AC College
-
అంతర్‌వర్సిటీ బాస్కెట్‌బాల్ విజేత ఏసీ కళాశాల
ఏఎన్‌యూ: యూనివర్సిటీ క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన అంతర్ కళాశాలల బాస్కెట్‌బాల్ పురుషుల పోటీలు గురువారంతో ముగిశాయి. ఫైనల్లో తలపడిన ఏసీ కళాశాల, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానాన్ని జేకేసీ కళాశాల జట్టు కైవసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్ ము అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఏఎన్‌యూకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి, యోగా కోర్సు కో-ఆర్డినేటర్ డి. సూర్యనారాయణ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్సన్, తదితరులు పాల్గొన్నారు. సౌత్‌జోన్ పోటీలకు ఏఎన్‌యూ జట్టు ఎంపిక సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే ఏఎన్‌యూ జట్టును ఎంపిక చేశారు. ఎ.కిషోర్, ఎం.రత్నకుమార్, ఎ.ఆనందకుమార్, ఎస్.కె.మసూద్ (ఏసీ కళాశాల), వి.ఉదయ్, డి.సత్యనారాయణ, పి.శివప్రసాద్ (ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల), ఎల్.బ్రహ్మారెడ్డి, ఎ.పవన్‌కుమార్ (జేకేసీ కళాశాల), ఎం.తేజశ్వి (ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల), ఎ.ఫ్రాంక్లిన్ (ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల), బి.అవినాష్ (ఏఎన్‌యూ ఆర్ట్స్ కళాశాల) జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. -
విద్యార్థులకు కొలకలూరి ఇనాక్ స్ఫూర్తి
గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాలలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల యాజమాన్యం, విద్యార్థులు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం మాట్లాడుతూ కొలకలూరి ఇనాక్ ఏసీ కళాశాలలో విద్యనభ్యసించి, అధ్యాపకునిగా పనిచేసి అంచలంచెలుగా ఎదగడం తమకు గర్వకారణ మన్నారు. ఇనాక్ కళాశాల ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేసారని కొనియాడారు. ఆయనను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఉన్నతమైన ఆలోచనలతో విద్యార్థులు అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రిన్సిపాల్ ఇమాన్యుయేల్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్, తెలుగు అధ్యాపకులు, కళాశాల పీఆర్వో కనపాల జోసఫ్, వి.జి దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీ కళాశాల అధ్యాపకుల నిరవధిక దీక్ష
గుంటూరు ఈస్ట్ : ఏసీ కళాశాలలో పని చేస్తున్న అన్ఎయిడెడ్ అధ్యాపకులకు వెంటనే జీతాలు చెల్లించాలని అన్ఎయిడెడ్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారా అంబేడ్కర్ డిమాండు చేశారు. కళాశాల మెయిన్ గేటు వెలుపల అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ శుక్రవారం నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా దారా అంబేడ్కర్ మాట్లాడుతూ 30 మంది అన్ఎయిడెడ్ అధ్యాపకులకు ఏఈఎల్సీ యాజమాన్యం 30 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. రూ.3,500 జీతంతో పనిచేస్తున్న అధ్యాపకులంతా భవిష్యత్తులో రెగ్యులర్ అవుతుందన్న ఆశతో అప్పుల పాలవుతున్నా ఉద్యోగాలు చేస్తున్నారని వివరించారు. కనీసం ఆ జీతం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.15 వేలుగా నిర్ణయించి జీతాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వేణు ప్రకాశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకటరత్నం, కనపాల జోసఫ్ ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భగత్ సింగ్, నగర కన్వీనర్ తూమాటి ఇర్మియేల్, ఎం.సిరిల్ కుమార్, తూమాటి మోజస్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పీజీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్, యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2014-15 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు ఏసీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు పరిశీలించారు. ఏర్పాట్లపై పీజీ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ జి.రోశయ్యను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు ఇంగ్లిష్ సబ్జెక్టుకు 183 మంది, హిందీ 26 , తెలుగు 109 మంది, సోషియాలజీ అండ్ సోషల్‌వర్క్ సబ్జెక్టుకు 534 మంది హాజరయ్యారని అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ రోశయ్య తెలిపారు.