'జగదీశ్‌రెడ్డి అవినీతిపై ఆధారాలున్నాయి'
చిట్యాల : ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సూర్యాపేట కోర్డుకు హాజరయ్యేందుకు వెళుతూ నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం ఆయన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. ఇందుకోసం ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చీరాక మునుపే పదవి నుంచి సీఎం కేసీఆర్ అవమానకరంగా తొలగించారని పేర్కొన్నారు. అదే మంత్రి జగదీష్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తామని తాము సవాలు విసురుతుంటే ఆ మంత్రి ఇంట్లో సీఎం విందుకు వెళ్లటం విడ్డూరమన్నారు. జగదీష్‌రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపించుకునేందుకు బదులు సూర్యాపేట కోర్డులో కేసు వేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి వాటికి తాను భయపడబోనని స్పష్టం చేశారు.
కాగా పరువు నష్టం కేసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గురువారం మధ్యాహ్నం సూర్యాపేట ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతికి పాల్పడినట్లు పొన్నం చేసిన ఆరోపణలు విషయం విదితమే. దీనిపై మంత్రి ఫిబ్రవరి 24వ తేదీన సూర్యాపేట ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, న్యాయమూర్తి ఈ కేసును జూన్ 3వ తేదీకి వాయిదా వేశారు.