ajijpasa
-
రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి
యాదగిరిగుట్ట :తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి తక్షణమే రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని సీపీఐ జాతీయ నాయకుడు, ఆర్టీసీ ఈయూ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా డిమాండ్ చేశారు. బుధవారం గుట్టలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరీసీ కార్మికులకు రెండవ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తగిన బడ్జెట్‌ను ఆర్టీసీకి కేటాయించకపోతే మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. సీఎం కేసీఆర్ రాయితీలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయకపోతే సహించేది లేదన్నారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని ముఖ్యమంత్రి మరవొద్దన్నారు. అద్దె బస్సులను తీసుకోవాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. దీని వల్ల ఆర్టీసీ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తక్షణమే ఆర్టీసీ తెలంగాణ , ఆంధ్రా రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో విభజన చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం బకాయిలు పడటం వల్ల 25 వేల మంది కార్మికులకు రుణాలు అందడం లేదన్నారు. 22 వేల మంది కార్మికులు సీీసీఎస్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకొని పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల్లో సీసీఎస్ కోసం 8 శాతం డబ్బులు రికవరీ చేసి ఆ డబ్బులను ఆర్టీసీ యాజమాన్యం సొంతానికి వాడుకోవడం అన్యాయమన్నారు. సొసైటీ డబ్బులను ఆర్టీసీ యాజమాన్యం సొంతానికి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. దీని వల్ల రూ. 25 కోట్ల వడ్డీ సొసైటీకి నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వకుంటే వచ్చే నెల 11 నుంచి కార్మికులమంతా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. శిక్షణ తరగతుల్లో ఆ సంఘం నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, గోద శ్రీరాములు, బొల గాని సత్యనారాయణ, పి.ఉపేందర్, వెంకటేశ్వర్లు , నల్లమాస జగదీశ్‌గౌడ్, మల్లయ్య, శ్రీనివాస్, పద్మ, చారి, డీఏ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు. -
కామ్రేడ్..కాస్కో!
మహేశ్వరం నియోజకవర్గంలో సీపీఐ-కాంగ్రెస్ పొత్తు అపహాస్యం పొత్తులో సీటు సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్ బీఫారం ఇచ్చి మల్‌రెడ్డితో నామినేషన్ వేయించిన అదే పార్టీ సీపీఐ తరఫున అజీజ్‌పాషా,కాంగ్రెస్ తరఫున మల్రెడ్డి సాక్షి,రంగారెడ్డిజిల్లా: కామ్రేడ్ల-కాంగీయుల పొత్తు ఆదిలో హంసపాదయ్యింది. ఇలా సీట్లు ఇస్తున్నట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సీపీఐకి గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన సీపీఐకి కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. ఇందుకు పార్టీ సీనియర్‌నేత అజీజ్‌పాషా నామినేషన్ కూడా వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే స్థానంలో అభ్యర్థిని నిలబెట్టింది. మల్రెడ్డి రంగారెడ్డికి బీ ఫారంఇచ్చి నామినేషన్ వేయించింది. అయితే మల్‌రెడ్డితో నామినేషన్‌ను ఉపసంహరింపజేయాలని సీపీఐ నాయకులు కాంగ్రెస్‌పై చేసిన ఒత్తిడి ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆయన బరిలో నిలిచి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. నారాయణ అసహనం : మహేశ్వరం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలపడంపై సీపీఐ కార్యదర్శి నారాయణ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను శుక్రవారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బహిరంగంగానే ప్రశ్నించారు. తమకు సీటు కేటాయించి మల్‌రెడ్డికి మళ్లీ పార్టీ బీ ఫారం ఎందుకిచ్చారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పొన్నాల స్పందిస్తూ హైకమాండ్ ఆదేశాల మేరకే మల్‌రెడ్డికి బీఫారం ఇచ్చామని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చినప్పటికీ పోటీనుంచి తప్పుకోవాల్సిందిగా మల్‌రెడ్డిని ఆదేశించానని తెలిపారు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం శనివారం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అంతేకాకుండా శనివారం బడంగ్‌పేటలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను పోటీలో ఉన్నానని, తన గెలుపునకు సహకరించాలని కోరారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయమై నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి అజీజ్‌పాషా మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో ఆపార్టీ నియోజకవర్గ శ్రేణులు డైలమాలో పడ్డాయి. ఇరుపార్టీల మధ్య తెరచాటు ఒప్పందమేమైనా కుదిరిందా..అని అనుమానపడుతున్నాయి. ఎంతైనా కాంగ్రెస్ మార్కు రాజకీయం కదా..!!