కడిగేసిన కాగ్
ఆస్పత్రి అభివృద్ధి కమిటీల పనితీరుపై ఆగ్రహం
ఖాతాల నిర్వహణ తీరుపై అభ్యంతరం
అర్హత లేని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించారంటూ చురక
సిటీబ్యూరో: ఆస్పత్రుల అభివృద్ధి కమిటీల పనితీరుపై కాగ్(కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి మూడునెలలకు ఒకసారి కమిటీల సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం ఆరునెలలైనా సమావేశాల ఊసెత్తడం లేదని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వ నిజామియా జనరల్ (యునాని)ఆస్పత్రి హెచ్డీసీ ఖాతాలో ల క్షల నిధులు మగ్గిపోతున్నట్లు తెలిపింది. దీనికితోడు ప్రతిష్టాత్మకమైన గాంధీ, ఉస్మానియా తదితర బోధనాస్పత్రుల్లోనూ ఖాతాల నిర్వహణ సక్రమంగా లేదని, ఇప్పటి వరకు చార్టెర్డ్ అకౌంటెంట్తో ఆడిట్ చేయించక పోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈఎమ్డీ, ఎస్డీ రిజిస్ట్రర్ సరిగా నిర్వహించక పోగా అర్హత లేని వ్యక్తికి రూ.10 లక్షల ఈఎమ్డీ చెల్లించినట్లు పేర్కొంది.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కాక్లీయర్ ఇంప్లాంట్ సర్జరీల కోసం కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టినట్లు స్పష్టం చేసింది. తొమ్మిది మంది ఏవీ థెరపీ కోసం దరఖాస్తు చేసుకోగా, ట్రస్ట్ నుంచి రూ .5.80 లక్షలు డ్రా చేసుకున్నప్పటికీ లబ్దిదార్ల పేర్లు ఏవీ థెరపీకి సంబంధించిన హాజరు పట్టికలో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారతీయ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం నెలకు 20 కన్నా ఎక్కువ ప్రసవాలు జరిగే పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యాధికారులు, నలుగురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా, నగరంలోని ఆరోగ్య కేంద్రాల్లో 88 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది.
నగరంలో రక్తనిధి కేంద్రాల నిర్వహణపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రక్తం సేకరణ, నిల్వ, సరఫరాలో సరైన ప్రమాణాలు పాటించడం లేదన్నారు. రక్త నిల్వలపై సెంట్రల్ ఆన్లైన్ డేటాబేస్ను ఏర్పాటు చేయాలని 2011లోనే సూచించినా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.