Alibaba Company
-
ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన అలిబాబా జాక్‌మా
అలీబాబా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చేది జాక్‌మా, ఈకామర్స్ బిజినెస్. కానీ సంస్థ ఛైర్మన్‌గా వైదొలిగిన జాక్‌మా తాజాగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించారని తెలిసింది. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను విక్రయించే కొత్త సంస్ధను జాక్ మా మొదలుపెట్టారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అలీబాబా ఛైర్మన్‌గా జాక్ మా 2019లో తన పదవి నుంచి వైదొలిగారు. తాజాగా ఎఫ్ఎంసీజీ కంపెనీని స్థాపించినట్లు తెలిసింది. జాక్ మా ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ పేరు హంగ్‌ఝూ మా కిచెన్ ఫుడ్‌గా నిర్ణయించారు. జాక్ మా స్వస్ధలం హంగ్‌ఝూ. అదే పేరును తన కొత్త బిజినెస్‌కు పెట్టారని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఈ కంపెనీ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ మీల్స్, ఎడిబుల్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తుంది. కరోనా మహమ్మరి అనంతరం ప్యాకేజ్డ్ ఫుడ్‌కు డిమాండ్ పెరగడం, జీవన శైలి మార్పుల కారణంగా జాక్ మా ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక చైనాలో రాబోయే మూడేళ్లలో దేశీ రెడీ మీల్స్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు
ఆధునిక కాలంలో బైక్ కొనాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టాల్సిందే.. కానీ కారు కొనాలంటే ఎంత వెచ్చించాలో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం రూ. 99,000లకే ఎలక్ట్రిక్ కారు లభించిందంటే చాలామందికి నమ్మశక్యం కాదు. అయితే ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి చైనాకు చెందిన 'అలీబాబా' కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుని తయారు చేసింది. ముందు భాగంలో పులి ఆకారంలో ఉన్న ఈ కారు కేవలం రెండు సీట్లను మాత్రమే కలిగి ఉంది. అంటే ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది వీక్ పేరిట సేల్ నిర్వహించిన అందులో ఈ కారుని 1199 డాలర్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 99,000 వరకు ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇది గంటకు 120 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది కంపెనీ తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ వినియోగానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ కారుని చైనాలో తప్పా ఇతర దేశాలకు తీసుకెళ్లే ఛాన్స్ లేదు. మొత్తానికి ఇది టాటా నానో కారుకంటే తక్కువ ధరకే లభించిందని తెలిసిపోతోంది. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? కారు చిన్నగా ఉండటం వల్ల పార్కింగ్ కోసం తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఈ ఎలక్ట్రిక్ కారులో 35 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 47 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కావున పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశానికి రాదనే తెలుస్తోంది. -
ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో రెండుసార్లు ఫెయిల్.. నేడు చైనాలో కుబేరుడు!
Richest Man in China Jack Ma Success Story: విశాలమైన విశ్వంలోనే అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి ఈ రోజు చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేతగా అందరికి తెలుసు. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ ఒక దిగువ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతడు అతిథులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు. ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేశాడు. ఇది తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసేవాడు జాక్. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికి భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు. విద్య & ఉద్యోగ జీవితం ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాశాడు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించాడు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు. చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడుగులు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా సెలక్ట్ కాకపోవడం గమనార్హం. ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభం ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో మొదటి సంస్థ 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించి ఆంగ్ల అనువాదం, వివరణను అందించడం ప్రారంభించాడు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని పొందాడు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. అక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. అంతర్జాలం అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. అప్పుడు అతడు యాహూలో సెర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం ఏమి దొరకలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రూ. 1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. ఇంటర్నెట్తో ప్రత్యర్థులకు పోటీ జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్‌కు చెప్పాడు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నాడు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) ఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ 1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించాడు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం ఆధునిక కాలంలో ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఇలాంటి మరిన్ని కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. -
ఓపెన్ సెసేమ్...ఇదిగో ‘అలీబాబా’ విజయరహస్యం!
చైనాకు చెందిన ‘అలీబాబా’ కంపెనీ తన వెబ్ పోర్టల్స్ ద్వారా సేల్స్ సర్వీస్‌లు అందిస్తూ ‘ఇ-కామర్స్’ దిగ్గజంగా ఎదిగింది. మొన్నటికి మొన్న ‘సింగిల్స్ డే’ వ్యాపార ఉత్సవంలో సరికొత్త రికార్డ్ సృష్టించి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘అరేబియన్ నైట్స్’ కథల్లో నిధి ఉన్న గుహద్వారం తెరవడానికి అలీబాబాకు ‘ఓపెన్ సెసేమ్’ మంత్రం ఉపయోగపడింది. ‘నిధి, మంత్రం... రెండూ నీలోనే ఉన్నాయి. సత్తా, సామర్థ్యం నీలో ఉన్న నిధులు. అయితే కష్టించడం, కొత్తగా ఆలోచించడం అనేవి గుహ ద్వారాలు తెరిచే మంత్రాలు’ అంటాడు ‘అలీబాబా’ అనే ఇ-కామర్స్ దిగ్గజం జాక్ మా. చైనాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జాక్ మా ఇప్పుడు చైనాలోనే అత్యంత సంపన్నుడు. ఈ అలీబాబాకు మంత్రం కంటే మనోధైర్యమే ఉపయోగపడింది. ఒక్కసారి ఆయన జీవితంలోకి వెళ్లొద్దాం.... ఇంగ్లిష్ అనేది ప్రపంచ భాష. ఇంగ్లిష్ వస్తే ప్రపంచంతో సంభాషించే అవకాశం వచ్చినట్లే. అందుకే ఇంగ్లిష్ అంటే జాక్ మాకు ఇష్టం. కానీ, చైనాలో ఇంగ్లిష్ అనేది అరుదుగా మాత్రమే వినబడేది. పాఠశాలలో నేర్చుకున్న ఇంగ్లిష్ వల్ల కూడా అంతంత మాత్రమే ఉపయోగం ఉండేది. దీంతో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి హైస్కూలు రోజుల్లోనే రంగంలోకి దిగాడు జాక్. ఎండైనా, వానైనా, చలైనా లెక్క చేయకుండా బైక్ మీద విదేశీ పర్యాటకులను వెతుక్కుంటూ వెళ్లేవాడు. వారితో తనకొచ్చిన ఇంగ్లిష్ మాట్లాడేవాడు. వారు మాట్లాడుతున్నది జాగ్రత్తగా వినేవాడు. అలా ఎనిమిదేళ్ళలో జాక్ మాకు ఇంగ్లిష్ మీద మాంచి పట్టు వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లొచ్చిన తరువాత... విదేశీ పర్యాటకులతో మాట్లాడడం అనే సరదాలో భాగంగా చైనాకు వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ కుటుంబంతో జాక్‌కు పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. పరస్పరం ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకొనేవారు. వారి ఆహ్వానం మేరకు ఒకసారి వేసవి సెలవుల్లో ఆస్ట్రేలియా వెళ్లి నెలరోజులు గడిపాడు జాక్. ‘‘ప్రతి విషయం గురించి కొత్తగా ఆలోచించడం ఎలాగో అప్పటి నుంచే అలవడింది’’ అంటాడు జాక్. ఒక్క ఉద్యోగమూ రాలేదు! ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నప్పుడు... అదృష్టమో, దురదృష్టమో గానీ జాక్‌కు ఒక్క ఉద్యోగమూ రాలేదు. చివరి ప్రయత్నంలో మాత్రం ‘కెంటకీ ఫ్రైడ్ చికెన్’ (కె.ఎఫ్.సి)లో జనరల్ మేనేజర్‌కు సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. ఒక వ్యాపార సదస్సులో పాల్గొనడానికి సీటెల్ (అమెరికా)కు వెళ్లిన జాక్ తొలిసారిగా మిత్రుడి ద్వారా ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. నిజానికి పర్సనల్ కంప్యూటర్, ఇ-మెయిల్స్ గురించి జాక్‌కు అప్పటి వరకు బొత్తిగా తెలియదు. ఎప్పుడూ కీబోర్డ్‌ను టచ్ చేసింది కూడా లేదు. అలా మొదలైంది! ఇ-కామర్స్ అనే మాట వినబడుతున్నప్పటికీ అప్పటికి అది ఇంకా చైనాలో వ్యాప్తిలోకి రాలేదు. ఆ సమయంలో జాక్‌కు తనకంటూ ఒక ఇ-కామర్స్ కంపెనీ ఉండాలనే ఆలోచన వచ్చింది. 1999లో జాక్ తన ఇంటికి 18 మందిని పిలిచి ‘ఇ-కామర్స్’ గురించి తన ఆలోచనను వాళ్లతో పంచుకున్నాడు. రెండు గంటల సమావేశం తరువాత ఆ 18 మంది తమ వాటాగా తలా కొంత డబ్బును టేబుల్ మీద పెట్టారు. కంపెనీ పేరు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైనది కావాలనుకున్నాడు. అలా అలీబాబా కథ తెర మీదికి వచ్చింది. ‘ఓపెన్ సెసేమ్’ అంటూ నిధులున్న గుహ ముందు అలీబాబా ఇచ్చే ఆదేశం గురించి తెలియంది ఎవరికి! అందుకే ‘అలీబాబా’ అనేది గ్లోబల్ నేమ్‌గా అనిపించి ఆ పేరే తన కంపెనికీ పెట్టాడు జాక్ మా. ఏమీ లేక పోయినా... ‘గ్లోబల్ విజన్’ ఉండగానే సరిపోదు. దానికి ‘స్థానికత’ కూడా తోడవ్వాలి అని నమ్మాడు జాక్. పెద్దగా డబ్బు లేకపోయినా, సాంకేతిక జ్ఞానం అంతంతమాత్రంగానే ఉన్నా, ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం లాంటి జాగ్రత్తలు పాటించాడు. మిగిలిన చైనా కంపెనీలలాగా అమెరికా మోడల్‌ను కాపీ కొట్టకుండా తనదైన విధానానికి రూపకల్పన చేసుకున్నాడు. అలాగే, నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. అంతే! ‘అలీబాబా’ ఇ-కామర్స్ కంపెనీ అనుకున్న దానికంటే ఎక్కువ విజయమే సాధించింది. భవిష్యత్తులో... పది లక్షల ఉద్యోగాలను సృష్టించడం, చైనా ఆర్థిక-సామాజిక పరిస్థితులను మార్చడం, చైనాను ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా తీర్చిదిద్దడం... ఇవన్నీ తన ఆశయాలని చెబుతున్నాడు జాక్ మా. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అసాధారణ విజయం సాధించిన జాక్ మా తన సరికొత్త ఆశయాన్ని నెరవేర్చుకుంటాడు అనడంలో అణుమాత్రమైనా సందేహం లేదు! సామాజిక స్పృహ ఏడేళ్ళ క్రితం... సూప్ కోసం షార్క్‌లను చంపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘నాతో పాటు నా కుటుంబసభ్యులు ‘షార్క్ సూప్‌ను జీవితంలో ముట్టం’’ అని నిర్ణయం తీసుకున్నాడు జాక్. అంతేకాదు... అలీబాబా గ్రూప్ తన ఇ-కామర్స్ వేదిక నుంచి ‘షార్క్ ఫిన్ సూప్’ ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించింది. అలాగే, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి కూడా తగిన ప్రణాళికలు వేసుకుంటున్నాడు జాక్. ‘అలీబాబా’ వార్షిక ఆదాయం లో కొంత మొత్తాన్ని... పర్యావరణ పరిరక్షణ సంబంధ కార్యక్రమాలకు కేటాయిస్తున్నాడు. నేనూ... నా తత్త్వం! జాక్ మా కరడుగట్టిన వ్యాపారి కాదు. వ్యాపారం చేయడం, అందులో విజయం సాధించడం అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకుంటాడు. ఒక రచయితలా, తాత్వికుడిలా జీవితానికి సంబంధించి భిన్నంగా ఆలోచిస్తుంటాడు. ఆయన ఆలోచనలలో కొన్ని... విజయ సాధనకు కష్టపడడం ఎంత ముఖ్యమో, ఓర్పు అంత కంటే ముఖ్యం. రాత్రికి రాత్రే విజయాలు రావు. అందుకే అంటాను... ఓపిక అత్యవసరం అని! నన్ను నేను సాధారణ మనిషి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. నాకు తెలిసిన సాంకేతిక జ్ఞానం చాలా తక్కువ. తెలిసినదాన్ని నా దృష్టితో కాకుండా సామాన్యులైన వినియోగదారుల దృష్టి నుంచే చూడడానికి ఇష్టపడతాను. నీ పోటీదారు నుంచి నేర్చుకో! కానీ మక్కికి మక్కీ కాపీ కొట్టకు. అలా చేస్తే నీకు నువ్వు హాని చేసుకున్నట్లే! నిజంగా చెప్పాలంటే నేను ఎంతమాత్రం సంతోషంగా లేను. ‘చైనాలో అత్యంత సంపన్నుడు’ అనే గుర్తింపు నన్ను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తోంది. అయినప్పటికీ నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను సంతోషంగా లేకుంటే నా సహచర సిబ్బంది సంతోషంగా ఉండరు. వారు లేకపోతే వినియోగదారులు ఉండరు. వ్యాపార విజయాలు మాత్రమే నాలో సంతోషాన్ని నింపవు. ఈ జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి చాలా అంశాలు ఉన్నాయి.