శెనగ రైతులకు బీమా ఎందుకివ్వట్లేదు?
న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల వేరు శెనగ పంట రైతులకు బీమా ఇచ్చేందుకు అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీఐ) నిరాకరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రైతులు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఏఐసీసీ బీమా కల్పించేందుకు నిరాకరించిందని, అందుకుగల కారణాలేమిటో తెలియజేయాలని ఆయన రాజ్యసభలో వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖను డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్బీవై) లక్ష్యాలు, ఉద్దేశం ఏమిటని, దీనికింద ఏయే రకాల పంటలు కవర్ అవుతున్నాయని ప్రశ్నించారు.
దీనికి సంబంధితశాఖ సహాయమంత్రి పర్శోత్తమ్ రుపాల లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2016లో వేరుశెనగలాంటి పంటలకు బీమా కల్పించేందుకు బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీతో బిడ్డింగ్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుందని అందులో తెలియజేశారు. అలాగే, పీఎంఎఫ్బీవై ఉద్దేశం, లక్ష్యాలు తెలియజేస్తూ వ్యవసాయరంగంలో నిరంతర ఉత్పత్తిని ప్రోత్సాహించేందుకు ఈ పథకం తీసుకొచ్చామని వివరణ ఇచ్చారు. పంట విరామం, పంట నష్టం, ప్రకృతి విపత్తువంటి సమయాల్లో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక పోకడలను మరింత అనుసరించేలా నవీన కల్పనలను ప్రోత్సహిస్తామని చెప్పారు.