నగరంలో ‘ఐఎస్ఐఎస్’ జాడలు
ఇరాక్ వెళ్లేందుకు సిద్ధమైన 42 మంది
మతగురువు సమాచారంతో వెలుగులోకి
కౌన్సెలింగ్ చేసి నిఘా పెంచిన పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉగ్రవాద జాడలు విస్తరిస్తున్నాయి.. నిన్నటి వరకు ఐ.ఎస్.ఐ., అల్‌కాయిదా సంస్థల మాటే వినిపించగా... ఇప్పుడు కొత్తగా ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పేరు వినిపిస్తోంది. సోషల్‌మీడియా ద్వారా నగరంలోని ‘సాఫ్ట్’యువతను ఉగ్రవాదంపై మళ్లించేందుకు ఉగ్రసంస్థలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఓ మతగురువు సమాచారంతో తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. నగరంలోని హుమాయూన్‌నగర్‌లోని ఓ మతగురువు కుమారుడు (25) నాలుగు నెలల కిందట ఇంట్లో నుంచి పారిపోయాడు. వెళ్లేముందు ‘‘నేను జిహాద్ (పవిత్ర యుద్ధం) కోసం వెళుతున్నాను. నా కోసం వెతకొద్దు’’ అని లేఖరాసి పెట్టాడు. ఈ విషయాన్ని మతగురువు ఓ ఐపీఎస్ అధికారికి తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు యువకుడి ని పట్టుకొని విచారించారు.
విచారణలో దిమ్మతిరిగే నిజాలు...
యువకుడి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోషల్‌మీడియా ద్వారా తాము ఉగ్రవాదం వైపు ఆకర్షితులమయ్యామని, తనలా జిహాద్ కోసం ఇరాక్ వెళ్లేందుకు 42 మంది సిద్ధమయ్యారని పోలీసులకు తెలిపాడు. ఇరాక్ వెళ్లేందుకు తమ బ్యాంకు అకౌంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు కూడా జమ చేశారని చెప్పాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. రెండు నెలల కిందట బంగ్లాదేశ్ సరిహద్దులు దాటేందుకు యత్నించి పట్టుబడిన నలుగురితోపాటు యువకుడు చెప్పిన అందరినీ తీసుకొచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
వైద్యవిద్యార్థిని... సాఫ్ట్వేర్ ఇంజనీర్..
ఐఎస్ఐఎస్ సంస్థ వైపు ఆకర్షితులైన వారిలో ఒక వైద్యవిద్యార్థిని కూడా ఉంది. నగరశివార్లలోని ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) ఫేస్బుక్ ద్వారా జిహాద్ వైపు ఆకర్షితురాలైంది. తాను ఐఎస్ఐఎస్లో చేరతానని తల్లికి కూడా చెప్పింది. వీరిరువురికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే, ఐఎస్ఐఎస్ సంస్థలో చేరేందుకు సిద్ధమైన ముషీరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మునావద్ సల్మాన్ (30)ను మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు.
అప్రమత్తతతో ఉన్నాం: ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేవారిని కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇలాంటి వారిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అందుకే వారిని బైండోవర్ చేసి నిరంతరం నిఘా పెంచుతాం. సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాం.
- మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్.