addakonda
-
అడ్డకొండపై పురాతన సమాధులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చంద్రగిరి సమీపంలోని తాటికోనలో కీ.పూ 1000ఏళ్ల నాటి ఇనుప యుగపు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. గ్రామంలోని అడ్డకొండపై పురాతన సమాధులను పురావస్తుశాఖ గుర్తించింది. మొత్తం ఐదు సమాధుల్లో నాలుగు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా ఒకటి చెక్కుచెదరకుండా నిలిచిఉంది. ఆనవాళ్లను పరిరక్షించాలి చంద్రగిరి పరిసరాలల్లో ఇనుపయుగపు ఆనవాళ్లు అంతరించిపోతున్నాయని పురవాస్తు పరిశోధకుడు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీ భక్తి చానల్ సీనియర్ ప్రొడ్యూసర్ బీవీ రమణ అందించిన సమాచారం మేరకు ఆదివారం ఆయన తాటికోన పరిసరాలల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఇనుపయుగపు సమాధుల ఆనవాళ్లలో ఒకటి ఇప్పటికీ నిలిచి ఉందని వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణం రొంపిచెర్ల : మండలంలోని పెద్దమల్లెలలో ఉన్న మాధవరాయస్వామి ఆలయాన్ని రూ.1.50 కోట్లతో పునర్నిర్మిస్తామని శివనాగిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇందుకోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. -
కొండ దిగని గజరాజు
– నాలుగో రోజూ ఆపరేషన్ గజ విఫలం రామసముద్రం: అడ్డకొండ నుంచి గజరాజును కిందకు దించేందుకు చేపట్టిన ఆపరేషన్ గజ నాలుగో రోజు గురువారం కూడా విఫలమైంది. దీంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏనుగుకు ఇష్టమైన చెరకు గడలు, అనాస పండ్లు, అరటికొమ్మలను అధికారులు అక్కడక్కడా వేశారు. బుధవారం రాత్రి కొండ ప్రాంతంలో వర్షం కురవడంతో ఏనుగు కొండలోనే ఉండిపోయింది. శిక్షణ పొందిన ఏనుగులైన జయంత్, వినాయక్ను కొండకు అటు ఇటు తిప్పుతున్నారు. అదేవిధంగా ట్రాకర్స్ ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఎలాగైనా ఏనుగును కొండ దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అడ్డకొండలోనే గజరాజు
–మూడో రోజూ విఫలమైన ఆపరేషన్ గజ –గజరాజును పట్టేందుకు కొండపైకి చెరుకులు, పైనాఫిల్, అరటికొమ్మలు రామసముద్రం: కర్ణాటక రాష్ట్రం కారంగి అడవి నుంచి మండలంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న ఒంటరి ఏనుగును పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ గజ బుధవారం కూడా విఫలమైంది. ఏనుగు అడ్డకొండలో తిష్టవేసింది. దాన్ని కొండ దింపేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. ఇదిలా ఉండగా ఏనుగు బుధవారం తెల్లవారుజామున అడ్డకొండకు పడమర వైపున ఉన్న మనేవారిపల్లె సమీపంలోకి దిగి వచ్చింది. వరి, రాగి పంటను తినేసి బంతి పూల తోటలో కొంతసేపు సేదతీరింది. కుక్కలు గమనించి చుట్టుముట్టడంతో తిరిగి కొండపైకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ట్రాకర్స్ను, కొంతమంది స్థానికులను కొండపైకి పంపించారు. వారిని ఏనుగు ముప్పుతిప్పలు పెట్టడంతో పరుగులు తీశారు. చెరుకులు, అరటి కొమ్మలు, అనాస పండ్లు గజరాజును కిందకు దించేందుకు దారి పొడవునా చెరుకులు, అరటి కొమ్మలు, అనాస పండ్లను ఉంచుతున్నారు. వాటిని తింటూ కిందకి వస్తుందని డీఎఫ్వో చక్రపాణి తెలిపారు. తద్వారా దాన్ని పట్టుకునేందుకు శిక్షణ పొందిన మగ ఏనుగులను మనేవారిపల్లె సమీపంలోనే ఉంచామని పేర్కొన్నారు.