నేనూ మీ వాడినే
పార్వతీపురం:
ఐటీడీఏలో పీఓగా అడుగుపెట్టిన క్షణం నుంచి తాను కూడా మీ వాడిగానే మారిపోయానని ఐటీడీఏ పీఓ వి.ప్రసన్న వెంకటేష్ గిరిజన సంఘాల నాయకులతో అన్నారు. ఆదివారం ఆయన సబ్-ప్లాన్‌లోని గిరిజన సంఘాలతో సమావేశమయ్యారు. ఆగస్టు 9న నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లపై వారితో చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్పందన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించారని, దానికి మల్లే నిర్వహించేందుకు ఏం చేయాలని ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా ఆయా సంఘాల ప్రతనిధులు మాట్లాడుతూ స్పందన పెద్ద కార్యక్రమమని, అటువంటిది ఇప్పుడు నిర్వహించలేమన్నారు. అయితే గిరిజన సంప్రదాయ, సంస్కృతి కార్యక్రమాలతోపాటు వారి వారి ఆహారపు అలవాట్లు, దేవతలు, ఆహారం తయారీ, బతుకు చిత్రాలు తదితర వాటిని తెలియజేసే స్టాల్స్‌తో పాటు ఆయా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ కేవలం గిరిజనులు తప్ప రాజకీయ నాయకులకు వేడుకలో తావివ్వరాదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఐటీడీఏ కార్యక్రమాలన్నీ దాదాపు రాజకీయ నాయకులు, గిరిజనేతరులే జరుపుకొన్నారని ఆవేదన వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య సేవా సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం, ఆదివాసీ ఐక్య వేదిక, గిరిజన ఐక్య వేదిక, దీనబంధు యువజన సంఘం, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం తదితర సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.