‘భవనాలు నిర్మించగానే సరిపోదు.. గిరిజన బిడ్డల సమస్యలు తీరాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ. 50 కోట్ల చొప్పున వ్యయంతో ప్రభుత్వం రెండు భవనాలను నిర్మించింది. కాగా, బంజారా భవన్కు సంత్ సేవా లాల్ పేరును అలాగే, ఆదివాసీ భవన్కు కొమరం భీమ్ పేర్లను పెట్టారు.
ఈ రెండు భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ గిరిజన బిడ్డలందరికీ అభినందనలు. భవనాలు నిర్మించగానే సరిపోదు.. గిరిజన బిడ్డల సమస్యలు తీరాల్సిన అవసరం ఉంది. గిరిజన బిడ్డల విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వారి చదువుల విషయంలో, విదేశాలకు వెళ్లే విషయంలో, గిరిజన పోడు భూముల విషయంలోగానీ, రక్షణ విషయంలో గానీ.. ప్రభుత్వం సహకరిస్తోంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాల్సిన అవసరముంది. ఈ భవనం తెలంగాణ గిరిజన బిడ్డల హక్కుల పరిరక్షణకు వేదిక కావాలి. వారి సమస్యల పరిరక్షణకు మార్గం కావాలి. ఆదివాసీ మేధావి వర్గం ఒక్కటై.. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.