ప్రతికూల వాతావరణం వల్లే కూలిన విమానం
అల్జీర్స్/బమకా: అల్జీరియా విమానం ఏహెచ్5017 కూలిపోవడానికి ప్రతికూల వాతావరణమే కారణమై ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్మాలెక్ సెల్లాల్ పేర్కొన్నారు. బర్కినా ఫాసో నుంచి అల్జీరియా వెళతున్న విమానం ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో ఈనెల 24 గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 118 మంది మృతి చెందారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత దట్టమైన మేఘాలు, బలమైన గాలులు, ఇసుక తుపాను వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనట్లు ఆయన చెప్పారు. కూలిపోవడానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని ఫ్రెంచ్ విమానయాన నిపుణులు తనిఖీ చేశారని, మంచి స్థితిలోనే ఉందన్నారు. ఈ విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్‌లను పరీక్షల కోసం ఫ్రాన్స్‌కు పంపినట్లు ఫ్రెంచ్ దౌత్యాధికారి మాలి రాజధాని బమకాలో చెప్పారు.
ఇదిలా ఉండగా అల్జీరియా విమానం ఘటనపై నిపుణులు దర్యాప్తు చేస్తోంది. పూర్తిగా మంటల్లో కాలిపోయిన విమాన శకలాల నుంచి శనివారం రెండో బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని, అందుకే ముక్కలుచెక్కలై అర కిలోమీటరు పరిధిలో శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారంతా మరణించారు. కొన్ని కుటుంబాలకు చెందిన అందరూ దుర్మరణం చెందారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబంలోని 10 మందీ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఛిద్రమైన, కాలిపోయిన మృతుల అవయవాలు మాత్రమే సంఘటనాస్థలంలో లభించాయని, దీంతో మతదేహాల గుర్తింపు వీలుకావడం లేదని అధికారులు పేర్కొన్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు మలేసియా విమానం ఎమ్హెచ్17 కూల్చివేతకు గురైన ప్రాంతం (ఉక్రెయిన్)లో అంతర్జాతీయ పోలీసుల బందం పర్యటన రద్దయింది. రష్యా అనుకూల మద్దతుదారుల ప్రాబల్యం ఉన్న సంబంధిత ప్రాంతంలో దాడులు జరుగుతుండడమే దీనికి కారణమని పోలీసు బృందం అధిపతి అయిన అలెగ్జాండర్ హగ్ చెప్పారు.