చైతన్య భారతి: టెస్సీ థామస్ / 1963 అగ్ని పుత్రిక
భువనేశ్వర్. జనవరి 3 మంగళవారం 2012. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్శిటీ క్యాంపస్. భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతున్నారు. పదిహేనువేల మంది సైంటిస్టులు, ఇరవై మంది నోబెల్ గ్రహీతలు, ఐదొందల మంది విదేశీ ప్రతినిధులు, లక్షమంది యువకులు, యువతులు శ్రద్ధగా వింటున్నారు.
తొంభై తొమ్మిదవ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ మొదలైన రోజది! సైన్స్ అండ్ టెక్నాలజీలో మనమింకా ఎంతో సాధించాలని అంటున్నారు మన్మోహన్. అంటూ అంటూ... సడెన్‌గా... మిస్సయిల్ ఉమన్ టెస్సీ థామస్‌ను మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అన్నారు. సదస్సు ఒక్కసారిగా బర్త్‌డే బెలూన్లా పేలింది. హర్షధ్వానాలు చెమ్కీ ముక్కలై గాల్లో తేలాయి! టెస్సీ థామస్ వంటి కృతనిశ్చయం గల మహిళలు మన అమ్ముల పొదిలో ఉంటే భారత్ ఇలాంటి అగ్నులు ఎన్నింటినైనా అలవోకగా కురిపించగలదనే భావం మన్మోహన్ మాటల్లో ధ్వనించింది. టెస్సీ... అగ్ని ప్రాజెక్టుకు డైరెక్టర్!
ఈ అగ్నిపుత్రికకు ఇన్స్పిరేషన్... తుంబా. కేరళ రాజధాని తిరువనంతపురానికి శివార్లలో ఉన్న అరేబియా తీర ప్రాంత గ్రామం ‘తుంబా’కు, టెస్సీ చదువుకున్న తీరప్రాంత పట్టణం అలప్పుళకు మధ్య కొన్ని వందల కి.మీ. దూరం ఉన్నప్పటికీ, ఆ దూరాన్ని ఇప్పుడు మనం... పన్నెండేళ్ల వయసులో టెస్సీ ఏర్పరచుకున్న జీవిత ధ్యేయంతో మాత్రమే కొలవాలి! టెస్సీకి ఇన్స్పిరేషన్ మనుషుల నుంచి రాలేదు.
తుంబాలో ఆనాడు తను చూసిన రాకెట్ ఎగిరే ప్రదేశం నుంచి వచ్చింది. సాదా సీదా చీరలో, చిరునవ్వుతో కనిపించే టెస్సీతో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు తక్షణ శక్తిలా ఆడపిల్లలకు తక్షణ ఆత్మవిశ్వాసం కలుగుతుంది. భవిష్యత్తుపై కొత్త ఆశతో వారి కళ్లు మెరుస్తాయి. ఏదైనా సాధించగలను అన్న ధీమా వస్తుంది!
1988లో పుణె నుంచి హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబరేటరీకి బదలీ అయిన కొత్తల్లో ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.పి.జె. కలామ్ ఇదే విధమైన ధీమాను, అత్మవిశ్వాన్ని టెస్సీలో కలిగించారు. ఆమె ప్రావీణ్యాలను మలిచిన మరో గురువు అవినాశ్ చందర్. అనతికాలంలోనే ఈ శిష్యురాలు తన గురువులిద్దరి ప్రఖ్యాతిని, డి.ఆర్.డి.ఓ. ప్రతిష్టను నిలబెట్టగలిగారు.
(చదవండి: ఎస్. త్రిపాఠీ నిరాలా / 1897–1961 కాలాతీత కవి)