదవండి: 30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!) షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు సందీప్. కుదిరితే ఫిబ్రవరి 12వ తేదీని మార్క్ చేసుకోండి అంటూ అభిమానులకు హింట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్గా నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించారు. మరోవైపు రౌడీ బేబీ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. ఇందులో నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: తల్లిలా పెంచుకున్న.. పెళ్లి చేశా: వితిక భావోద్వేగం) Kudirithe Feb 12th kooda Mark chesukondi Bro 😉🤟🏽 https://t.co/lnuZsW2mhJ — Sundeep Kishan (@sundeepkishan) January 12, 2021 -
హాకీ ఎక్స్‌ప్రెస్
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్లో ఎయిట్ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించారు సందీప్. త్వరలో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతుందీ సినిమా. తెలుగు సినిమా పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న ఈ తొలి చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
బ్యాక్ టు వర్క్
కరోనా వల్ల ఇండస్ట్రీలో ఆరు నెలలుగా పని మొత్తం స్తంభించిపోయింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచి నటుడు, నిర్మాత సందీప్ కిషన్ కూడా పని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇందులో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా నటించనున్నారు. అలాగే ఆయన నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అవుతోంది. ఈ చిత్రం ముహూర్తం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్ అన్నీ పాటిస్తూ ఈ సినిమాల చిత్రీకరణలను జరపనున్నారు. -
టార్గెట్ 15
ఈ లాక్డౌన్ సమయంలో హీరో సందీప్ కిషన్ దాదాపు 12 కేజీల బరువు తగ్గారు. కారణం తన తాజా చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ కోసమే. సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు సందీప్ కిషన్. లావణ్యా త్రిపాఠి హీరోయిన్. హ్యాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా స్క్రీన్‌పై ఫిట్‌గా కనిపించేందుకు సందీప్ 15 కేజీల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నారట. ప్రస్తుతానికి 12 కేజీల బరువు తగ్గారు. మిగతా 3 కిలోలు తగ్గే పనిలో ఉన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతదర్శకుడు. -
తండ్రికి స్టైలీష్ హెయిర్ కట్ చేసిన హీరో
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ ఉండటంతో జనం పలు రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కటింగ్, షేవింగ్ చేసుకోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఆ మాటకొస్తే ఇదో ప్రధాన సమస్యగా మారింది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఈ సమస్య కొనసాగుతూ ఉంది. అయితే స్వయంగా హెయిర్ కట్ చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం అని పలువురు సెలబ్రెటీలు పేర్కొంటున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీకి తన హార్ట్ బీట్ అనుష్క హెయిర్ కట్ చేయగా, సచిన్ టెండూల్కర్ స్వయంగా కటింగ్ చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన తండ్రికి సోదరితో కలిసి స్వయంగా హెయిర్ కట్ చేశాడు. తన తండ్రిని స్టైలీష్ లుక్‌లోకి మార్చి అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సందీప్ సరదాగా గడుపుతున్నాడు. గత రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సందీప్ లాక్ డౌన్ సడలించి షూటింగ్స్ కు అనుమతిస్తే తన ఎ1 ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నాడు. చదవండి: ‘సమరసింహారెడ్డి’ మళ్లీ రిపీట్ అవుతుందా? అదిరేటి లుక్‌లో మహేశ్.. సినిమా కోసమేనా? -
సింగిల్ కింగులం..
హాకీ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కుతోన్న తొలి చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిష¯Œ , దయా పన్నెం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సామ్రాట్ సాహిత్యం అందించగా హిప్ హాప్ తమిళ స్వరపరచిన ఈ చిత్రంలోని తొలి పాట ‘సింగిల్ కింగులం..’ని యూ ట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకి శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ‘‘న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కలసి ఆడి పాడిన ‘సింగిల్ కింగులం..’ పాట ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కవిన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్ సింఘానియా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల.