సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న భవంతులు భారత బిల్డింగ్ కోడ్‌కు అనుగుణంగా, విపత్తులను తట్టుకునేలా పటిష్టంగా ఉండాలని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, డిజాస్టర్ మేనే జ్‌మెంట్ అథారిటీ బిహార్ వైస్ చైర్మన్ ఎ.కె.సిన్హా సూచించారు.
విపత్తులు సంభవించినప్పుడు జరిగే ప్రాణనష్టంలో అధికశాతం నాణ్యత లేని భవనాల వల్లేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తుపాన్లు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతమైనందున మరింత జాగ్రత్తలు అవసరమన్నారు. రెండవ ప్రప చ డిజాస్టర్ మేనే జ్‌మెంట్ సదస్సులో మూడో రోజు శనివారం మూడు ప్లీనరీలు, 9 సెషన్లు జరిగాయి. అనంతరం శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సిన్హా మాట్లాడారు.
పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్‌మాల్స్, కార్యాలయాల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే విపత్తుల వేళ భారీ ప్రాణనష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని చెప్పారు. వీటి నాణ్యతా లోపంపై ప్రశ్నించాలని, నిబంధనలు పాటించాలని యాజమాన్యాలను ప్రజలు డిమాండ్ చేయాలన్నారు. గతంలో గుజరాత్‌లో సంభవించిన భూకంపంలో పటిష్టంగా లేని పాఠశాల భవనం కూలి 900 మంది చిన్నారులు దుర్మరణం పాలయ్యారని గుర్తుచేశారు.
ప్రభుత్వాల అలసత్వం వల్ల అమాయక ప్రజలు బలికాకూడదన్నారు. ప్రకృతి వైపరీతాల్లో ప్రమాదాల తీవ్రత తగ్గేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. భూకంప తీవ్రతపై మాట్లాడుతూ రిక్టర్‌స్కేలుపై ప్రతి ఒక్క పాయింట్ పెరుగుదలకు 33 రెట్ల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ముందస్తుగా విపత్తులను గుర్తించడం, వాటి తీవ్రతపై అంచనా వేయడం, ప్రాణ, ఆస్తినష్టాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపట్టడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమావేశంలో సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎస్.ఆనందబాబు పాల్గొన్నారు.