ఆటపాకను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం
– నూతన ఫారెస్టు ఏసీఎఫ్ రామచంద్రరావు
ఆటపాక (కైకలూరు) : విదేశీ పక్షి జాతుల ఆవాసాలకు నిలయంగా పేరొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అటవీశాఖ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (ఏసీఎఫ్) ఎన్.రామచంద్రరావు చెప్పారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన ఏసీఎఫ్ వినోద్‌కుమార్ విశాఖపట్నం జిల్లా చింతపల్లి ఫారెస్టుకు వెళ్లారు. అక్కడ పనిచేసిన రామచంద్రరావు కొల్లేరులో విధులు చేపట్టారు. ఈ సందర్భంగా రేంజర్ శ్రావణ్‌కుమార్‌తో కలిసి సోమవారం ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దశల వారీగా పక్షుల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కొల్లేరు వెబ్‌సైట్‌ను త్వరలో యాత్రికులకు అందుబాటులోకి తెస్తామని, చెరువులో పక్షుల ఆహారం కోసం చేపపిల్లలను విడుదల చేస్తామన్నారు. అలాగే, పర్యాటకులను ఆకట్టుకునేందుకు పక్షుల చిత్రాలతో కూడిన బోర్డులను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకులకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పక్షుల కేంద్రానికి వచ్చే పర్యాటకులు ఈఈసీ కేంద్రం వద్ద పక్షి నమూనాల మ్యూజియాన్ని తిలకించాలని కోరారు. త్వరలో పక్షుల విశేషాలను వివరించే గైడ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆయన బోటు షికారులో పక్షులను తిలకించారు.