లొంగిపోవాలని చెబితే.. మాపై కాల్పులు!
లక్నో: ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో ఆ ఇంట్లో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారని, అయితే ఐసిస్ తో వీరికి లింక్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని లా అండ్ ఆర్డర్ ఏడీజీ దల్జీత్ చౌదరీ తెలిపారు. ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. నిందితుడు సైఫుల్లా ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై సమచారం అందుకున్న తమ టీమ్ అక్కడికి చేరుకుని.. లొంగిపోవాలని నిందితులకు ఎంత చెప్పినా వినిపించుకోలేదన్నారు. సైఫుల్లా సోదరుడు ఖలీద్ ఫోన్లో ఏడుస్తూ బతిమాలిడినప్పటికీ అతడి మనసు కరగలేదు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు.
సుదీర్ఘంగా ఎదురు కాల్పులు జరిగిన తర్వాత.. తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో అవతలి నుంచి కాల్పులు ఆగిపోయాయని, ఇంట్లోకి వెళ్లి చూడగా సైఫుల్లా మృతదేహం కనిపించిందని, ఇతర నిందితులు పరారయ్యారని ఏడీజీ వెల్లడించారు. పోలీసులు తొలుత టియర్‌గ్యాస్, చిల్లీ పౌడర్ మిక్స్డ్ బాంబులు తదితరమైన ప్రయోగాలు చేశారని, చివరగా ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చిందన్నారు.
ఎన్ కౌంటర్ జరిగిన ఇంట్లో 650 రౌండ్ల బుల్లెట్లు, 8 గన్స్, 45 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 3 పాస్ పోర్టులు, 4 కత్తులు, సెల్ ఫోన్లు, టైమర్లు, వైర్లు, బాంబు తయారీ సామాగ్రిని సీజ్ చేసినట్లు దల్జీత్ చౌదరీ వివరించారు. మరణించిన ఉగ్రవాది సైఫుల్లాకు ఉజ్జయిని ప్యాసింజర్ రైలు పేలుడుతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.