ahmednagar district
-
అహ్మద్‌నగర్ కాదు.. అహల్యానగర్
ముంబై: దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాలు, వీధులకు పేర్లను మారుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలో షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి చర్యకే దిగింది. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చేసింది. బుధవారం చౌండీలో జరిగిన అహల్యాదేవి జయంతోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా ఈ ప్రకటన చేశారు. 18వ శతాబ్దంలో ఇండోర్ స్టేట్‌ను పాలించిన వీరవనితే అహల్యాదేవి హోల్కర్. ఆమె జన్మస్థలంలోనే.. అదీ 298 జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం షిండే ఈ ప్రకటన చేయడం విశేషం. అహ్మద్‌నగర్, పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని అహ్మద్ నిజాం షా పాలించారు. ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి అహ్మద్‌నగర్ పేరొచ్చిందని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ, అహల్యాదేవి హోల్కర్ లాంటి వాళ్లను ఆరాధ్యులుగా భావించి మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అహల్యాదేవి హోల్కర్కు సముచిత గౌరవం అందించాలనే ప్రజలందరి అభిష్టం మేరకు ఈ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చాం అని షిండే ప్రకటించారు. ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘‘మా కూటమిది పక్కా హిందుత్వ ప్రభుత్వమని, అహల్యాదేవి లాంటి వాళ్లు లేకపోతే కాశీ లాంటి సుప్రసిద్ధ క్షేత్రాలు ఉండేవే కావ’’ని చెప్పుకొచ్చారు. అంతకు ముందు షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఒస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన విషయాన్ని సైతం ఫడ్నవిస్ ప్రస్తావించారు. ఇదీ చదవండి: తన వేలితో తన కన్నే పొడుచుకున్న రాహుల్! -
థర్డ్ వేవ్ భయం: 8 వేల మంది చిన్నారులకు కరోనా!
ముంబై : దేశంలో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనకు గురిచేస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యల్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా మహరాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో 8 వేల మందికి పైగా చిన్నారులకు కోవిడ్ సోకింది. దీంతో వారికి చికిత్సను అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సాంగ్లిలో ప్రత్యేకంగా పిల్లలకోసం కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదుగురు పిల్లలు ఈ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ పరిణామాల గురించి స్థానిక కార్పొరేటర్ అభిజిత్ భోశ్లే మాట్లాడుతూ.. "మే నెలలో 8వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైరస్ సోకిన చిన్నారులకు ట్రీట్మెంట్ అందించేలా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. స్కూల్ వాతావరణం ఎలా ఉంటుందో.. కరోనా వార్డులను అదే తరహాలో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇక.. ‘‘జిల్లాకు చెందిన చిన్నపిల్లలో 10శాతం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. అందుకే థర్డ్ వేవ్ నుంచి చిన్నారుల్ని సంరక్షించేందుకు చిన్నపిల్లల వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు’’ అహ్మద్ నగర్ కలెక్టర్ తెలిపారు. చదవండి: వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్! -
కరువు నుంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన బగూజీ!
ముంబై: భూమాతను నమ్ముకున్న వాళ్లెవ్వరూ నష్టపోరని.. వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు మహారాష్ట్రకు చెందిన పోపట్‌రావు బగూజీ పవార్. ఒకానొకనాడు కరువుతో అల్లాడిన గ్రామం.. నేడు పచ్చదనంతో నిండిన ఆదర్శ గ్రామంగా మారడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే స్ఫూర్తితో ముందుకు సాగి భారత నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ దక్కించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని వర్షాభావ ప్రాంతంలో ఉన్న హివారే బజార్ అనే గ్రామానికి 1989లో సర్పంచ్‌గా బగూజీ ఎన్నికయ్యారు. హివారే బజార్ వరుస కరువులతో అతలాకుతలమై... పంటలు పండక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడేది. అక్కడ ఏడాదికి సగటున 15 ఇంచుల వర్షపాతం మాత్రం నమోదయ్యేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పాడి కూడా పెంచుకోవాలి.. అటువంటి సమయంలో సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన బగూజీ... ముందుగా అక్కడ కురుస్తున్న కొద్దిపాటి వర్షపు నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలా అన్న అంశంపై దృష్టి సారించారు. అన్నా హజారే విధానాలను అనుసరిస్తూ.. నీటి యాజమాన్య వ్యవస్థను మెరుగుపరిచారు. అంతేగాకుండా గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టారు. ఈ క్రమంలో కేవలం ఏడాది కాలంలోనే లక్షలాది చెట్లతో గ్రామం పచ్చదనం సంతరించుకుంది. దీంతో వర్షపాతం కూడా క్రమక్రమంగా పెరగసాగింది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచే దిశగా కాంటూర్ ట్రెంచెస్ విధానాల్ని బగూజీ అనుసరించారు. ఒక్క నీటి చుక్క కూడా వృథా కాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అదే విధంగా కేవలం వ్యవసాయంపైనే ఆధార పడకుండా ఆవులు, గేదెలు, మేకలు తదితర పశువుల పెంపకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. దీంతో అనతికాలంలోనే పాడి ఉత్పత్తి పెరిగి వారు లాభాలు గడించారు. (బత్తాయి పండ్ల వ్యాపారికి ‘పద్మశ్రీ’) హెచ్ఐవీ టెస్టు తప్పనిసరి కేవలం వ్యవసాయం, నీటి నిర్వహణపైనే కాకుండా గ్రామస్తుల ఆరోగ్యంపై కూడా బగూజీ శ్రద్ధ వహించేవారు. మద్యం కారణంగా అనారోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయంటూ వారిలో చైతన్యం నింపి.. మద్యాన్ని పూర్తిగా నిషేధించారు. అదే విధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందే హెచ్ఐవీ పరీక్ష చేసుకోవాలని నిబంధన విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో దీర్ఘకాలంలో హివారే బజార్ ఆదర్శగ్రామంగా రూపుదిద్దుకుంది. ఇక గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మాజీ సర్పంచ్ బగూజీని పద్మశ్రీ వరించింది. కాగా ప్రజాప్రతినిధిగా తనదైన ముద్ర వేసిన బగూజీ ప్రస్తుతం మహారాష్ట్ర మోడల్ విలేజ్ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. -
ఓటర్ల జాబితాలో షిర్డీ సాయిబాబా పేరు
షిర్డీ: అహ్మద్‌నగర్ జిల్లాలో ఈసీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఓ గుర్తుతెలియని వ్యక్తి అసాధారణ రీతిలో షిర్డీ సాయిబాబా పేరును స్ధానిక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించాడు. ఆన్లైన్ ఫామ్స్‌ను తనిఖీ చేస్తున్న సమయంలో దీన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సాయిబాబా చిరునామాగా షిర్డీ ఆలయాన్ని పేర్కొన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఐటీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాయిబాబా పేరును ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఫామ్ నెంబర్ 6ను నింపడం ద్వారా ఓ వ్యక్తి ప్రయత్నించాడని, ఫాంలను పరిశీలిస్తుండగా ఈ విషయం వెలుగుచూసిందని అధకారులు తెలిపారు. ఈ కేసును తొలుత అహ్మద్‌నగర్ జిల్లా సైబర్‌క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించిన పోలీసులు రహతా పోలీసులకు తిరిగి బదలాయించడంతో దర్యాప్తులో జాప్యం జరిగిందని పోలీసులు వెల్లడించారు. 2017 డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. షిర్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సాయిబాబాను ఓటర్‌గా నమోదు చేయించేందుకు ఆన్లైన్ రిజిస్ర్టేషన్ సిస్టమ్‌ను ఆశ్రయించిన వ్యక్తి సాయిబాబా వయసు 24 సంవత్సరాలుగా పేర్కొన్నాడని, తండ్రి పేరు రామ్‌గా ఉటంకించాడని, చిరునామాగా షిర్డీ ఆలయాన్ని ప్రస్తావించాడని అధికారులు తెలిపారు. -
షిర్డీ-హైదరాబాద్ బస్సులో దోపిడీ
ముంబై: మహారాష్ట్రలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీలో బస్సులో దోపిడీకి పాల్పడ్డారు. అహ్మద్‌నగర్ జిల్లా జాంఖేడ్ ప్రాంతంలో బస్సును ఆపి లోపలికి చొరబడిన 15 మంది దుండగులు ఈ దోపిడీ చేశారు. ప్రయాణికులను బెదిరించి నుంచి నగలు, నగదు దోచుకెళ్లారు. గత అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రయాణికులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ ప్రాంతంలో గతంలోనూ దోపిడీలు జరిగినట్టు తెలుస్తోంది.