AK Sinha
-
ఎస్పీజీ డైరెక్టర్ ఏకే సిన్హా కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ(special protection group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 2016 నుంచి SPG డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఆయన. అంతకు ముందు ఆ పొజిషన్ 15 నెలలు ఖాళీగా ఉండడం విశేషం. ఈ ఏడాది మే 30వ తేదీన ఆయన పదవీ కాలం ముగియగా.. అంతకు ముందు రోజే ఆయన పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులపై ప్రధాని మోదీ సంతకం చేశారు. ఎస్పీజీ డైరెక్టర్ బాధ్యతల కంటే ముందు ఆయన.. కేరళ డీజీపీ(ప్రత్యేక సేవలు, ట్రాఫిక్) నిర్వర్తించారు. కేరళ క్యాడర్‌కు చెందిన అరుణ్ కుమార్ సిన్హా.. 1987 ఐపీఎస్ బ్యాచ్. ఆ రాష్ట్ర పోలీస్‌విభాగంలో పలు బాధ్యతలు కూడా నిర్వహించారాయన. ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ.. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటన తర్వాత ఏర్పాటైంది. 1985 నుంచి ఇది ప్రధానులకు, మాజీ ప్రధానులకు, వాళ్ల వాళ్లకు కుటుంబ సభ్యలకు భద్రత కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రధాని, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలను మాత్రమే చూసుకుంటోంది. -
అమరావతిలో పటిష్ట కట్టడాలుండాలి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న భవంతులు భారత బిల్డింగ్ కోడ్‌కు అనుగుణంగా, విపత్తులను తట్టుకునేలా పటిష్టంగా ఉండాలని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, డిజాస్టర్ మేనే జ్మెంట్ అథారిటీ బిహార్ వైస్ చైర్మన్ ఎ.కె.సిన్హా సూచించారు. విపత్తులు సంభవించినప్పుడు జరిగే ప్రాణనష్టంలో అధికశాతం నాణ్యత లేని భవనాల వల్లేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతమైనందున మరింత జాగ్రత్తలు అవసరమన్నారు. రెండవ ప్రప చ డిజాస్టర్ మేనే జ్మెంట్ సదస్సులో మూడో రోజు శనివారం మూడు ప్లీనరీలు, 9 సెషన్లు జరిగాయి. అనంతరం శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సిన్హా మాట్లాడారు. పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్, కార్యాలయాల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే విపత్తుల వేళ భారీ ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని చెప్పారు. వీటి నాణ్యతా లోపంపై ప్రశ్నించాలని, నిబంధనలు పాటించాలని యాజమాన్యాలను ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. గతంలో గుజరాత్లో సంభవించిన భూకంపంలో పటిష్టంగా లేని పాఠశాల భవనం కూలి 900 మంది చిన్నారులు దుర్మరణం పాలయ్యారని గుర్తుచేశారు. ప్రభుత్వాల అలసత్వం వల్ల అమాయక ప్రజలు బలికాకూడదన్నారు. ప్రకృతి వైపరీతాల్లో ప్రమాదాల తీవ్రత తగ్గేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. భూకంప తీవ్రతపై మాట్లాడుతూ రిక్టర్‌స్కేలుపై ప్రతి ఒక్క పాయింట్ పెరుగుదలకు 33 రెట్ల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ముందస్తుగా విపత్తులను గుర్తించడం, వాటి తీవ్రతపై అంచనా వేయడం, ప్రాణ, ఆస్తినష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమావేశంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎస్.ఆనందబాబు పాల్గొన్నారు. -
నిజాయితీని కాపాడతా
' సీబీఐ కొత్త అధిపతి ఏకే సిన్హా ' సవాళ్లే అవకాశాలుగా స్వీకరిస్తానని వెల్లడి న్యూఢిల్లీ: సీబీఐ డెరైక్టర్‌గా నియమితుడైన ఐపీఎస్ అధికారి అనిల్‌కుమార్ సిన్హా బుధవారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బొగ్గు, 2జీ స్పెక్ట్రం కేసుల విషయంలో కోర్టులనుంచి సీబీఐ అభిశంసనలు ఎదుర్కొంటున్న దశలో సీబీఐ చీఫ్‌గా ఏకే సిన్హా పగ్గాలు చేపట్టారు. గతంలో 21 నెలలపాటు సీబీఐ ప్రత్యేక డెరైక్టర్ హోదాలో పనిచేసిన అనుభవం ఉన్న సిన్హా, శారదా కుంభకోణం కేసుపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించారు. సిన్హా నియామకంలో బిహార్‌కు చెందిన ముగ్గురు సీబీఐ డెరైక్టర్లుగా వరుసగా నియమితులయ్యారు. ఇప్పటికే సీబీఐ డెరైక్టర్లుగా పనిచేసిన రంజిత్ సిన్హా, ఏపీ సింగ్ కూడా బిహార్ అధికారులే. సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సిన్హా తన ప్రాధాన్యతలను మీడియాకు వెల్లడించారు. అతిప్రధానదర్యాప్తు సంస్థ సారథ్య బాధ్యతలను వినమ్రతతో స్వీకరించానని, సీబీఐ ఎదుర్కొంటున్న సవాళ్లేమిటో తెలుసునని, సమర్థంగా పనిచేసేందుకు సవాళ్లే అవకాశాలన్నారు. కష్టపడి పనిచేయడం, నిష్పాక్షికత, నిజాయితీ వంటి సీబీఐ ఆశయాల కోసం కట్టుబడి ఉంటామని తెలిపారు. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్.. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఏకే సిన్హా, హార్వర్డ్ వర్సిటీ విద్యార్థి. గత ఏడాదిలో సీబీఐ అధికారిగా చేరిన సిన్హా, గతంలో పలు ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా, బిహార్ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. సీబీఐలో శారదా స్కాం సహా పలు ముఖ్య కేసులను పర్యవేక్షించారు. ప్రతిభావంతమైన సేవలకుగాను సిన్హాకు 2000లో పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకం లభించాయి. ఐపీఎస్ అధికారిగా 1979లో చేరిన సిన్హా 18 ఏళ్లు బిహార్‌లోని వివిధ జిల్లాలకు ఎస్పీగా, స్పెషల్ బ్రాంచ్ డీఐజీగా ఉన్నారు. 1998-2005 మధ్య కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లి, ప్రత్యేక రక్షణ దళం (ఎస్పీజీ) డీఐజీగా పనిచేశారు. 2005లో తిరిగి బిహార్ వెళ్లి అదనపు డీజీ హోదాలో పనిచేశారు. 2010లో తిరిగి డిప్యుటేషన్‌పై కేంద్రానికి వచ్చి విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా చేరి 2013 వరకూ కొనసాగారు. 2013 మేలో సీబీఐ స్పెషల్ డెరైక్టర్‌గా చేరారు.