ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా గ్రూప్
ఎంఎంఐతో కలసి జాయింట్ వెంచర్‌గా ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సేవల రంగంలో పేరొందిన ఆదిత్యా బిర్లా గ్రూప్.. తొలిసారిగా ఆరోగ్య బీమా రంగంలోకి ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ (ఏబీహెచ్‌ఐసీఎల్) బ్రాండ్ పేరిట మార్కెట్లోకి ప్రవేశించింది. ఆదిత్యా బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ ఎంఎంఐ హోల్డింగ్స్‌తో కలసి 51:49 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్యబీమా రంగంలోకి ప్రవేశించినట్లు ఏబీహెచ్‌ఐసీఎల్ సీఈఓ మయాంక్ భత్వాల్ గురువారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం రెండు గ్రూపుల్లో 4 రకాల పాలసీలు, ఒక రిటైల్ పాలసీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 150 నగరాల్లోని 1,500 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఆరోగ్య బీమా పరిశ్రమ 3.5 బిలియన్ డాలర్లుగా ఉందని, పాలసీలు తీసుకునే వారు మాత్రం 5 శాతం లోపే ఉన్నారని తెలిపారు. బీమా పాలసీ మీద సరైన అవగాహనలేమి, ప్రభుత్వ ప్రోత్సాహం తక్కువగా ఉండటమే ఇందుకు కారణాలని అభిప్రాయపడ్డారు. దీన్నే వ్యాపార సూత్రంగా మార్చుకునేందుకు ‘హెల్త్ ఫస్ట్’ పేరిట ఆరోగ్య బీమాపై విస్తృతస్థాయిలో ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అజయ్ కక్కర్ పాల్గొన్నారు.