కామ్రేడ్..కాస్కో! | Maheshwaram constituency | Sakshi
Sakshi News home page

కామ్రేడ్..కాస్కో!

Published Sun, Apr 13 2014 4:26 AM | Last Updated on Mon, Aug 13 2018 8:27 PM

కామ్రేడ్..కాస్కో! - Sakshi

కామ్రేడ్..కాస్కో!

  •    మహేశ్వరం నియోజకవర్గంలో
  •    సీపీఐ-కాంగ్రెస్ పొత్తు అపహాస్యం
  •   పొత్తులో సీటు సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్
  •   బీఫారం ఇచ్చి మల్‌రెడ్డితో నామినేషన్ వేయించిన అదే పార్టీ
  •   సీపీఐ తరఫున అజీజ్‌పాషా,కాంగ్రెస్ తరఫున మల్‌రెడ్డి
  • సాక్షి,రంగారెడ్డిజిల్లా: కామ్రేడ్ల-కాంగీయుల పొత్తు ఆదిలో హంసపాదయ్యింది. ఇలా సీట్లు ఇస్తున్నట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సీపీఐకి గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన సీపీఐకి కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు.

    ఇందుకు పార్టీ సీనియర్‌నేత అజీజ్‌పాషా నామినేషన్ కూడా వేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే స్థానంలో అభ్యర్థిని నిలబెట్టింది. మల్‌రెడ్డి రంగారెడ్డికి బీ ఫారంఇచ్చి నామినేషన్ వేయించింది. అయితే మల్‌రెడ్డితో నామినేషన్‌ను ఉపసంహరింపజేయాలని సీపీఐ నాయకులు కాంగ్రెస్‌పై చేసిన ఒత్తిడి ఏ మాత్రం ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆయన బరిలో నిలిచి ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు.
     
    నారాయణ అసహనం : మహేశ్వరం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలపడంపై సీపీఐ కార్యదర్శి నారాయణ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను శుక్రవారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో బహిరంగంగానే ప్రశ్నించారు. తమకు సీటు కేటాయించి మల్‌రెడ్డికి మళ్లీ పార్టీ బీ ఫారం ఎందుకిచ్చారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

    దీనిపై పొన్నాల స్పందిస్తూ హైకమాండ్ ఆదేశాల మేరకే మల్‌రెడ్డికి బీఫారం ఇచ్చామని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చినప్పటికీ పోటీనుంచి తప్పుకోవాల్సిందిగా మల్‌రెడ్డిని ఆదేశించానని తెలిపారు. కానీ మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం శనివారం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. అంతేకాకుండా శనివారం బడంగ్‌పేటలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను పోటీలో ఉన్నానని, తన గెలుపునకు సహకరించాలని కోరారు.

    సోమవారం నుంచి పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ విషయమై నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి అజీజ్‌పాషా మాత్రం నోరుమెదపడం లేదు. దీంతో ఆపార్టీ నియోజకవర్గ శ్రేణులు డైలమాలో పడ్డాయి. ఇరుపార్టీల మధ్య తెరచాటు ఒప్పందమేమైనా కుదిరిందా..అని అనుమానపడుతున్నాయి. ఎంతైనా కాంగ్రెస్ మార్కు రాజకీయం కదా..!!
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement