‘సాక్షి’ పాట.. రికార్డు బాట...
ఈ పాటకు ట్యూన్ తెలుసా?’ కలెక్షన్‌తో విశాఖ వాసి అరుదైన ఘనత
విశాఖ సిటీ: కొంత మంది పాటలు పాడుతూ రికార్డులు సొంతం చేసుకుంటారు. మరికొందరు ఆ పాటకు నిరంతరాయంగా నృత్యం చేస్తూ రికార్డు సాధిస్తారు. కానీ విశాఖ వాసి మాత్రం ‘సాక్షి’ పత్రికలో ‘ఈ పాటకు ట్యూన్ తెలుసా?’ పేరుతో ప్రచురించిన పాటల క్లిప్పింగ్స్ సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అక్కయ్యపాలెంలోని పురుషోత్తపురంలో నివసిస్తున్న ఉద్ధగిరి అచ్యుత్ కృష్ణకుమార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
పాటలంటే ప్రాణం. సాహిత్యంపై ఉన్న మక్కువ అచ్యుత్‌ని పాటలకు దగ్గర చేసింది. ఇదే తరుణంలో.. 2008 మే 5 నుంచి ‘సాక్షి’ దినపత్రిక ఫ్యామిలీ పేజీలో ఈ పాటకు ట్యూన్ తెలుసా..? అనే శీర్షికన వివిధ చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటల్ని పాఠకులకు పరిచయం చేసింది. వాటిని ప్రతి రోజూ కత్తిరించి పదిలపరచుకునేవాడు. ఈ కలెక్షన్ సంఖ్య 2016 సెప్టెంబర్ 30 నాటికి 2,669 పాటలయ్యాయి. వాటిని సీడీ రూపంలోకి తీసుకొచ్చిన అచ్యుత్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సుకు పంపించాడు. ఆ ఆ ప్రతినిధులు దీనికి తమ రికార్డుల్లో స్థానం కల్పించారు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్తో పాటు మెమొంటో, గుర్తింపు కార్డు, ఇతర పత్రాల్ని అచ్యుత్‌కి ఇటీవలే పోస్టులో పంపించారు.