ACI
-
డిజిటల్ లావాదేవీల జోరు!!
ముంబై: రాబోయే రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయి. 2025 నాటికి దేశీయంగా వివిధ సాధనాల ద్వారా జరిగే మొత్తం చెల్లింపు లావాదేవీల్లో వీటి వాటా 71.7 శాతానికి చేరనుంది. నగదు, చెక్కులతో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయాల వాటా 28.3 శాతానికి పరిమితం కానుంది. పేమెంట్ సేవల సంస్థ ఏసీఐ వరల్డ్‌వైడ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020లో 2,550 కోట్ల రియల్ టైమ్ పేమెంట్స్ లావాదేవీలతో చైనాను భారత్ అధిగమించింది. చైనాలో ఈ తరహా లావాదేవీల సంఖ్య 1,570 కోట్లకు పరిమితమైంది. ఇక గతేడాది మొత్తం చెల్లింపుల్లో ఇన్స్టంట్ పేమెంట్స్ వాటా 15.6 శాతంగాను, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 22.9 శాతంగాను ఉండగా.. పేపర్ ఆధారిత చెల్లింపుల విధానాల వాటా 61.4 శాతంగా నమోదైంది. 2025 నాటికి ఇది పూర్తిగా మారిపోనుందని నివేదిక తెలిపింది. అప్పటికి ఇన్స్టంట్ పేమెంట్స్ వాటా 37.1 శాతం, ఎలక్ట్రానిక్ చెల్లింపుల వాటా 34.6 శాతానికి చేరుతుందని, నగదు ఇతరత్రా పేపర్ ఆధారిత చెల్లింపు విధానాల వాటా 28.3 శాతానికి తగ్గుతుందని వివరించింది. అన్ని వర్గాల మధ్య సమన్వయం.. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యం దిశగా భారత్ వేగంగా ముందుకు సాగేందుకు .. ప్రభుత్వం, నియంత్రణ సంస్థ, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు వంటి అన్ని వర్గాల మధ్య సమన్వయం తోడ్పడుతోందని ఏసీఐ వరల్డ్‌వైడ్ వైస్–ప్రెసిడెంట్ కౌశిక్ రాయ్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వినియోగదారులు, వ్యాపార విధానాలు మారే కొద్దీ పేమెంట్స్ వ్యవస్థలోని బ్యాంకులు, వ్యాపారులు, మధ్యవర్తిత్వ సంస్థలు కూడా తదనుగుణమైన మార్పులు, చేర్పులను వేగంగా చేపడుతున్నాయని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం 2020లో రియల్ టైమ్ లావాదేవీల నిర్వహణలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, బ్రిటన్ టాప్–5 దేశాల జాబితాలో నిల్చాయి. గతేడాది మొబైల్ వాలెట్ల వినియోగం చారిత్రక గరిష్ట స్థాయి 46 శాతానికి ఎగిసింది. 2018లో ఇది 19 శాతంగాను, 2019లో 40.6 శాతంగాను నమోదైంది. ఎక్కువగా నగదు లావాదేవీలకు ప్రాధాన్యమిచ్చే బ్రెజిల్, మెక్సికో, మలేసియా తదితర దేశాల ప్రజలు వేగంగా మొబైల్ వాలెట్ల వైపు మళ్లినట్లు నివేదిక తెలిపింది. -
రికార్డు బ్రేక్ చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల టాప్ 20 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. ఆరు స్థానాలు పైకి ఎగిసిన ఈ ఎయిర్‌పోర్టు, 2017 జాబితాలో టాప్ 20లోకి చేరింది. జీఎంఆర్ గ్రూప్ నడిపే ఈ ఢిల్లీ విమానాశ్రయం 2016లో 22వ ర్యాంకును సాధించగా.. 2017లో 16వ ర్యాంకును సాధించినట్టు ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్(ఏసీఐ) ప్రకటించింది. ప్రయాణికుల రద్దీలో ఈ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా ఉందని పేర్కొంది. ఈ ర్యాంకింగ్‌లను 2017లో అత్యంత ఎక్కువగా ప్రయాణించిన ఎయిర్‌పోర్ట్‌ల ప్రిలిమినరీ ప్యాసెంజర్ ట్రాఫిక్ ఫలితాలను బట్టి ఏసీఐ విడుదల చేసింది. ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో ఏడాది ఏడాదికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ 14.1 శాతం వృద్ధిని నమోదుచేసిందని తెలిపింది. ప్రస్తుతం 63.45 మిలియన్ల ప్యాసెంజర్ ట్రాఫిక్‌ను(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) ఈ ఎయిర్‌పోర్టు కలిగి ఉన్నట్టు పేర్కొంది. ఢిల్లీ మాత్రమే కాక కోల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు కూడా ప్రపంచంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టులుగా ఉన్నాయని ఏసీఐ తెలిపింది. కాగ, ఏసీఐ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్‌లో తొలి స్థానంలో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. 103 మిలియన్ ప్యాసెంజర్లతో(బయలుదేరడం, చేరుకోవడం రెండింట్లో) అగ్ర స్థానంలో ఉంది. 2016 కంటే 0.3 శాతం ట్రాఫిక్ వాల్యుమ్ తగ్గినప్పటికీ, ప్యాసెంజర్ ట్రాఫిక్‌లో ఇదే ముందంజలో ఉండటం విశేషం. ప్రపంచంలోని ఎయిర్‌పోర్టులకు ఏసీఐ ట్రేడ్ అసోసియేషన్. ప్రస్తుతం 176 దేశాల్లో 1953 ఎయిర్‌పోర్టుల నుంచి 641 మెంబర్లను ఇది కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత రద్దీ గల ఎయిర్‌పోర్టుల ర్యాంకులతో పాటు, అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఏయే దేశాలు ఉండబోతున్నాయో ఏసీఐ అంచనాలు వెలువరిచింది. 2020 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఉండబోతుందని ఏసీఐ అంచనావేస్తోంది. -
జీఎంఆర్ అకాడమీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు
హైదరాబాద్: ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) నుంచి జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఆర్టీసీఈ) గుర్తింపు దక్కింది. భారత్‌లో జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీకి మాత్రమే ఈ గుర్తింపు లభించినట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ 3-6 నెలల సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను, ఐసీఏఓ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ), ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వంటి తదితర అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉంది. ఏవియేషన్ రంగంలో, దానికి సంబంధించిన ఇతర రంగాలలో ప్రొఫెషనల్స్‌ను తయారుచేయటమే తమ అకాడమీ లక్ష్యమని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్‌పోర్ట్స్) శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. -
ఉత్తమ విమానాశ్రయాల్లో శంషాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో ప్రపంచంలో మూడో ర్యాంకును దక్కించుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) నుంచి 2014 సంవత్సరానికిగాను ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డును పొందింది. 5-15 మిలియన్ ప్రయాణికుల విభాగంలో గత ఆరేళ్లుగా టాప్-3 ర్యాంకుల్లో శంషాబాద్ విమానాశ్రయం నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా 300 విమానాశ్రయాల్లో నాణ్యమైన సేవల విషయంలో 34 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఏసీఐ ర్యాంకులను ప్రకటిస్తోంది.